యురేనియం తవ్వకాలకు అనుమతులివ్వం : సీఎం కేసీఆర్

అవసరమైతే కేంద్రంపై కొట్లాడుతాం

అసెంబ్లీలో సీఎం ప్రకటన

రాష్ట్రంలో సంచలనం రేపుతున్న యురేనియం తవ్వకాల అనుమతుల వివాదంపై ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటన చేశారు. యురేనియం తవ్వకాలకు అనుమతులు ఇచ్చేది లేదని ఖరాఖండీగా చెప్పారు కేసీఆర్.

“యురేనియం తవ్వకాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎవరికీ .. ఎటువంటి పర్మిషన్ ఇవ్వలేదు. భవిష్యత్తులో ఇచ్చే ఆలోచన కూడా లేదు. ఇవ్వంకూడా. మేం, మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎట్టిపరిస్థితుల్లో నల్లమల అడవులను నాశనం కానియ్యం. దానికంటే పెద్ద ప్రమాదం ఉంది. వద్దని చెబితే గతంలో 2009లో అనుమతి ఇచ్చినవాళ్లు కాంగ్రెస్ పార్టీ లీడర్లే. ఇక్కడా, ఆంధ్రాలో ఇచ్చారు. ఆంధ్రాలో కడపజిల్లాలో తవ్వుతున్నారు. కలుషితం అయిపోయిందని పేపర్లలో ఫ్రంట్ పేజీల్లో వార్తలు వస్తున్నాయి. ఇక్కడ ప్రమాదం ఏంటంటే తెలంగాణ, ఆంధ్రకు అన్నంపెట్టే కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులు కృష్ణానది, నాగార్జున సాగర్, పులిచింతల, డెల్టా ప్రాంతం కలుషితమై నాశనమయ్యే పరిస్థితి వస్తుంది. కోటానుకోట్ల మంది దెబ్బతినే పరిస్థితి వస్తుంది. సాగర్ నుంచే మన హైదరాబాద్ కు డ్రింకింగ్ వాటర్ సప్లై కూడా ఉంది. మన హైదరాబాద్ రాజధాని కూడా దెబ్బతినే ప్రమాదం వస్తుంది. వీటన్నింటి దృష్ట్యా ఎట్టి పరిస్థితుల్లో యురేనియం తవ్వకాలకు అనుమతులివ్వం. ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకుంది. కేంద్రం ఒకవేళ గట్టిగా వస్తే అందరం కలిసి కొట్లాడుదాం. పోరాటం కూడా చేద్దామని మనవి చేస్తున్నా. భట్టి గారు ప్రపోజ్ చేస్తున్నారు… తప్పకుండా అసెంబ్లీలో రెజల్యూషన్ పాస్ చేద్దాం.” అని సీఎం అసెంబ్లీలో ప్రకటన చేశారు.

సింగిల్ లైన్ రెజల్యూషన్ పాస్ చేసి ఢిల్లీకి పంపిస్తే బాగుంటుందని సీఎల్పీ నాయకుడు మల్లు భట్టి విక్రమార్క కోరారు. ఆ సలహాను స్వీకరిస్తున్నామని.. రేపే రెండు సభల్లోనూ ఏకగ్రీవంగా తీర్మానం చేసి కేంద్రప్రభుత్వానికి పంపిద్దామని సీఎం అన్నారు. రేపటికి ఏర్పాట్లు చేయాలని సీఎస్ కు అసెంబ్లీ ద్వారానే ఆదేశాలు ఇచ్చారు సీఎం.