రైతుబంధుతో సీఎం కేసీఆర్ చరిత్ర తిరగరాశారు: హరీష్ రావు

తెలంగాణలో నైజాం పాలన నుంచి సమైక్యాంధ్ర పాలన వరకు భూమి శిస్తు వసూలు చేస్తే… తెలంగాణలో మాత్రం సీఎం కేసీఆర్ శిస్తు లేకుండా చేశారన్నారు మంత్రి హరీష్‌ రావు. అంతేకాకుండా భూమి ఉన్న ప్రతి రైతుకు రైతుబంధు పథకం ద్వారా డబ్బులిచ్చి సీఎం కేసీఆర్ చరిత్ర తిరగరాశారని స్పష్టం చేశారు.

దుబ్బాక  ఉప ఎన్నిక క్రమంలో తొగుట మండలం ఘనపూర్‌లో హరీష్ ఇవాళ(గురువారం) ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రైతులకు నాణ్యమైన ఉచిత విద్యుత్‌ ఇచ్చిన ఏకైక ప్రభుత్వం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మాత్రమేనని తెలిపారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉచిత విద్యుత్‌ ఇవ్వడం లేదో… ఆ పార్టీ నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో ఓట్ల కోసం లీడర్లు గ్రామాలకు వస్తే మహిళలు ఖాళీ నీటి బిందెలతో నిరసన తెలిపి తాగునీటి కోసం ప్రశ్నించేవారన్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదన్నారు. కేసీఆర్‌ మిషన్‌ భగీరథ ద్వారా ఇంటింటికీ మంచినీరు అందిస్తున్నారని తెలిపారు. విదేశీ మక్కలు తెచ్చి తెలంగాణ రైతుల నోట్లో మట్టి కొట్టాలని బీజేపీ నాయకులు చూస్తున్నారని ఆరోపించారు. అందుకే మక్కల ధరలు పడిపోయాయన్నారు. దేశంలో బీడీ కార్మికులకు పింఛన్‌ ఇస్తుందంటే కేవలం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే నన్నారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన బీజేపీ నాయకులు ఇక్కడ బీడీలు చేసుకునే అక్కాచెల్లెళ్ల దగ్గరకు వెళ్లి  బీడీ పెన్షన్‌లో రూ.1600 కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కారు ఇస్తుందని చెబుతున్నారు. పూటకో మాట, గంటకో అబద్ధం చెబుతూ ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీని ప్రజలు నమ్మకపోవడంతో, పైసలతో ఓట్లు కొనాలని చూస్తున్నారని తెలిపారు. వెూటర్లకు మీటర్లు పెట్టి రైతుల చేతుల్లో బిల్లులు పెట్టమంటున్న బీజేపీకి ఓటెందుకెయ్యాలని ప్రశ్నించారు మంత్రి హరీష్ .

Latest Updates