మీ పిల్లలను ఇంటికి  తీసుకుపొండి

పేరెంట్స్ కు ఫోన్లు చేస్తున్న కార్పొరేట్‍ విద్యా సంస్థలు

సబ్జెక్టుతోపాటు స్పెషల్ క్లాసులతో విద్యార్థులపై ఒత్తిడి

మితిమీరితే ప్రమాదం అంటున్న సైకాలజిస్టులు

‘అంబర్‍పేటకు చెందిన బాలకృష్ణ తన కొడుకు పృథ్వీని రూ.1.20లక్షలు పెట్టి ఓ కార్పొరేట్ కాలేజీలో చేర్పించారు. ఐఐటీ, జేఈఈ తదితర పరీక్షలకు సిద్ధం కావాలంటే హాస్టల్‍లో ఉండాలని మేనేజ్‍మెంట్‍ చెప్పడంతో మరో రూ.30 వేలు చెల్లించి ఉంచారు. రెండు నెలలు గడిచాక పిల్లాడు ఒత్తిడికి గురవుతున్నాడు, కొన్నాళ్లు ఇంటికి  తీసుకెళ్లండని కాలేజీ నుంచి ఫోన్‍ వచ్చింది. ఇటీవల ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్న విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నందున కాలేజీ మేనేజ్‍మెంట్‍ ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇది ఒక్క బాలకృష్ణకు ఎదురైన సమస్యే కాదు రూ.లక్షలు కట్టి కార్పొరేట్‍ కాలేజీల్లో చదివిస్తున్న ప్రతి పేరెంట్​కు ఎదురవుతున్న సమస్య.’

హైదరాబాద్‍, వెలుగు: పదో తరగతి వరకు సరదాగా సాగిన స్టూడెంట్​చదువు ఇంటర్మీడియట్‍లోకి రాగానే సీరియస్‍ మోడ్‍లోకి పోతుంది. అప్పటి వరకు స్వేచ్ఛగా చదివిన విద్యార్థులు ఒక్కసారిగా ఒత్తిడికి గురవుతున్నారు. గతంలో ఇలాంటి ఒత్తిడిని తట్టుకోలేక విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడిన దృష్ట్యా కార్పొరేట్ విద్యాసంస్థలు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. చదువులో వెనుకబడి ఒత్తిడికి గురవుతున్న విద్యార్థులను గుర్తించి వారి పేరెంట్స్ కు ఫోన్‍ చేస్తున్నారు. పరిస్థితి తీవ్రతరం కాకముందే మీ పిల్లలను ఇంటికి తీసుకుపోయి విద్యార్థి మానసిక సమస్యలు కుదుటపడ్డాకే తిరిగి పంపించడని పేర్కొంటున్నారు.

కేటగిరీలు చేసి..

విద్యార్థుల ఆసక్తులను, సామర్థ్యాలను అతిగా ఊహించే పేరెంట్స్ డాక్టర్లు, ఇంజినీర్లు చేయాలన్న ఉద్దేశంతో వారిని లక్షలు వెచ్చించి కార్పొరేట్‍ కాలేజీల్లో చేర్పిస్తున్నారు. టెన్త్ వరకు రోజుకు 6 నుంచి 7  గంటలు చదివిన వారు ఇంటర్‍లో మార్నింగ్‍ టూ ఈవినింగ్‍ వరకు చదవాలంటే అడ్జస్ట్​ కావడం లేదు. విద్యార్థుల సామర్థ్యాలను బట్టి ఈ1, ఈ2, ఈ3 అంటూ స్టూడెంట్స్ ను వివిధ కేటగిరీలుగా విభజిస్తూ కార్పొరేట్‍ ఇన్‍స్టిట్యూట్లు స్టూడెంట్స్ ను ఒత్తిడిలోకి నెడుతున్నాయి. ఒకవైపు పేరెంట్స్ ఆశలను నెరవేర్చలేక మరోవైపు తరగతిలో టీచర్లు చెప్పే పాఠాలను ఫాలో కాలేక పిల్లలు తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారు. కొన్ని సందర్భాల్లో ఇది తీవ్ర అనర్థాలకు దారితీస్తోందని సైకాలజిస్టులు అభిప్రాయబడుతున్నారు. ఇలాంటి సమయంలో పేరెంట్స్ అండగా నిలవాలని సూచిస్తున్నారు.

ఓరియంటేషన్‍ క్లాసులు గాలికి

ఇంటర్‍ ఫస్ట్​ఇయర్‍లో అడ్మిషన్లు తీసుకున్న విద్యార్థులకు ఇంటర్‍ సిలబస్‍, చదువులో భాగంగా అనుసరించాల్సిన పద్ధతులు, కోర్సుకు సంబంధించిన సమగ్ర విషయాలను స్టార్టింగ్​లోనే అవగాహన కల్పించేందుకు ఓరియంటేషన్‍ క్లాసులు నిర్వహించాల్సి ఉంటుంది. కానీ దీన్ని చాలా కార్పొరేట్, ప్రైవేట్ కాలేజీలు పాటించడం లేదని విద్యావేత్తలు అంటున్నారు. పైగా ఫస్ట్​ఇయర్‍లో చేరిన రెండో వారం నుంచే విద్యార్థులకు ఐఐటీ, జేఈఈ ఫండమెంటల్స్ పేరిట స్పెషల్​క్లాసులు తీసుకుంటున్నారు. మార్నింగ్‍ ఒక స్టడీ అవర్‍, ఈవెనింగ్‍ మరో స్టడీ అవర్‍ ఇలా రోజంతా చదువులు సాగుతూనే ఉంటున్నాయి. మధ్యలో లంచ్‍, స్నాక్స్ బ్రేక్‍లు ఉన్నా స్టూడెంట్స్ ఆలోచనలన్నీ సబ్జెక్టు, హోంవర్క్ చుట్టూనే తిరుగుతుంటాయని ఎడ్యుకేషనల్‍ సైకాలజిస్టులు తెలిపారు. కాలేజీ హాస్టల్‍లో ఉంటూ చదువుకునే విద్యార్థులకు శారీరక శ్రమ లేకపోవడంతో ఆ ప్రభావం మానసిక సామర్థ్యంపై పడుతోందంటున్నారు. ఒత్తిడి ఉండటం కొంతవరకు మంచిదేనని పెరిగితేనే ఇబ్బందని సైకాలజిస్టులు చెబుతున్నారు.

