మూడు కారణాలు.. యూరియా కొరతపై సీఎంకు అధికారుల రిపోర్ట్

హైదరాబాద్ : రాష్ట్రంలో యూరియా కొరతపై సీఎం కేసీఆర్ .. బేగంపేట క్యాంప్ ఆఫీస్ లో రివ్యూ చేశారు. రాష్ట్రంలో రైతులందరికీ సరిపోయేంత యూరియాను వెంటనే గ్రామాలకు సరఫరా చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. మూడు నాలుగు రోజుల్లోనే డిమాండుకు తగినంత ఎరువులను రైతులకు అందుబాటులో ఉంచాలని చెప్పారు. వివిధ నౌకాశ్రయాల్లో ఉన్న స్టాకును రైళ్లు, లారీల ద్వారా వెంటనే తెప్పించి, స్టాక్ పాయింట్లలో పెట్టకుండా… నేరుగా గ్రామాలకే పంపాలని ఆదేశించారు.

రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేనంతగా యూరియా డిమాండ్ ఏర్పడడానికి గల ప్రధాన కారణాలను వ్యవసాయశాఖ అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

  1. కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్ బినిఫిట్ ట్రాన్స్ ఫర్ విధానం ద్వారా రైతులకు ఎరువులు అందివ్వాలని నిర్ణయించింది. దీంతో ప్రైవేటు కంపెనీలు, వ్యాపారులు ఎరువులను పెద్ద మొత్తంలో తెప్పించలేదు.
  2. గత నాలుగు సంవత్సరాలలో ఖరీఫ్ సీజన్లో 6 లక్షల టన్నులకు కాస్త అటూ ఇటూగా యూరియా అవసరం పడింది. ఈసారి ఆగస్టు చివరి నాటికే రాష్ట్రంలో 6 లక్షల టన్నుల యూరియా రైతులకు చేరింది. ఈసారి వరి, మొక్కజొన్న, పత్తి పంటలకు ఏకకాలంలో యూరియా అవసరం పడడంతో పాటు, పంటల విస్తీర్ణం పెరగడం వల్ల డిమాండ్ పెరిగింది.
  3. రైతుల డిమాండ్ కు అనుగుణంగా వ్యవసాయ శాఖ జాగ్రత్త పడి వివిధ కంపెనీలకు యూరియా ఆర్డర్ పెట్టింది. ఆ యూరియా షిప్పుల ద్వారా రావడంలో ఆలస్యం జరిగింది.

ఈ కారణాలను అధికారులు సీఎంకు వివరించారు. పెరిగిన డిమాండ్ ను దృష్టిలో పెట్టుకుని వెంటనే యూరియా తెప్పించి, గ్రామాలకు సరఫరా చేయాలని సీఎం ఆదేశించారు.

Latest Updates