హైదరాబాద్లో.. మళ్లీ లాక్డౌన్! అన్నీ సిద్ధం చేయాలని సీఎం సూచన

చెన్నై లెక్కనే ఇక్కడా పెట్టాలని ఆలోచిస్తున్న సర్కార్
మూడు, నాలుగు రోజుల్లో కేబినెట్ భేటీ.. అందులో డెసిషన్
ఆలోగా ప్రజలు, అధికార యంత్రాంగాన్ని ప్రిపేర్ చేయాలని నిర్ణయం
కరోనాపై మంత్రులు, ఆఫీసర్లతో సీఎం రివ్యూ
15 రోజులు పెట్టాలన్న హెల్త్ డిపార్ట్ మెంట్

హైదరాబాద్ లో 15 రోజుల పాటు లాక్ డౌన్ విధించడం మంచిదనే ప్రతిపాదనలు వస్తున్నయ్. లాక్ డౌన్ విధించడం చాలా పెద్ద నిర్ణయం అవుతుంది. ప్రభుత్వ యంత్రాంగాన్ని, ప్రజలను సన్నద్ధం చేయాల్సి ఉంటది. రెండుమూడు రోజులు క్షుణ్ణంగా పరిస్థితిని పరిశీలిస్తం. అవసరమనుకుంటే మూడు నాలుగు రోజుల్లో కేబినెట్ను సమావేశపరిచి, జీహెచ్ఎంసీ పరిధిలో మళ్లీ లాక్ డౌన్ విధించాలనే ప్రతిపాదనలతోపాటు అన్ని విషయాలను, ప్రత్యామ్నాయాలను చర్చించి నిర్ణయం తీసుకుంటం. – సీఎం కేసీఆర్

హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ హైదరాబాద్ లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండడంతో మళ్లీ లాక్ డౌన్ విధించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. మూడు నాలుగు రోజుల్లో డెసిషన్ తీసుకోనుంది. జీహెచ్ఎంసీ పరిధిలో కనీసం 15 రోజుల లాక్ డౌన్ విధించడమే పరిష్కారమని హెల్త్ డిపార్ట్మెంట్ ప్రభుత్వానికి నివేదించడంతో దానిపై ఆదివారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షించారు. తమిళనాడు రాజధాని చెన్నైలో లాక్ డౌన్ విధించారని, అదే ఫార్ములాను గ్రేటర్లోనూ అనుసరిస్తే మంచి ఫలితాలు వచ్చే చాన్స్ ఉందని వైద్య ఆరోగ్య శాఖ ఆఫీసర్లు సూచించారు. లాక్ డౌన్ చాలా పెద్ద నిర్ణయమని, దీనిపై అధికార, పోలీసు యంత్రాంగాన్ని, ప్రజలను ప్రిపేర్ చేయాల్సి ఉందని సీఎం అన్నారు. మూడు, నాలుగు రోజుల్లో కేబినెట్ భేటీ నిర్వహించి, తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ‘‘హైదరాబాద్.. కోటి మంది నివసిస్తున్న చాలా పెద్ద సిటీ. దేశవ్యాప్తంగా అన్నిసిటీల్లో వైరస్ వ్యాప్తి ఎక్కువ ఉన్న క్రమంలో ఇక్కడా అదే పరిస్థితి ఉండడం సహజం. లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత ప్రజల కదలిక పెరిగింది. దీంతో వైరస్ వ్యాప్తి జరుగుతున్నది. చెన్నైలో వైరస్ వ్యాప్తిని నివారించడానికి మళ్లీలాక్ డౌన్ విధించారు. దేశంలో ఇతర నగరాలు కూడా ఇదే దిశగా ఆలోచన చేస్తున్నాయి. హైదారాబాద్ లో కూడా 15 రోజుల పాటు లాక్ డౌన్ విధించడం మంచిదనే ప్రతిపాదనలు వైద్యశాఖ నుంచి వస్తున్నాయి” అని సీఎం కేసీఆర్ అన్నారు. రెండు మూడు రోజుల పాటు పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలిస్తామని, అవసరమనుకుంటే మూడు నాలుగు రోజుల్లో కేబినెట్ ను సమావేశపరిచి, జీహెచ్ఎంసీ పరిధిలో మళ్లీలాక్ డౌన్ విధించాలనే ప్రతిపాదనలతో పాటు అన్ని విషయాలను, ప్రత్యామ్నాయాలను చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆయన స్పష్టంచేశారు. గ్రేటర్ పరిధిలో కరోనా కట్టడికి అనుసరించాల్సిన ప్లాన్ ను మూడు నాలుగు రోజుల్లో ఖరారు చేయాలని ఆయన నిర్ణయించారు.

కేసులు ఎక్కువ వస్తున్నాయని భయపడొద్దు
ఎక్కువ సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నంత మాత్రాన భయాందోళనకు గురి కావాల్సిన అవసరం ఏమీ లేదని సీఎం అన్నారు. అందరికీ సరైన ట్రీట్మెంట్ అందించడానికి ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నదని చెప్పారు. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వేగంగా వ్యాప్తిచెందుతోందని, అదే క్రమంలో తెలంగాణలోనూ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. జాతీయ సగటుతో పోలిస్తే రాష్ట్రంలో మరణాల సంఖ్య తక్కువేనన్నారు. పాజిటివ్ వచ్చిన వారికి అవసరమైన ట్రీట్మెంట్ చేయిస్తామని చెప్పారు. గవర్నమెంట్ హాస్పిటళ్లతో పాటు ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో వేలాది బెడ్లు సిద్ధం చేశామన్నారు.

