
మహబూబ్ నగర్(నారాయణ పేట), వెలుగు: స్వాతంత్ర్య వేడుకలను ఘనంగా జరిపేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో అధికారులతో సమావేశమయ్యారు. పోలీస్ పరేడ్గ్రౌండ్లో నిర్వహించే వేడుకలకు వచ్చే ముఖ్య అతిథుల స్పీచ్ ను సీపీవో ఆధ్వర్యంలో చూడాలన్నారు. అవార్డుల కోసం ప్రతీ శాఖ నుంచి రెండు లేదా మూడు పేర్లు పంపాలని చెప్పారు. అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) శ్రీను, ఆర్డీవో రామచంద్ర నాయక్, సీపీవో శైలేశ్ తదితరులు పాల్గొన్నారు.
పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులు ఇవ్వండి
టీజీఐపాస్ ద్వారా పరిశ్రమల ఏర్పాటుకు ఆయా శాఖలు నిర్ణీత గడువులోగా అనుమతులు ఇవ్వాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. బుధవారం కలెక్టరేట్లో పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరై మాట్లాడారు. పరిశ్రమల స్థాపనకు 23 దరఖాస్తులు రాగా 16 మంజూరు చేసి, డీఐపీసీ కమిటీలో ఆమోదం తెలిపారు.
ఫిజియోథెరపీ క్యాంప్ సందర్శన
నారాయణపేట భవిత కేంద్రంలో బుధవారం ఏర్పాటు చేసిన ఫిజియోథెరపీ క్యాంప్ను కలెక్టర్సిక్తా పట్నాయక్సందర్శించారు. వారానికి రెండుసార్లు ఫిజియోథెరపీ చేయించుకోవాలని బాధితులకు సూచించారు. భవిత కేంద్రంలోని గోడలపై బొమ్మలు వేయించాలని డీఈవో గోవిందరాజు, ఇంజనీర్ రాములుకు సూచించారు.