అనుమతి ఉందా?

హైదరాబాద్‍ కేంద్రంగా మెజారిటీ కార్పొరేట్‍ కాలేజీలు అనుబంధంగా రెసిడెన్షియల్‍ హాస్టల్స్ ను నిర్వహిస్తున్నాయి. ఇందులో అధిక శాతం  అనుమతి లేకుండానే నడిపిస్తున్నట్లు స్టూడెండ్స్ యూనియన్‍ నేతలు ఆరోపిస్తున్నారు. ఇవి ఎక్కువగా నగర శివారుల్లోనే ఉన్నట్లు తెలిపారు. జిల్లాలో సుమారు 2,200 కార్పొరేట్‍, ప్రైవేట్‍ కాలేజీలు ఉన్నాయి.

డుమ్మా కొడుతున్న డే స్కాలర్స్

12–19 ఏండ్ల వారిలో హార్మోన్ల తీవ్రత ఎక్కువగా ఉంటుందని, ఇలాంటి సమయంలో వారు ఏ నిర్ణయం తీసుకునేందుకైనా వెనుకాడరని డాక్టర్లు చెబుతున్నారు. విద్యార్థుల ఆసక్తులు, సామర్థ్యాలను పట్టించుకోకుండా జేఈఈ, నీట్ తదితర కోర్సుల్లో చేర్పిస్తే విద్యార్థుల ఆ చదువులకు సర్దుబాటు కావడం లేదు. దీంతో వారు తీవ్రంగా బాధ పడుతున్నారు. డే స్కాలర్స్ లో కొందరు కాలేజీలకు పోయేందుకు సైతం భయపడుతున్నారు. కొన్ని సందర్భాల్లో కాలేజీలకు డుమ్మా కొడుతున్నట్లు పలువురు పేరెంట్స్ వాపోతున్నారు. ఇక హాస్టల్‍లో ఉంటూ చదువుకుంటున్న విద్యార్థులు తమ సమస్యలను తోటి ఫ్రెండ్స్ కు చెప్పుకొని కుమిలిపోతున్నట్లు, కాలేజీలు ఫోన్‍ చేసి చెబుతున్నట్లు పేరెంట్స్ పేర్కొంటున్నారు. ఇలా అకడమిక్‍ మధ్యలో తమ పిల్లలను వెనక్కు తీసుకొచ్చిన పక్షంలో ఫీజులు వాపస్‍ ఇవ్వమని చెబుతున్నారు. పేరెంట్స్, కాలేజీ మేనేజ్‍మెంట్‍ మధ్యలో ఒక రకమైన ఘర్షణ వాతావరణంలో విద్యార్థులు నలిగిపోతున్నారు. ఇలాంటి సమయాల్లో స్టూడెంట్స్ కు అవగాహన కల్పించాలని సైకాలజిస్టులు పేర్కొంటున్నారు. లేదంటే వారు తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందంటున్నారు.

పేరెంట్స్ అండగా నిలవాలి

విపరీత చదువులు అనర్థాలకు దారితీస్తాయి. అప్పటి వరకు స్వేచ్ఛగా చదువుకున్న వారు సడెన్‍గా నిర్బంధ విద్యలోకి వెళ్తే  కొందరు తీవ్ర మానసిక రోగాలకు గురవుతారు. ఇలాంటి సమయంలో తమ బాధలను చెప్పుకునేందుకు ఫ్రెండ్స్​ని, పేరెంట్స్ ను ఆశ్రయిస్తారు. ఆ టైంలో పేరెంట్స్ అండగా ఉండాలి. మేమున్నామన్న భరోసా ఇవ్వాలి. తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉన్న విద్యార్థులను హాస్టల్‍ నుంచి ఇంటికి తీసుకుపోయి తేరుకునేలా చేయాలి. మరీ తీవ్రంగా ఉంటే సైకాలజిస్టుల సాయం తీసుకోవాలి. సరైన విధంగా మోటివేట్‍ చేస్తే తిరిగి మాములు స్థితికి తీసుకురావొచ్చు.

– మిరియాల లావణ్య, సైకాలజిస్టు

 

బట్టీ చదువులతోనే సమస్య

కార్పొరేట్‍ విద్యాసంస్థలు బట్టీ విధానాన్ని ప్రోత్సహిస్తున్నాయి. తాము చదివిన అంశాల్లో తప్పితే మిగతా విషయాల్లో అవగాహన ఉండటం లేదు. రోజూ18 గంటలు చదవడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతారు. విద్యార్థులను చదువు యంత్రాలుగా తయారు చేస్తున్న కార్పొరేట్‍ విద్యాసంస్థలను ప్రభుత్వం నియంత్రించాలి. స్టూడెంట్స్ లో సామాజిక స్పృహ పెరిగేలా సిలబస్‍ను రూపొందించాలి.

– అచ్యుతరావు, గౌరవ అధ్యక్షుడు, బాలల హక్కుల సంఘం

Latest Updates