వరద బాధితులకు తక్షణ సాయం రూ.5 వేలు : జగన్

రాజమండ్రి : గోదావరి వరదలపై గురువారం అధికారులతో సమీక్షించారు సీఎం జగన్. ముంపు బాధిత ప్రాంతాల్లోని కుటుంబాలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేయాలన్నారు. పునరావాస శిబిరాలకు తరలించిన కుటుంబాలకు భోజనాలు అందించాలని అధికారులకు సూచించారు. వాటితో పాటు అదనంగా కుటుంబాలకు రూ.5వేలు చొప్పున ఆర్థిక సాయం అందజేయాలని ఆదేశించారు. ఇళ్లు, పంట నష్టపోయినా నిబంధనల ప్రకారం అందే సహాయం కాకుండా ప్రత్యేకంగా రూ.5వేల ఆర్థిక సహాయం చేయనున్నట్టు తెలిపారు.

ముంపునకు గురైన గ్రామాలకే కాకుండా, వరదల కారణంగా సంబంధాలు తెగిపోయి ఇబ్బందులు పడుతున్న గ్రామాలకూ నిత్యావసర వస్తువులు పంపిణీచేయాలన్నారు జగన్. పంటలు దెబ్బతిన్న ప్రాంతాల్లో పరిహారం కాకుండా ఉచితంగా విత్తనాలు పంపిణీ చేయలని తెలిపారు. పోలవరం ప్రాజెక్టుకోసం సేకరించిన భూముల్లో సాగుచేసిన పంటలు కూడా వరదల కారణంగా దెబ్బతింటే.. అక్కడ వారికీ పరిహారంతోపాటు ఫ్రీగా విత్తనాల సబ్సిడీ ఇవ్వాలన్నారు. సమీక్షకు ముందు గోదావరిలో వరద నీరు పెరగడంతో ప్రభావితమైన గ్రామాలను సీఎం జగన్‌ స్పెషల్ హెలికాప్టర్ లో పరిశీలించారు.

Latest Updates