ఇప్పటికే ప్రధాన మార్కెట్లు క్లోజ్
హైదరాబాద్, సికింద్రాబాలోని ప్రధాన మార్కెట్లు ఇప్పటికే సెల్ఫ్ లాక్డౌన్ విధించుకున్నాయి. మార్కెట్లలో ప్రజల రద్దీ ఎక్కువుండటంతో ఎప్పుడు ఎవరి నుంచి కరోనా అంటుతుందోనని వ్యాపారులు ఈ నిర్ణయాన్ని అమలు చేస్తున్నారు. దాదాపు ప్రధాన మార్కెట్లన్నీ వచ్చే నెల 5 వరకు సెల్ఫ్ లాక్డౌన్ పాటించాలని నిర్ణయించాయి. మరోవైపు పది రోజులుగా జీహెచ్ఎంసీలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. శనివారం ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 1,087 కరోనా కేసులు రాగా.. అందులో 888 కేసులు గ్రేటర్ లోనే నమోదయ్యాయి. కేసులు పెరుగుతుండటంతో అందరిలోనూ ఆందోళన నెలకొంది.

రోజులో ఒకటీ రెండు గంటలే సడలింపులు
గ్రేటర్ హైదరాబాద్ లో లాక్డౌన్ విధించాలని నిర్ణయం తీసుకుంటే కట్టుదిట్టంగా, సంపూర్ణంగా లాక్ డౌన్ అమలు చేయాల్సి ఉంటుందని సీఎం అన్నారు. ప్రజలు నిత్యావసర సరుకులు కొనుగోలు చేసేందుకు రోజులో ఒకటీరెండు గంటలు మాత్రమే సడలింపులు ఇవ్వాల్సి ఉంటుందని, ఆ మినహాయింపులు పోను మిగిలిన రోజంతా విధిగా కర్ఫ్యూ అమలు చేయాల్సి ఉంటుందని చెప్పారు. విమానాలు, రైళ్ల రాకపోకలను ఆపివేయాలని, ప్రభుత్వపరంగా లాక్ డౌన్ కు అన్ని సిద్ధం చేయాలని సూచించారు. అన్ని విషయాలను లోతుగా పరిశీలించి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని సీఎం పేర్కొన్నారు.

సీరియస్ ఉంటేనే హాస్పిటళ్లలో ట్రీట్మెంట్: ఈటల
సీరియస్ గా ఉన్న పేషెంట్లకు మాత్రమే హాస్పిటళ్లలో ట్రీట్మెంట్ చేయిస్తున్నామని, వ్యాధి లక్షణాలు లేని వారిని ఇంట్లోనే ఉంచి ట్రీట్మెంట్ చేయిస్తున్నామని హెల్త్ మినిస్టర్ ఈటల రాజేందర్ వివరించారు. హెల్త్ సెక్రటరీ పంపిన తాజా రిపోర్టులోనూ వైరస్ వల్ల మృతిచెందిన వారి సంఖ్య చాలా తక్కువగా ఉందని చెప్పారు. కరోనా మరణాల జాతీయ సగటు 3.04 శాతంగా ఉండగా మన రాష్ట్రంలో 1.52 శాతం మాత్రమేనని పేర్కొన్నారు. రాష్ట్రంలో పెద్దసంఖ్యలో టెస్టులు చేస్తున్నామని, పాజిటివ్ వచ్చిన వారికి అవసరమైన ట్రీట్ మెంట్ అందిస్తున్నామన్నారు. గ్రేటర్ లో కరోనా కట్టడికి మరో 15 రోజుల పాటు లాక్ డౌన్ విధించాలని హెల్త్ఆఫీసర్లు, ఎక్స్ పర్స్ కోరుతున్నారని మంత్రి చెప్పారు. మంత్రి ఈటల ప్రతిపాదనపై సీఎంకేసీఆర్ స్పందిస్తూ.. లాక్ డౌన్ చాలా పెద్ద నిర్ణయమని, దానిపై ముందు ప్రజలను సన్నద్ధం చేయాల్సి ఉంటుందన్నారు. అన్నివర్గాల ప్రజల అభిప్రాయం తీసుకొని కేబినెట్ సమావేశం నిర్వహించి తుది నిర్ణయం తీసుకుందామని స్పష్టంచేశారు. సమీక్షలో మంత్రులు ఈటల రాజేందర్, కేటీఆర్, ప్రశాంత్ రెడ్డి , సీఎస్ సోమేశ్ కుమార్, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు.

For More News..

ఖమ్మంలో పాజిటివ్.. గాంధీలో నెగెటివ్

ఆన్ లైన్ క్లాసులపై నో క్లారిటీ.. అయినా ఆపమంటున్న ప్రైవేట్ సంస్థలు

డాడీ.. ఊపిరి ఆడుతలేదు.. ఆక్సిజన్‌‌ తీసేసిన్రు.. ఇక సచ్చిపోతున్న బై..