65 శాతం తగ్గిన కాఫీ డే షేర్లు

  • సిద్ధార్థ మరణం తర్వాత రోజూ లోయర్‌‌ సర్క్యూటే
  • రూ. 1,399 కోట్లకు పడిన మార్కెట్‌‌ కాపిటలైజేషన్‌‌
  • గ్లోబల్‌‌ టెక్‌‌ పార్కు అమ్మకం
  • బ్లాక్‌‌స్టోన్‌‌తో డీల్‌‌
  • డీల్‌‌ విలువ రూ. 3 వేల కోట్లు

ముంబై : ఫౌండర్‌‌ వీ జీ సిద్ధార్థ మరణం నుంచి కాఫీ డే ఎంటర్‌‌ప్రైజస్‌‌ షేర్లు ప్రతి రోజూ లోయర్‌‌ సర్క్యూట్‌‌కి చేరుతూ 65 శాతం నష్టపోయాయి. జూలై 29 నుంచి మొత్తం 11 సెషన్స్‌‌లోనే కాఫీ డే షేరు ధర రూ. 65.95 కి పతనమైంది. దీంతో రూ. 7 వేల కోట్ల గరిష్ట స్థాయిని అందుకున్న మార్కెట్‌‌ కాపిటలైజేషన్‌‌ ప్రస్తుతం రూ. 1,399 కోట్లకు తగ్గిపోయింది. గ్లోబల్‌‌ విలేజ్‌‌ టెక్‌‌ పార్కును అమ్మేస్తున్నట్లు ప్రకటించినా కూడా బుధవారం కంపెనీ షేరు బీఎస్‌‌ఈలో 4.95 శాతం (లోయర్‌‌ సర్క్యూట్‌‌) తగ్గి రూ. 66.25 కి చేరింది. తన సబ్సిడరీ టాంగ్లిన్‌‌ డెవలప్‌‌మెంట్స్‌‌ చేతిలోని గ్లోబల్‌‌ విలేజ్‌‌ టెక్‌‌ పార్కును బ్లాక్‌‌స్టోన్‌‌కు విక్రయించనున్నట్లు కాఫీ డే ఎంటర్‌‌ప్రైజస్‌‌ వెల్లడించింది. ఈ డీల్‌‌ విలువ రూ. 2,600 నుంచి రూ. 3,000 కోట్లని అంచనా వేస్తున్నట్లు కాఫీ డే స్టాక్‌‌ ఎక్స్చేంజ్‌‌లకు తెలిపింది.

90 ఎకరాల విస్తీర్ణంలో టెక్‌‌ పార్కు…

వీ జీ సిద్ధార్థ చనిపోవడంతో కాఫీ డే గ్రూప్‌‌ అప్పులు ఎంతున్నాయనే విషయంలో సందేహాలు తలెత్తాయి. మీడియా కథనాల ప్రకారం వీ జీ సిద్ధార్థ, ఆయన గ్రూప్‌‌ కంపెనీలకు కలిపి మొత్తం అప్పులు రూ. 11 వేల కోట్ల దాకా తేలుతున్నాయి. అప్పుల ఊబిలోంచి బయటపడేందుకే గ్లోబల్‌‌ విలేజ్‌‌ టెక్‌‌ పార్కును విక్రయిస్తున్నారు. ఈ టెక్‌‌ పార్కు 90 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. వీ జీ సిద్ధార్థకు చెందిన రియల్‌‌ ఎస్టేట్‌‌ కంపెనీ టాంగ్లిన్ డెవలప్‌‌మెంట్స్‌‌ లిమిటెడ్‌‌ దీనిని నెలకొల్పింది. రూ. 3 వేల కోట్లకు ఈ పార్కును బ్లాక్‌‌స్టోన్‌‌కు అమ్ముతున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. డ్యూడెలిజెన్స్‌‌, డాక్యుమెంటేషన్‌‌, రావాల్సిన అనుమతులను దృష్టిలో పెట్టుకుంటే ఈ డీల్‌‌ పూర్తవడానికి 30 నుంచి 45 రోజులు పట్టొచ్చని భావిస్తున్నారు. గ్లోబల్‌‌ టెక్‌‌ పార్కు డీల్‌‌ మీద మాట్లాడేందుకు బ్లాక్‌‌స్టోన్‌‌ అంగీకరించలేదు. తాను ఆత్మహత్య చేసుకునే ముందు రాసినట్లుగా చెబుతున్న లెటర్‌‌లో ఈ గ్లోబల్‌‌ టెక్‌‌ పార్కు విలువ రూ. 3,600 కోట్ల దాకా ఉంటుందని వీ జీ సిద్ధార్థ పేర్కొన్నారు. మరో సబ్సిడరీ కంపెనీ ఆల్ఫాగ్రెప్‌‌ సెక్యూరిటీస్‌‌లో వాటాను ఇల్యూమినాటి సాఫ్ట్‌‌వేర్‌‌కు సుమారు రూ. 28 కోట్లకు అమ్మడానికి సూత్రప్రాయ అనుమతి ఇచ్చినట్లు  కూడా కాఫీ డే డైరెక్టర్ల బోర్డు  ప్రకటించింది.

కాఫీ డే అప్పులు కనీసం రూ. 7,653 కోట్లు...

మార్చి 31, 2019 నాటికి కాఫీ డే ఎంటర్‌‌ప్రైజస్‌‌ లిమిటెడ్‌‌ అప్పులు కనీసం రూ. 7,653 కోట్లు. కాఫీ డే ఎంటర్‌‌ప్రైజస్‌‌కు కాఫీ డే గ్లోబల్‌‌ లిమిటెడ్‌‌, సీకాల్‌‌ లాజిస్టిక్స్‌‌ లిమిటెడ్‌‌, టాంగ్లిన్ డెవలప్‌‌మెంట్స్‌‌ లిమిటెడ్‌‌, వే2వెల్త్‌‌, కాఫీ డే హోటల్స్‌‌ అండ్‌‌ రిసార్ట్స్‌‌ లిమిటెడ్‌‌లు ప్రధానమైన సబ్సిడరీలు. కన్సాలిడేటెడ్‌‌ ప్రాతిపదికన (అంటే సీడీఈఎల్‌‌ దాని సబ్సిడరీలు కలిపి) బ్యాంకు లోన్స్‌‌, ఎన్‌‌సీడీల రూపంలో తీసుకున్న అప్పులు రూ. 6,547.38 కోట్లు. ఇందులో షార్ట్‌‌ టర్మ్‌‌ కోసం తీసుకున్న మొత్తం రూ. 1,106 కోట్లు. స్టాండ్‌‌ ఎలోన్‌‌ ప్రాతిపదికన చూస్తే కాఫీ డే ఎంటర్‌‌ప్రైజస్‌‌ అప్పులు కేవలం రూ. 350 కోట్లు. కాఫీ డే గ్లోబల్ (సబ్సిడరీ) అప్పులు మార్చి 31, 2019 నాటికి రూ. 879.67 కోట్లు. ఇక సీడీఈఎల్‌‌ ఆస్తుల విలువ దాదాపు రూ. 11,259 కోట్లు.

Latest Updates