కనిపిస్తే కాల్చివేత దాకా తెచ్చుకోవద్దు

హైదరాబాద్ : రాష్ట్రంలో మంగళవారం కరోనా పాజిటివ్ కేసులు 36కి చేరిందన్నారు సీఎం కేసీఆర్. మంగళవారం కరోనాపై ఉన్నత స్థాయి సమావేశం తర్వాత సీఎం ప్రెస్ మీట్ లో మాట్లాడారు.పాజిటివ్ వచ్చినవారి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందన్నారు. రాష్ట్రంలో అనుమానితుల సంఖ్య 114కి చేరిందన్నారు. కరోనా దాదాపు అన్ని దేశాలకు విస్తరించిందని.. అమెరికాలో కరోనాను కంట్రోల్ చేయలేక ఆర్మీని పిలిపించిందన్నారు.

మన దగ్గర కూడా జనం పోలీసుల మాట వినకపోతే 24గంటలు కర్ఫ్యూ పెట్టాల్సివస్తుందని హెచ్చరించారు సీఎం కేసీఆర్. అవసరమైతే ఆర్మీని దింపాల్సి వస్తుందన్నారు. అప్పటికీ మాట వినకపోతే కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు జారీ చేయాల్సి వస్తుందన్నారు. ఇతర దేశాల్లోనూ ఇలానే ఆర్మీని దింపారని చెప్పారు. ఆ పరిస్థితి వరకు ప్రజలు తెచ్చుకోవద్దని సూచించారు.  రాష్ట్రాన్ని రక్షంచే క్రమంలో ఏ నిర్ణయమైనా తీసుకుంటామన్న సీఎం.. ప్రజాస్వామ్య దేశం కాబట్టి సున్నితంగా చెబుతున్నామన్నారు. మాట వినకపోతే 24 గంటలు కర్ఫ్యూ సహా షూట్ ఎట్ సైట్ ఆర్మీని రంగంలోకి దించుతామన్నారు.

రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని సీఎం చెప్పారు. సాయంత్రం 6 గంటల్లోపే ప్రజలు నిత్యావసరాలు కొనుగోలు చేయాలన్నారు. 6గంటల ఒక్క నిమిషానికి షాపులు తెరిచినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. లాక్ డౌన్ సమయంలో అధిక రేట్లకు అమ్మే వ్యాపారుల లైసెన్స్ రద్దుచేస్తామని.. క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు.  ప్రజలందరికీ దండం పెట్టి మనవి చేస్తున్నానని.. ఆపద కాలంలో అందరూ సహకరించాలని వేడుకున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్.

 

Latest Updates