జూన్ వరకు SRSP పరిధిలోని ప్రతి ఎకరాకు నీరు : కేసీఆర్

హైదరాబాద్ : ఈ ఏడాది వర్షాకాలంలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పరిధిలోని మొత్తం 14.40 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడానికి అనువుగా జూన్ నాటికే కాల్వలు, తూముల నిర్మాణం, లైనింగ్ పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం కేసీఆరక. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న మేడిగడ్డ బ్యారేజి నుంచి ఈ వర్షాకాలంలో నీటిని ఎత్తిపోయడం ప్రారంభమవుతుందని ఆ నీటిని మిడ్ మానేరు, లోయర్ మానేరు డ్యాములకు తరలిస్తామన్నారు. ఈ రెండు డ్యాముల్లో కలిపి 50 టిఎంసిల నిల్వ సామర్థ్యం ఉంటుందని, ఆ నీటితో SRSP కాల్వల ద్వారా అన్ని చెరువులను నింపాలని సూచించారు. ప్రాజెక్టుల ద్వారా నీళ్లొస్తున్నాయి, పనులు చేయడానికి నిధులిస్తున్నాం, అయినా పంట పొలాలకు నీరందించకుంటే పాపం చేసిన వారమవుతామని సిఎం వ్యాఖ్యానించారు. SRSP ఆయకట్టు పరిధిలోని ప్రజా ప్రతినిధులతో కేసీఆర్ గురువారం ప్రగతి భవన్ లో సమావేశమయ్యారు.

SRSP పరిధిలోని మొత్తం ఆయకట్టుకు నీరందించడానికి అనుసరించాల్సిన వ్యూహంపై కూలంకశంగా చర్చించి, నిర్ణయాలు తీసుకున్నారు. ఎక్కడ ఏ సమస్య ఉందో గుర్తించి, దాన్ని అప్పటికప్పుడే పరిష్కరించారు. భూసేకరణకు, ఇతర పనులకు కావాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలని ఆర్థిక శాఖను ఆదేశించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేసీఆర్.. ‘‘గోదావరిలో పుష్కలంగా నీళ్లున్నాయి. ఈ నీటిని ఎత్తిపోయడానికి భారీ వ్యయంతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తున్నం. ఈ ఏడాది వర్షాకాలం నుంచే మేడిగడ్డ నుంచి నీరు ఎత్తిపోసి మిడ్ మానేరు, లోయర్ మానేరు డ్యాములకు తరలిస్తాం. అలా తరలించిన నీటిని SRSP కాల్వల ద్వారా అన్ని చెరువులను మళ్లించాలి. చెరువులను నింపడమే ప్రథమ ప్రాధాన్యంగా గుర్తించాలి. దీనికోసం SRSP కాల్వలన్నింటినీ మరమ్మత్తు చేయాలి.

కావాల్సిన చోట తూములు వెంటనే నిర్మించాలి. భూ సేకరణ పూర్తి చేయాలి. రెండో ఫేజులో నిర్మించిన కాల్వలకు లైనింగ్ పూర్తి చేయాలి. అవసరమైతే కాల్వల క్యారీయింగ్ కెపాసిటీ (నీటి ప్రవాహ ఉధృతి సామర్ధ్యం)ని పెంచుకోవాలి. ఎక్కడ ఏ పనిచేయాలో నిర్ణయించడానికి వెంటనే 50 మంది ఇంజనీర్లను నియమించండి. వేగంగా సర్వే చేసి, అంచనాలు రూపొందించాలి. కావాల్సిన నిధులు వెంటనే మంజూరు చేస్తాం. పనులు ఫాస్ట్ గా జరగాలి. అన్ని పనులూ పూర్తి చేసి, ఎట్టి పరిస్థితుల్లో ఈ వర్షాకాలానికి SRSP పరిధిలోని 14.40 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలి. శ్రీరాం సాగర్ ప్రాజెక్టు ప్రాంతం నుంచి మొదలుకుని చివరి ఆయకట్టు కలిగిన డోర్నకల్, తుంగతుర్తి, భూపాలపల్లి, పెద్దపల్లి, రామగుండం నియోజకవర్గాల వరకు అన్ని దిక్కులకు నీరు అందాలి’’ అని సీఎం అధికారులకు సూచించారు.

 

Latest Updates