ఎంఎస్‌‌పీని కాంగ్రెస్ ఎందుకు చట్టం చేయలేదు?

న్యూఢిల్లీ: వ్యవసాయ రంగంలో కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకురావాలనుకున్న కొత్త బిల్లుల్లో రెండు బిల్స్ రాజ్య సభలో ఆమోదం పొందిన విషయం తెలిసిందే. విపక్ష సభ్యుల ఆందోళనల మధ్య మూజువాణి ఓటుతో ఈ బిల్లులు ఆమోదం పొందాయి. అయితే ఈ బిల్లులను నిరసిస్తూ విపక్షాలు భగ్గుమంటున్నాయి. మరోవైపు హర్యానా, పంజాబ్‌‌‌లో రైతులు ఆందోళనలకు దిగుతున్నారు. ఈ తరుణంలో కొత్త వ్యవసాయ బిల్లులపై సెంట్రల్ అగ్రికల్చర్, ఫార్మర్స్ వెల్ఫేర్ మినిస్టర్ నరేంద్ర సింగ్ తోమర్ స్పందించారు. కనీస మద్దతు ధర (ఎంఎస్‌‌పీ)కి కేంద్రం కట్టుబడి ఉందన్నారు. అయితే ఎంఎస్‌‌పీ చట్టంలో భాగం కాదన్నారు.

‘ప్రతిపక్షం (కాంగ్రెస్) చాలా ఏళ్ల పాటు అధికారంలో ఉంది. ఒకవేళ ఎంఎస్‌‌పీకి చట్టం అవసరమైతే వాళ్లెందుకు దాన్ని తీసుకురాలేదు? ఎంఎస్‌‌పీ చట్టంలోని అంగంగా (భాగం) ఎప్పుడూ లేదు. ఇప్పుడూ లేదు. ఎంఎస్‌‌పీపై విపక్షాల డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించబోదు. ఎంఎస్‌‌పీ అనేది ప్రభుత్వ పరిపాలనా సంబంధిత నిర్ణయం. దీని ఫలితంగానే సేకరణ జరుగుతోంది. అదనంగా మరో 50 శాతం ధరను కలుపుతూ ఎంఎస్‌‌పీని మోడీ సర్కార్ ప్రారంభించింది. రబీ సీజన్‌‌లో పంటలను విత్తక ముందే మేం ఎంఎస్‌‌పీని డిక్లేర్ చేశాం. ఖరీఫ్ సీజన్ ఎంఎస్‌‌పీ త్వరలో మొదలవుతుంది. ఎంఎస్‌‌పీకి బిల్లులతో సంబంధం లేదు. మండీలకు ఆవల జరిగే ట్రేడింగ్‌‌తోనే బిల్స్‌‌కు సంబంధం ఉంటుంది’ అని తోమర్ పేర్కొన్నారు.

Latest Updates