జోరుగా కోడి పందేలు.. ‘విన్నర్‌’కి రాయల్ ఎన్‌ఫీల్డ్

కృష్ణా జిల్లాలో సంక్రాంతి కోడి పందేలు జోరుగా సాగుతున్నాయి. పామర్రు, మచిలీపట్నం, గన్నవరం ప్రాంతాల్లో నిబంధనలను పక్కన పెట్టి కోళ్లకు కత్తులు కట్టి బరిలో దించుతున్నారు. మరోవైపు పామర్రులో కోడి పందేల మాటున జూదం కూడా విచ్ఛలవిడిగా సాగుతోంది.

30లో 16 కొడితే.. బంపర్ ఫ్రైజ్

గన్నవరం నియోజకవర్గంలో బావులపాడు మండలం అంపాపురంలో కోడిపందేలు పోటాపోటీగా వేస్తున్నారు. ఓ వైపు స్థానిక ఎమ్మెల్యే అనుచరుల బరి, మరోవైపు వైసీపీ ఇన్‌చార్జ్ అనుచరుల బరి నడుస్తున్నాయి. ఇక్కడ నడుస్తున్న బరుల్లో 30లో 16 గెలిచిన వారికి రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌ని బహుమతిగా పెట్టారు నిర్వాహకులు. ఇవికాక, కోళ్లపై రెండు వైపులా పై పందేలు భారీగా సాగుతున్నాయి.

9.3 లక్షలు గెలిచిన గుంటూరు వాసి

కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పొలాల్లో టెంట్లు వేసి కోడి పందేలు వేశారు. ఇక్కడ నిబంధనలకు విరుద్ధంగా కోళ్లకు కత్తులు కట్టి బరిలోకి దించారు నిర్వాహకులు. కోడి పందేల ముసుగులో గుండాట, లోన బయట కూడా జోరుగా సాగుతున్నాయి. పై పందేలలో లక్షల్లో డబ్బు చేతులు మారుతోంది. ఇప్పటికే పోటీలో గెలిచిన ఓ కోడిపై పందెం కాసి గుంటూరుకు చెందిన ఓ వ్యక్తి రూ.9.3 లక్షలు సొంతం చేసుకున్నాడు.

Latest Updates