ధరణిలో ప్రతి గుంటకూ యజమాని ఎవరో తెలుస్తది

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు రెవెన్యూ రికార్డుల నిర్వహణ ఎంతో అస్తవ్యస్తంగా ఉండేదని, దీని కారణంగా ఘర్షణలు, వివాదాలు తలెత్తేవని తెలిపారు సీఎం కేసీఆర్. రెవెన్యూ రికార్డులు స్పష్టంగా లేకపోవడంతో కలిగే అనర్ధాలను రూపుమాపేందుకు, ప్రతి గుంటకూ యజమాని ఎవరో స్పష్టంగా తెలిసేందుకు తెలంగాణ ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేసిందన్నారు. భూ రికార్డుల సమగ్ర ప్రక్షాళన, కొత్త పాస్ పుస్తకాల పంపిణీ, కొత్త రెవెన్యూ చట్టం తదితర సంస్కరణల ఫలితంగా భూ యాజమాన్య విషయంలో స్పష్టత వస్తున్నదని చెప్పారు. భూ రికార్డుల నిర్వహణ, అమ్మకాలు, కొనుగోళ్లు తదితర ప్రక్రియలన్నీ పారదర్శకంగా, అవినీతి రహితంగా, ఎలాంటి జాప్యం లేకుండా ఉండేందుకు తీసుకొచ్చిన ధరణి పోర్టల్ వందకు వంద శాతం విజయవంతమైందన్నారు. వ్యవసాయ భూముల అమ్మకాలు, కొనుగోళ్ల విషయంలో మరింత వెసులుబాటు కలిగించేందుకు అవసరమైన మార్పులను వారం రోజుల్లోగా ధరణి పోర్టల్ లో చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం. రెవెన్యూ పరమైన అంశాలన్నింటినీ జిల్లా కలెక్టర్లే పరిష్కరించాలని కోరారు. ఇప్పటికే రిజిస్ట్రేషన్లు పూర్తయిన వ్యవసాయ భూముల మ్యుటేషన్ ను వెంటనే నిర్వహించాలని కలెక్టర్లను ఆదేశించారు. పెండింగ్ మ్యుటేషన్ల కోసం దరఖాస్తులు తీసుకోవాలని, వారం రోజుల్లోగా మ్యుటేషన్లు చేయాలని కోరారు.

ధరణి పోర్టల్ ను మరింత యూజర్ ఫ్రెండ్లీగా మార్చాలని. ఇందుకోసం తక్షణం కొన్ని మార్పులు, చేర్పులు చేయాలన్నారు. ఎన్నారైలకు తమ పాస్ పోర్ట్ నంబరు ఆధారంగా రిజిస్ట్రేషన్లు చేయడానికి ధరణి పోర్టల్ లో అవకాశం కల్పించాలన్నారు. కంపెనీలు, సొసైటీలు కొనుగోలు చేసిన భూములకు కూడా పాస్ బుక్ పొందే విధంగా ధరణిలో వెసులుబాటు కల్పించాలని.. గతంలో ఆధార్ కార్డు నంబరు ఇవ్వనివారి వివరాలను ధరణిలో నమోదు చేయలేదన్నారు. అలాంటి వారికి మరోసారి అవకాశం ఇచ్చి, ఆధార్ నంబరు నమోదు చేసుకొని పాస్ పుస్తకాలు ఇవ్వాలన్నారు. ఏజెన్సీ ఏరియాల్లోని ల్యాండ్ ట్రాన్స్ ఫర్ రెగ్యులేషన్స్ వివాదాలన్నింటినీ జిల్లా కలెక్టర్లు నెల రోజుల్లో పరిష్కరించాలన్నారు. స్లాట్ బుకింగ్ చేసుకున్నవారు తమ బుకింగ్ ను క్యాన్సిల్ చేసుకోవడానికి, రీ షెడ్యూల్ చేసుకోవడానికి ధరణిలోనే అవకాశం కల్పించాలని తెలిపారు.

నిషేదిత భూముల జాబితాను ఎప్పటికప్పుడు అవసరమైన మార్పులతో సవరించాలని.. కోర్టు తీర్పులకు అనుగుణంగా మార్పులు చేయాలన్నారు. ప్రభుత్వం రైతుల నుండి సేకరించిన భూమిని కూడా వెనువెంటనే నిషేధిత జాబితాలో చేర్చాలన్న సీఎం.. కోర్టు కేసులు మినహా పార్ట్ – బిలో చేర్చిన అంశాలన్నింటినీ పరిష్కరించాలన్నారు. సాదాబైనామాల క్రమబద్దీకరణ కోసం వచ్చిన దరఖాస్తులను జిల్లా కలెక్టర్లు పరిశీలించి, పరిష్కరించాలని తెలిపారు. ధరణి పోర్టల్ లో జీపీఏ, ఎస్పీఏ, ఏజీపీఏ చేసుకోవడానికి అవకాశం కల్పించాలన్నారు. జిల్లా కలెక్టర్ నేతృత్వంలో ఏర్పడే జిల్లాస్థాయి ట్రిబ్యునల్ లో ఇప్పటివరకు రెవెన్యూ కోర్టుల పరిధిలో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించాలన్నారు. రెవెన్యూ పరమైన అంశాలన్నింటినీ కిందిస్థాయి అధికారులకు అప్పగించి, కలెక్టర్లు చేతులు దులుపుకుంటే ఆశించిన ఫలితం రాదన్నారు. కాబట్టి కలెక్టర్లే అన్ని విషయాల్లో స్వయంగా పరిశీలన జరిపి, నిర్ణయాలు తీసుకోవాలని కోరారు ముఖ్యమంత్రి కేసీఆర్.

 

Latest Updates