పగడ్భందీగా లాక్ డౌన్.. రాష్ట్రంలో తగ్గుముఖం పట్టిన కరోనా

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో లాక్ డౌన్ పకడ్బందీగా అమలవుతున్నందున కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టిందని సీఎం కేసీఆర్​ అన్నారు. మరికొన్ని  రోజులూ ప్రజలు లాక్​డౌన్​కు సహకరించాలని,  ప్రభుత్వ గైడ్​లైన్స్​ను  పాటించాలని, దీంతో పరిస్థితి మరింత మెరుగుపడుతుందని సూచించారు.  సోమవారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో జరిగే ప్రధానమంత్రి వీడియో కాన్ఫరెన్స్​లో దేశ పరిస్థితి కూడా తెలుస్తుందని చెప్పారు. కంటెయిన్​మెంట్లలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా నిత్యావసర సరుకులు అందజేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలు, లాక్ డౌన్ అమలు, సహాయ కార్యక్రమాలు తదితర అంశాలపై సీఎం కేసీఆర్  ఆదివారం ప్రగతి భవన్ లో సమీక్షించారు. ‘‘సోమవారం అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని  వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. అప్పుడు అందరు సీఎంలు తమ తమ రాష్ట్రాల్లోని పరిస్థితి వివరిస్తారు. దీంతో దేశవ్యాప్తంగా పరిస్థితిపై ఓ అంచనా వస్తుంది. తదుపరి చర్యలు ఎట్లుండాలో అభిప్రాయాలు వస్తాయి. దీంతో భవిష్యత్  కార్యాచరణపై స్పష్టత రావొచ్చు’’ అన్నారు.

ఇంకొంత కాలం ఇట్లే ఉంటే పూర్తిగా తగ్గుతది

కరోనా వైరస్ సోకినప్పటికీ, రాష్ట్రంలో మరణాల రేటు నేషనల్​ యావరేజ్​ కన్నా తక్కువగా ఉండటం కొంత ఊరటనిచ్చే అంశమని  సీఎం అన్నారు. లాక్ డౌన్ ను మరికొంత కాలం ఇదే పద్ధతిలో కొనసాగిస్తే, ప్రజలు ఎవరికి వారు వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తే, తగిన జాగ్రత్తలు తీసుకుంటే రాబోయే రోజుల్లో వైరస్ వ్యాప్తి పూర్తిగా తగ్గిపోయే చాన్స్​ ఉందని చెప్పారు.  ప్రభుత్వ నిర్ణయాలు, రూల్స్​ సరిగ్గా అమలు కావడంపై సీఎం సంతృప్తి వ్యక్తం చేశారని సీఎంవో ఒక ప్రకటనలో పేర్కొంది.  సమీక్షలో మంత్రి ఈటల రాజేందర్, సీఎస్  సోమేశ్ కుమార్ పాల్గొన్నారు.

అన్ని రంగాల్లో విజయం సాధించినం

టీఆర్ఎస్  పార్టీ ఆవిర్భవించి రెండు దశాబ్దాలు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, పార్టీ శ్రేణులకు పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ ప్రధాన లక్ష్యమైన ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించడంతోపాటు.. తెలంగాణలో అన్ని రంగాల్లో గొప్ప విజయాలను సాధించామని పేర్కొన్నారు. సోమవారం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్ లో ఉదయం 9.30 గంటలకు సీఎం కేసీఆర్​ పార్టీ జెండా ఆవిష్కరించనున్నారు.  నిరాడంబరంగా జరుపుకొందాం కరోనా నేపథ్యంలో ఆవిర్భావ ఉత్సవాలను నిరాడంబరంగా జరుపుకోవాలని నిర్ణయించినట్టు కేసీఆర్​ పేర్కొన్నారు. మరో సందర్భంలో పార్టీ ద్విదశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుందామని సూచించారు.

 

Latest Updates