వరుసగా ఎందుకు ఓడిపోతున్నారో వారికింకా అర్థం కావట్లే

ప్రజాస్వామ్య రాజకీయాలలో గెలుపోటములు సహజమని సీఎం కేసీఆర్‌ అన్నారు. అధికారంలో శాశ్వతంగా ఉండాలనుకున్న వారెవ్వరూ.. దెబ్బతిన్నారే తప్ప విజయం సాధించలేదని ఆయన అన్నారు. ఇందిరాగాంధీ, ఎన్టీఆర్‌ అంతటివాళ్లే ఓడిపోయారని గుర్తుచేశారు. కాంగ్రెస్‌ నేతలు తీవ్ర నిరాశ, నిస్పృహ లో ఉన్నారని, వారి పరిస్థితి రోజురోజుకీ దిగజారిపోతుందని అన్నారు. దేశ వ్యాప్తంగా కూడా వారి పార్టీ పరిస్థితి ఇదేనని, ఢిల్లీలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌కు కేవలం 4 శాతం ఓట్లు వచ్చాయని అన్నారు సీఎం.

సమయం కలిసి రానప్పుడు, ప్రజల విముఖత ఉన్నప్పుడు బాధ్యతరాహిత్యంగా మాట్లాడడం, గొంతు ఉంది కదా అని అసత్య ఆరోపణలు చేయొద్దని సీఎం సూచించారు. తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చడానికి కాంగ్రెస్‌ ప్రయత్నించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం మెడలు వంచి తెలంగాణ సాధించామన్నారు. ఎన్నికల్లో ప్రజలు ఓడించినా కాంగ్రెస్‌కు బుద్ధిరాలేదని మండిపడ్డారు.

ఏ ఎన్నికలు వచ్చినా ప్రజలు టీఆర్‌ఎస్‌ పక్షానే నిలిచారన్నారు సీఎం. వరుసగా ఎన్నికల్లో ఎందుకు ఓడిపోతున్నారో వారికి ఇంకా అర్థం కావడంలేదని అన్నారు. ఓటములపై కాంగ్రెస్‌ ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. కేసుల మీద కేసులు వేస్తూ కాంగ్రెస్‌ నేతలు అభివృద్ధికి అడ్డుపడుతున్నారని విమర్శించారు. కేసులేసేది వాళ్లే.. నీళ్లు రావడం లేదని ఆరోపించేదీ కాంగ్రెస్‌ వాళ్లేనన్నారు.

Latest Updates