కరోనా టెస్ట్‌లు చేయించుకోకపోతే జైలు తప్పదు

కరోనా వైరస్ పట్ల ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. వైరస్ పై ప్రజల్ని ఆందోళన కలిగించే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకునేలా నిర్ణయం తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆధిత్యానాద్ కరోనా వైరస్ టెస్ట్ ల్ని వ్యతిరేకించే వారిపై  హెచ్చరికలు జారీ చేశారు. కరోనా వైరస్ పై అసత్య ప్రచారం చేసినా, ప్రజల్ని భయాందోళనకు గురిచేసినా కఠినంగా శిక్షిస్తామన్నారు. దీంతో పాటు వైరస్ పై టెస్ట్ చేయించుకునేందుకు తిరస్కరించే వారిని జైలుకు పంపిస్తామని హెచ్చరించారు.

ఈ సందర్భంగా హెల్త్ మినిస్టర్ జై ప్రతాప్ సింగ్ మాట్లాడుతూ ఎపిడిమిక్ డిసీజ్ యాక్ట్  సెక్షన్-3 కింద నిందితుల్ని శిక్షిస్తామన్నారు. కరోనా టెస్ట్ లు చేయించుకునేందుకు తిరస్కరించినా, డాక్టర్ల విధులకు ఆటంకం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అవసరమైతే  నేరస్థులను  చట్ట ప్రకారం జైలుకు పంపుతామని అన్నారు.

వైరస్ పై భయపడొద్దు

కరోనా వైరస్ పట్ల ప్రజలు భయాందోళనకు గురి కావొద్దని మినిస్టర్ జై ప్రతాప్ సింగ్ అన్నారు. ప్రభుత్వం సూచించిన విధంగా ప్రజలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. తదుపరి నిర్ణయాలు తీసుకొని  మార్చి 20 న పరిస్థితుల్ని సమీక్షిస్తామని చెప్పారు.

Latest Updates