దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి

దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి

భారతదేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ క్షమాపణలు చెప్పాలని సీఎం కేసీఆర్ డిమాండ్ చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మోడీ ప్రచారం చేశారని, అయినా అక్కడ ట్రంప్ ఓడిపోయారని చెప్పారు. అమెరికాలో జరిగే ఎలక్షన్స్ ను అహ్మదాబాద్ మున్సిపల్ ఎన్నికలు అనుకున్నారా..? అంటూ ప్రశ్నించారు. ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి ప్రచారం చేయడం కరెక్టేనా..? అని ప్రశ్నించారు. హైదరాబాద్ జలవిహార్ లో విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా పరిచయ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ కేంద్ర ప్రభుత్వం, మోడీపై విరుచుకుపడ్డారు. ఇక్కడ మాటలు అధికం.. చేతలు స్వల్పమంటూ ఎద్దేవా చేశారు. 5 ట్రిలియన్ ఎకానమీ అంటూ మాట్లాడుతున్నారని..కానీ కేవలం 3.1 ట్రిలియన్ ఎకానమీ దగ్గరే ఉన్నామన్నారు. వెనక్కి తీసుకొస్తామన్న నల్లధనాన్ని ఎంత తీసుకొచ్చారని ప్రశ్నించారు. నల్లధనాన్ని నియంత్రించకపోగా.. అది రెట్టింపు అయ్యిందని, ఇది అందరికీ తెలుసన్నారు. 

మోడీ హయాంలో రూపాయి విలువ ఎక్కడుందని సీఎం కేసీఆర్ నిలదీశారు. ప్రస్తుతం జనాల్లో ఆగ్రహం పెరుగుతోందన్నారు. రూ.18.60 లక్షల కోట్లు దేశంలో NPA ఉందన్నారు. ప్రతి ఒక్కరి ఖాతాలో రూ. 15 లక్షలు వేస్తామన్న మోడీ ఇప్పటికీ 15 పైసలు కూడా వేయలేదని సెటైర్ వేశారు. మోడీ పాలనలో దేశంలోని అన్ని రంగాలు క్షీణించాయని విమర్శించారు. ఫియట్, ఫోర్డ్, జనరల్ మోటార్స్, డాట్సన్, హార్లే డేవిడ్ సన్ వెళ్లిపోయాయని, ఇదేనా దేశాన్ని పరిపాలించే పద్ధతి అని ప్రశ్నించారు. డీజిల్, పెట్రోల్, గ్యాస్, ఎరువులతో పాటు అన్నింటి ధరలను పెంచారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టాలు సరైనవే అయితే.. వాటిని ఎందుకు వెనక్కి తీసుకున్నారని నిలదీశారు.