రాష్ట్రం పుట్టినరోజు నా బర్త్​డే ఒకే రోజు కావడం హ్యాపీ

హైదరాబాద్‌‌, వెలుగుతెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన రోజు, తన పుట్టినరోజు ఒకే తేదీ కావడంపై గవర్నర్​ తమిళిసై సౌందరరాజన్​ సంతోషం వ్యక్తం చేశారు. స్వాతంత్ర్య పోరాటం తర్వాత సుదీర్ఘకాలం జరిగిన ఉద్యమంగా తెలంగాణ ఉద్యమం చరిత్రలో నిలుస్తోందని.. ఎంతో మంది త్యాగాల ఫలితంగా రాష్ట్రం ఏర్పాటైందని చెప్పారు. మంగళవారం గవర్నర్​ బర్త్​డే సందర్భంగా సీఎం కేసీఆర్, ఇతర ప్రముఖులు ఆమెను కలిసి శుభాకాంక్షలు చెప్పారు. సీఎం కేసీఆర్​ ఉదయమే రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్​కు పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందనలు తెలిపారు. సీఎం కేసీఆర్ కు, రాష్ట్ర ప్రజలకు గవర్నర్ తమిళిసై రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్భంగా స్వాతంత్ర్య పోరాటం తర్వాత సుదీర్ఘ కాలం జరిగిన ఉద్యమంగా తెలంగాణ ఉద్యమం చరిత్రలో నిలుస్తోందని గవర్నర్ అన్నారు. తెలంగాణ సాధన కోసం ఎందరో ప్రాణాలు అర్పించారని, ఏటా అమరులకు నివాళులు అర్పించిన తర్వాతే జాతీయ జెండా ఆవిష్కరిస్తామని సీఎం కేసీఆర్​ చెప్పారు. సీఎం వెంట రాజ్యసభ సభ్యులు కె.కేశవరావు, కె.ఆర్.సురేశ్ రెడ్డి, సీఎస్​సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, వినోద్ కుమార్ తదితరులు ఉన్నారు.

గ్రీటింగ్స్​ తెలిపిన బీజేపీ నేతలు

గవర్నర్​ పుట్టినరోజు సందర్భంగా బీజేపీ రాష్ట్ర చీఫ్​ బండి సంజయ్, వివేక్​ వెంకటస్వామి, పొంగులేటి సుధాకర్​రెడ్డి, కె.లక్ష్మణ్, ఎమ్మెల్సీ రాంచందర్​రావు తదితరులు గవర్నర్​ను కలిసి గ్రీటింగ్స్​ చెప్పారు. గవర్నర్​ను కలిసిన తర్వాత పొంగులేటి సుధాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చూడాలని గవర్నర్ కు విజ్ఞప్తి చేశామన్నారు. ఏపీ సర్కారు విభజన చట్టానికి విరుద్ధంగా వెళ్తున్న విషయాన్ని గవర్నర్ కు వివరించామని తెలిపారు. ఎంతో మంది త్యాగాల ఫలితంగా ఏర్పాటై తెలంగాణలో ప్రజల హక్కులను కాలరాస్తున్నారని, దీనిని అడ్డుకోవాలని కోరామని చెప్పారు. ఇక తమిళిసైకి హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ గ్రీటింగ్స్​ తెలిపారు. శుభాకాంక్షలు తెలిపినవారిలో స్పీకర్ పోచారం శ్రీనివాస్​రెడ్డి, హీరో చిరంజీవి దంపతులు, ఉన్నతాధికారులు ఉన్నారు.

Latest Updates