సీఎం మీటింగ్​కు ఈటలను పిల్వలే!

ఆహ్వానం లేదంటున్న మంత్రి పేషీ
ఎవరికీ ఆహ్వానం పంపలేదన్న సీఎంవో
హైదరాబాద్ లోనే ఉన్న ఈటల..
తన కార్యక్రమాలతోనే బిజీ బిజీ
ఈటలను ప్రోగ్రాంకు పిలిచారా లేదా
అన్నదానిపై పార్టీలో చర్చ

సీఎం కేసీఆర్​ ప్రతిష్టాత్మకంగా నిర్వహించదలచిన పంచాయతీ యాక్షన్​ ప్లాన్ పై సమావేశం జరిగింది.. ముగ్గురు మినహా మంత్రులందరూ వచ్చారు.. తిరుమల వెళ్లిన తలసాని శ్రీనివాసయాదవ్, సూర్యాపేటలో ఓ ప్రోగ్రాం కారణంగా జగదీశ్​రెడ్డి తాము రాలేమంటూ సీఎం సమాచారమిచ్చారు. కానీ వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్.. మంగళవారం హైదరాబాద్​లోనే ఉన్నా సీఎం ప్రోగ్రామ్​లో కనిపించలేదు. తన శాఖ పరిధిలో సమీక్షలు, పరిశీలన పనిలో ఉండిపోయారు. అయితే ఈటలకు ఆహ్వానమేదీ అందలేదని, అందుకు వెళ్లలేదని ఆయన సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. మరోవైపు పంచాయతీ యాక్షన్​ ప్లాన్​ సమావేశానికి మంత్రులెవరికీ ప్రత్యేకంగా ఆహ్వానం పంపలేదని సీఎం ఆఫీసు వర్గాలు తెలిపాయి. ప్రగతి భవన్​ నుంచి ఫోన్లు వెళ్లి ఉండవచ్చని పేర్కొన్నాయి.

కీలకమైన సమావేశం..

సీఎం కేసీఆర్ పంచాయతీ యాక్షన్  ప్లాన్  పై మంగళవారం మధ్యాహ్నం హైదరాబాద్​శివార్లలోని రాజేంద్రనగర్ లో జిల్లా కలెక్టర్లు, సీఈవో, ఇతర అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ముగ్గురు మినహా మంత్రులంతా ఈ సమావేశానికి వచ్చారు. తలసాని శ్రీనివాస్ యాదవ్  కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల వెళ్తున్నానని సీఎంవో అధికారులకు సమాచారమిచ్చారు. మంత్రి జగదీశ్​రెడ్డి సూర్యాపేటలో పార్టీ ప్రోగ్రాం ఉందని, అందువల్ల రాలేనని సీఎం అనుమతి తీసుకున్నట్టు తెలిసింది. మంత్రి ఈటల హైదరాబాద్ లోనే ఉన్నా సీఎం సమీక్షా సమావేశానికి హాజరుకాలేదు. ఉదయం 11 గంటలకు ఫీవర్  ఆస్పత్రికి వెళ్లారు. ఔట్ పేషెంట్  వార్డును పరిశీలించారు. సుమారు గంటసేపు అక్కడ గడిపారు. తర్వాత కోఠిలోని వైద్యవిధాన పరిషత్ కు వెళ్లి వైద్య శాఖ ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఆ భేటీ తర్వాత ఈటల సీఎం కార్యక్రమానికి వస్తారని పార్టీ నేతలంతా భావించారు. కానీ సాయంత్రం ఐదు దాటినా ఆయన రాలేదు. దాంతో అసలు ఈటలకు ప్రోగ్రామ్​కు పిలిచారా, లేదా అన్న చర్చ మొదలైంది. కొందరు నేతలు దీనిపై ఆరా తీసే పనిలో పడ్డారు.

ఆహ్వానం లేదన్న ఈటల పేషీ

సీఎం దగ్గర ఏదైన సమీక్షా సమావేశం జరిగితే ప్రగతిభవన్  నుంచి ముందుగా మంత్రులకు సమాచారం వస్తుంది. సీఎం ఫలానా సమావేశానికి రమ్మని చెప్పారంటూ సీఎంకు దగ్గరగా ఉండే అధికారులు మంత్రులను అలర్ట్ చేస్తారు. కానీ రాజేంద్రనగర్ లో జరిగిన సమీక్షకు సంబంధించి ఈటలకు ఎటువంటి ఫోన్ కాల్ రాలేదని తెలిసింది. గతంలో సీఎంవో నుంచి ఎదురైన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని మంత్రి ఈటల సెల్ ఫోన్ ను తన వద్దే ఉంచుకుంటున్నారని ఆయన సన్నిహిత నేత ఒకరు చెప్పారు. కేబినెట్​ విస్తరణ సమయంలో మంత్రులందరికీ సమాచారం ఇచ్చాక చివరగా ఈటలకు సీఎంవో నుంచి ఫోన్​ వచ్చింది. చివరగా ఫోన్  చేయడమేంటని ఈటల ప్రశ్నించగా.. తమవద్ద ఉండే నంబర్లకు ఫోన్ చేస్తే ఎవరో తెలియని వ్యక్తులు లిఫ్ట్​ చేశారని వారు పేర్కొన్నట్టు తెలిసింది. అప్పట్నుంచి ఈటల తన సెల్ ను ఎవరికీ ఇవ్వకుండా.. తన వద్దే పెట్టుకుంటున్నారని చెప్తున్నారు. ఇవాళ సీఎం ఆఫీసు నుంచి ఆయనకు ఫోన్  ఏదీ రాలేదని ఈటల పేషీ అధికారులు తెలిపారు.

ఎవరికీ ఆహ్వానం పంపలేదు: సీఎంవో వర్గాలు

రాజేంద్రనగర్  సమావేశం కోసం ఏ మంత్రికీ ప్రత్యేకంగా ఆహ్వానం పంపలేదని సీఎంవో వర్గాలు చెప్తున్నాయి. పంచాయతీ యాక్షన్ ప్లాన్ కు అధికారులతో పాటు మంత్రులనూ పిలుస్తామంటూ సీఎంవో విడుదల చేసిన నోట్ చూసి.. మంత్రులు వచ్చారేమోనని పేర్కొన్నాయి. అయితే ఈసారి సీఎంవో నుంచి మంత్రులకు ఫోన్ వెళ్లలేదని, ప్రగతిభవన్ నుంచి వెళ్లి ఉంటుందని తెలిపాయి.

Latest Updates