ఆఖరి ఆయకట్టుకూ నీళ్లందాలె

జయశంకర్​ భూపాలపల్లి, వెలుగు:  గోదావరి నీళ్లను వృథా చేయొద్దని, ప్రతి నీటి చుక్కను సద్వినియోగం చేయాలని ఇంజనీర్లకు, అధికారులకు సీఎం కేసీఆర్​ సూచించారు. ఎస్సారెస్పీ మొదలుకొని మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీలు, రిజర్వాయర్లు, ఎత్తిపోతల పంపులు, కాల్వల ద్వారా  ఆఖరి ఆయకట్టుకు కూడా సాగు నీరందేలా చూడాలన్నారు. ఎక్కడికక్కడ పని విభజన చేసుకోవాలని, సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. అవసరమైతే వాకీటాకీల వ్యవస్థను ఏర్పాటు చేసుకొని, సమాచారాన్ని ఎప్పటికప్పుడు చేరవేసుకోవాలన్నారు. ఎప్పుడు ఏ మోటార్​ నడుస్తోంది? ఏ పంపు పోస్తోంది? ఎన్ని నీళ్లు ఎత్తాలే? ఎప్పుడు ఆపాలే? ఎప్పుడు నీటిని కిందికి వదలాలే? వంటి అంశాలపై కాళేశ్వరం టీం మొత్తానికి అవగాహన ఉండాలని ఆయన తెలిపారు. అట్లా సమన్వయంతో పనిచేసి గోదావరి నీళ్లను నూటికి నూరుశాతం సద్వినియోగం చేయాలని సూచించారు. గురువారం భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టును సీఎం కేసీఆర్​ సందర్శించారు. కాళేశ్వర ముక్తీశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. మేడిగడ్డ(లక్ష్మి) బ్యారేజీ వద్ద హెలికాప్టర్ నుంచి ఏరియల్ సర్వే చేశారు. బ్యారేజీ నీటిలో పూలు చల్లారు. బ్యారేజీ పైనుంచి గోదావరి నదిలో నాణేలు వదిలి మొక్కులు చెల్లించుకున్నారు. వ్యూ పాయింట్ వద్ద ఇంజినీరింగ్ అధికారులకు ఆయన పలు సూచనలు చేశారు.

రాబోయే వర్షాకాలం వరద నీరు ఉధృతంగా చేరుతుందని, దీంతో మేడిగడ్డ బ్యారేజీ నుంచి ఎప్పటికప్పుడు నీటిని తోడుకోవాలని, అందుకు సంబంధించిన వ్యవస్థను సిద్ధం చేసుకోవాలని ఈఎన్​సీలు మురళీధర్​రావు, నల్ల వెంకటేశ్వర్లు సహా అక్కడ హాజరైన పలువురు ఇంజనీర్లకు, ఉన్నతాధికారులకు సీఎం కేసీఆర్ సూచించారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా పనిచేసి ఇటీవల నీటిపారుదల శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టిన రజత్​కుమార్​కు సంబంధిత విషయాలపై అవగాహన పెరిగే విధంగా ప్రాజెక్టు నిర్మాణం, సాగునీటి వినియోగం, ప్రభుత్వ ప్రాధాన్యతలను ఆయన వివరించారు. ఎంతో కష్టపడి కట్టుకున్న ప్రాజెక్టులలోని నీటిని ఎప్పటికప్పుడు తోడి పోసుకుంటూ రిజర్వాయర్​లను నింపుతూ.. గోదావరి జలాలను వృథా పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇంజనీర్లదేనని చెప్పారు. అనంతరం అక్కడే మధ్యాహ్నం భోజనం చేసి.. కరీంనగర్​ బయలుదేరారు. సీఎం వెంట మంత్రులు ఈటల రాజేందర్, కొప్పుల ఈశ్వర్, ఎంపీ జోగినపల్లి సంతోష్, స్థానిక ఎమ్మెల్యేలు దుద్దిళ్ల శ్రీధర్​బాబు, గండ్ర వెంకటరమణారెడ్డి, చీఫ్​ సెక్రటరీ సోమేష్​కుమార్  తదితరులు ఉన్నారు.

Latest Updates