ప్రజల కోసం స్వయంగా రంగంలోకి దిగిన కలెక్టర్, ఎమ్మెల్యే

3 కి.మీ. నడిచి వెళ్ళి..
37 కుటుంబాలకు పంపిణీ
కేరళలోని పథనంథిట్ట జిల్లాలో ఘటన

తిరువనంతపురం: కేరళ… కరోనా మహమ్మారి కోరల్లో చిక్కుకుని విలవిలలాడుతున్న రాష్ట్రం. వైరస్ వ్యాప్తి పెరిగిపోవడంతో ఇప్పటికే అక్కడ 200కు పైగా కేసులు నమోదయ్యాయి. లాక్ డౌన్ వల్ల మారుమూల ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. నిత్యావసరాలు కొరతతో కొట్టుమిట్టాడుతున్నారు. ప్రభుత్వం నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నా అవి అందరికీ అందడం లేదు. ఈ క్రమంలో కిందిస్థాయి అధికారులపై ఆధారపడకుండా తామే రంగంలోకి దిగారు ఓ కలెక్టర్, ఓ ఎమ్మెల్యే. అటవీ ప్రాంతంలో ట్రెక్కింగ్ చేసి గిరిజన గ్రామంలోని ప్రజలకు సరుకులు అందజేశారు. 3 కిలోమీటర్ల మేర సరుకులు మోసుకెళ్ళారు.

37 కుటుంబాలు..
పథనంథిట్టజిల్లాలోని అవనిప్పర గిరిజన గ్రామం.. మీనాచిల్ నదికి అవతలి వైపున పెరియార్ వన్యప్రాణుల అభయారణ్యంలో 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. లాక్ డౌన్ వల్ల ఈ గ్రామంలోని 37 గిరిజన కుటుంబాలకు నిత్యావసరాల కొరత ఏర్పడింది. స్థానిక వార్డు కౌన్సిలర్ ద్వారా సెగ్మెంట్ సీపీఎం ఎమ్మెల్యే కేయూ జనీష్ కుమార్‌‌కు ఈ విషయం తెలిసింది. వలంటీర్లతో కలసి అడవిలోని కుటుంబాలకు ఆహారం, నిత్యావసరాలను పంపిణీ చేయాలని నిర్ణయించారు. జిల్లా కలెక్టర్‌ ‌పీబీ నూహ్‌తో గ్రామానికి బయలు దేరారు. కలెక్టర్, ఎమ్మెల్యే.. బియ్యం ఇతర సరుకులను భుజంపై మోసుకుని వెళ్లారు. నదిని దాటి రోడ్డుకు 3 కిలోమీటర్ల దూరంలోని గిరిజన గ్రామానికి చేరుకున్నారు. 37 కుటుంబాలకు సామగ్రిని అందించారు. జ్వరంతో బాధపడుతున్న పిల్లలకు అవసరమైన సాయం చేశారు.

కైతంగు (చేతి సాయం) పేరుతో నేను ఒక వాలంటీర్ సర్వీసును నడిపిస్తున్నా. అవసరం ఉన్న వాళ్లకు ఆహారం, మందులు, నిత్యావసర సరుకులు ఉచితంగా అందజేస్తున్నాను. మా నియోజకవర్గంలోని 11 వార్డుల్లో ఐదు మంది చొప్పున వాలంటీర్లను ఏర్పాటు చేశాను. అవసరం ఉన్న వాళ్లను ఆడుకుంటున్నా.
– ఎమ్మెల్యే జనీష్ కుమార్

Latest Updates