పది రోజుల్లో రైతుబంధు

హైద‌రాబాద్: రైతాంగం నియంత్రిత పద్ధతిలో పంటల సాగుకు సిద్ధమైనందున వెంటనే రైతులందరికీ రైతుబంధు సాయం అందించాలని అధికారులను సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. నియంత్రిత పంటల సాగు విధానం అమలు, రైతుబంధు పథకాలపై సీఎం కేసీఆర్‌ ప్రగతి భవన్‌లో సంబంధిత అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. జిల్లాల వారీగా పంటల సాగు పరిస్థితిపై సీఎం సమీక్షించారు. జిల్లాల వ్యవసాయ అధికారులు సమర్పించిన నివేదికలను సీఎం పరిశీలించారు. ప్రభుత్వం సూచించిన విధంగానే అన్ని జిల్లాల్లో రైతుల పంటలు సాగు చేస్తున్నారని.. ఇప్పటి వరకు 11 లక్షల ఎకరాల్లో విత్తనాలు వేసినట్లు అధికారులు సీఎంకు తెలిపారు.

ఈ సంద‌ర్భంగా మ‌ట్లాడిన సీఎం.. ఇప్పటికే వ్యవసాయ పనులు ప్రారంభమయ్యాయని, రైతులు పెట్టుబడి డబ్బుల కోసం ఇబ్బంది పడొద్దని అధికారుల‌కు సూచించారు. వారం పది రోజుల్లోగా రైతుబంధు సాయాన్ని రైతుల ఖాతాలో జమ చేయాలన్నారు. రైతుబంధు డబ్బులు ఉపయోగించుకుని వ్యవసాయ పనులను ముమ్మరంగా కొనసాగించాలని చెప్పారు. వర్షాకాలం పంటల కోసం ప్రణాళిక రూపొందించినట్లుగానే యాసంగి పంటల కోసం కూడా వ్యవసాయ ప్రణాళిక తయారు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.

Latest Updates