కోచింగ్ సెంటర్లలో ఫీజుల దందా.. అడ్డుకట్ట ఎప్పుడో..?

హైదరాబాద్, వెలుగు: నగరంలో కోచింగ్ సెంటర్లకు అధికంగా డిమాండ్ ఉంది. దీంతో ఎక్కడపడితే అక్కడ ఇష్టానుసారంగా కోచింగ్ సెంటర్లను నెలకొల్పారు. నిర్వహకులు నిబంధనలు పట్టించుకోకుండా చిన్నచిన్న గదుల్లో వందల మందికి కోచింగ్​ఇస్తూ అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నారు. కానీ వారి భద్రత విషయం మరిచిపోతున్నారు. రెండు నెలల క్రితం సూరత్ అగ్ని ప్రమాద ఘటనతో తేరుకున్న జీహెచ్‌ఎంసీ హడావుడిగా నగరంలో ఉన్న కోచింగ్ సెంటర్లపై ఆకస్మిక దాడులు చేసింది. నిబంధనలు పాటించని 250 పైగా సెంటర్లు మూసేసింది. అయితే ఈ కోచింగ్ సెంటర్ల మూసివేత పెద్ద కోచింగ్ సెంటర్లకు వరంగా మారింది. ఇదే అదనుగా వివిధ రకాల ఫీజులను అమాంతం పెంచేశాయి. అధికారుల తనిఖీల తర్వాత కోచింగ్​సెంటర్లు ఫీజులు దాదాపు 20 నుంచి 30 శాతం వరకూ పెంచేశాయి. అశోక్ నగర్ లో గ్రూప్–2 కోచింగ్ సెంటర్లు ఎక్కువగా ఉంటాయి. దీనికి కోచింగ్​ తీసుకుంటే మిగతా పరీక్షలకు సైతం పనికొస్తుందని 70 శాతం మంది గ్రూప్–2 కోచింగ్​కే మొగ్గు చూపుతుంటారు. దీనికి గతంలో రూ.16 వేల రూపాయలున్న ఫీజు.. ప్రస్తుతం రూ.20 వేలకు పైగా వసూలు చేస్తున్నారు.

నిరుద్యోగుల ఆశలను ఆసరా చేసుకుని..

ఫీజులు ఎంత పెంచినా ఉద్యోగం సాధించాలనే ఆశతో నగరానికి వచ్చే నిరుద్యోగ యువత చేసేదేమీ లేక నిర్వహకులు చెప్పినంత ఫీజు చెల్లిస్తున్నారు. నిరుద్యోగుల నిస్సహాయతను ఆసరా చేసుకుని క్యాష్ చేసుకుంటున్నారు. నిరుద్యోగులు కూడా కోచింగ్ లేకుండా ఉద్యోగం సాధించలేమని కోచింగ్ కు ఎగబడుతున్నారు. దీంతో కోచింగ్​ సెంటర్ల నిర్వహకులు ఇష్టానుసారంగా డబ్బులు వసూలు చేస్తున్నారు.

అకడమిక్ చదువులు పనికిరావా?

నిజానికి ప్రభుత్వం నిర్వహించే పోటీ పరీక్షలకు సిలబస్ ప్రాథమిక స్థాయిలో మాత్రమే ఉంటుంది. గ్రాడ్యుయేషన్ వరకూ సరిగ్గా చదివి సిలబస్ ప్రకారం అకాడమీ పుస్తకాలను చదివితే సరిపోతుందంటున్నారు నిపుణులు. ప్రభుత్వం కోచింగ్ సెంటర్లపై చర్యలు తీసుకోకపోవడం, వాటిపై ఒక నియంత్రన చేయకపోవడంతో ఈ సెంటర్లకు విలువ పెరిగింది.

ప్రభుత్వం, విద్యాశాఖ పర్యవేక్షణ ఉండాలి

నిరుద్యోగులు కోచింగ్ ఫీజుల నియంత్రణపై ప్రభుత్వ అజమాయిషీ ఉండాలంటున్నారు. కోచింగ్ సెంటర్లు కూడా విద్యావ్యవస్థలో
బాగమేనని అక్కడ కూడా చదువుకునేందుకే కదా వచ్చేదని వీటిపై ఒక కమిటీని నియమించి
రెగ్యులేషన్ చేయాలని వీటి ప్రతీ పనిని
ప్రభుత్వం, విద్యాశాఖ పర్యవేక్షించాలంటున్నారు విద్యార్థులు.

ప్రభుత్వం ఒక విధానం తేవాలి

కోచింగ్ సెంటర్లపై ప్రభుత్వం ఒక విధానాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఈ కోచింగ్ సెంటర్ల యజమానులు వ్యాపారం మాదిరిగా చేస్తూ నిరుద్యోగులను మోసం చేస్తున్నారు. విశ్వవిద్యాలయాల్లో చదివే విద్యార్థులు ఎటువంటి కోచింగ్ లేకుండానే ఉద్యోగాలు సాధించిన సందర్భాలు కోకొల్లలు. ఇప్పుడున్న కోచింగ్ సెంటర్లలో ఉన్న అద్యాపకుల అర్హతలు ఏంటనేది నిరుద్యోగులు ఆలోచించాలి. సిలబస్ ను సరిగ్గా ఫాలో అవుతూ అకాడమీ పుస్తకాలతో సులభంగా సబ్జెక్ట్ ను అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వం కూడా ఉన్న కోచింగ్ సెంటర్లకు లైసెన్సింగ్ విధానం పెట్టి ఒక అర్హత పరీక్ష ద్వారా అధ్యాపకులను రిక్రూట్ చేసుకోవాలి.  దీంతో క్వాలిటీతో పాటు ప్రభుత్వానికి టాక్స్ రూపంలో ఆదాయం కూడా ఉంది.  – డాక్టర్ అమరేందర్ రెడ్డి,  ప్రొఫెసర్ ఓయూ

ఉద్యోగం సాధించాలని వచ్చా..

ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని నగరానికి వచ్చా. ఇది వరకు కోచింగ్ తీసుకున్న వారిని కనుక్కుని కొన్ని కోచింగ్ సెంటర్లను కన్సల్ట్ అయ్యా. లాస్ట్ బ్యాచ్ వాళ్ళకు ఉన్న ఫీజు.. ఇప్పుడు లేదు. ఇంటి నుంచి వచ్చేప్పుడు పాత ఫీజు ప్రకారం తెచ్చుకున్నా. కానీ ఇక్కడికి వచ్చే సరికి పరిస్థితి వేరేలా ఉంది. ఫీజులు పెంచడం దోచుకోవడమే. – వంశీ, విద్యార్థి

Latest Updates