షరతులపై ఇయ్యాల క్లారిటీ.. సీఎం రివ్యూ

సీఎం ఆదేశాల మేరకు మంత్రి పువ్వాడ అజయ్​ కుమార్​ శుక్రవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అధికారులతో సమీక్ష జరిపారు. కార్మికులను  డ్యూటీలో చేర్చుకునేందుకు పెట్టాల్సిన కండిషన్లపై చర్చించినట్టు తెలుస్తోంది. సమ్మె కాలానికి జీతం ఇవ్వబోమని, భవిష్యత్తులో కార్మికులు సమ్మె చేయకూడదని, యూనియన్లకు దూరంగా ఉండాలనే షరతులు అందులో ఉన్నట్టు తెలుస్తోంది. 5,100 రూట్ల ప్రైవేటీకరణకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో ఆ రూట్లతో పాటు హైర్‌ బస్సులు పోను మిగిలే ఆర్టీసీ బస్సులకు ఎంతమంది సిబ్బంది అవసరం..? అని లెక్కలు వేసినట్టు సమాచారం. ఈ సందర్భంగా రూపొందించిన యాక్షన్​ ప్లాన్​, చేసిన ప్రతిపాదనలన్నీ శనివారం సీఎంకు నివేదించనున్నట్టు ఒక ఉన్నతాధికారి తెలిపారు. శనివారం సీఎం వద్ద జరిగే రివ్యూ మీటింగ్​లో  కార్మికులను చేర్చుకునే అంశం, డ్యూటీలో చేర్చుకోవాలంటే పెట్టే షరతులపై క్లారిటీ వచ్చే అవకాశముందని అభిప్రాయపడ్డారు.

ఆర్టీసీ కార్మికులను డ్యూటీలోకి చేర్చుకునే విషయంపై ప్రభుత్వం నుంచి రెండో రోజూ స్పందన లేదు. సీఎం ఆదేశాల మేరకు ఆర్టీసీ భవిష్యత్​పై యాక్షన్ ప్లాన్​ రూపొందించే పనిలో రవాణా శాఖ మంత్రి, ఉన్నతాధికారులు బిజీబిజీగా గడిపారు. ఇప్పటికే 5,100 రూట్లు ప్రైవేట్​పరం చేయడంపై మంత్రివర్గం తీసుకున్న నిర్ణయానికి హైకోర్టు తీర్పుతో అడ్డు తొలిగినట్టయింది. ఈ నేపథ్యంలో సీఎం ఆదేశాలతో త్వరలోనే కేబినేట్​సమావేశం నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గత మీటింగ్​లోనే  ప్రైవేటు బస్సులకు ఆమోదం తెలిపినా, తాజాగా జరిగే సమావేశంలో ఆయా రూట్లలో ప్రైవేటు బస్సులను నడిపేందుకు తయారు చేసిన కొత్త పాలసీపై చర్చించి ఆమోదం తెలపనున్నట్టు తెలుస్తోంది. రవాణాశాఖ అధికారులు తయారు చేసిన ఈ పాలసీకి, సీఎం ఆదేశాలతో శుక్రవారం తుది మెరుగులు దిద్దారు. ఈ పాలసీకి మంత్రివర్గం అమోదం ఉండాలని ఓ సీనియర్ అధికారి అన్నారు.

గతంలో 3,600 రూట్లను జాతీయం చేశారు. వాటిని కూడా ప్రైవేటీకరణ చేస్తూ మంత్రివర్గం తీర్మానం చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఇందులో భాగంగానే  కేబినెట్ సమావేశం నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ‘రవాణా పాలసీకి మంత్రివర్గం అమోదం తెలుపగానే వెంటనే ప్రైవేటు బస్సుల కోసం నోటిఫికేషన్ విడుదల చేస్తాం’ అని  ఓ సీనియర్ అధికారి తెలిపారు.

డ్యూటీలు.. షరతులపై  సస్పెన్స్

రెండు రోజుల కిందటే ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమణకు సంసిద్ధత వ్యక్తం చేశారు. షరతుల్లేకుంటే డ్యూటీలో చేరుతామని బహిరంగంగా ప్రకటించారు. గురువారం రవాణా శాఖ మంత్రి, ఉన్నతాధికారులతో సమీక్ష జరిపిన సీఎం కేసీఆర్​ 49 వేల మంది ఆర్టీసీ కార్మికులను డ్యూటీలో చేర్చుకునే విషయంపై మాటెత్తకపోగా..  ఆర్టీసీ పరిస్థితిపై ఆచితూచి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ఆర్టీసీ భారాన్ని ప్రభుత్వం మోసే పరిస్థితి లేదని, హైకోర్టులో ప్రైవేటు బస్సుల కేసుపై తీర్పు తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని స్సష్టం చేశారు. సమీక్ష సందర్భంగా మంత్రి, అధికారులు కార్మికుల విషయాన్ని ప్రస్తావించగా తొందరపడకుండా వ్యవహరిద్దాం అని సీఎం కేసీఆర్​ అభిప్రాయపడ్డట్లు తెలిసింది. వారిని నేరుగా డ్యూటీలో  చేర్చుకుందామా..? చేర్చుకుంటే యూనియన్ల పెత్తనం లేకుండా ఏయే కండీషన్లు పెట్టాలి.. అందుకు సాధ్యాసాధ్యాలపై నివేదిక తయారు చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. సగం రూట్లు, బస్సులను ఇప్పటికే ప్రైవేటుకు అప్పగించే నిర్ణయం తీసుకున్నందున.. మిగతా సగం బస్సులకు ఎంత మంది సిబ్బంది అవసరం, మిగతా ఉద్యోగుల్లో ఎలా కోత పెట్టాలనే అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని సీఎం సూచించినట్లు సమాచారం.

Latest Updates