ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల ఖర్చు 30% పెంచండి

హైదరాబాద్, వెలుగు: ఎంపీ, ఎమ్మెల్యేగా పోటీ చేసే క్యాండిడేట్ల ఎన్నికల ఖర్చు 30% పెంచాలని స్టేట్​ చీఫ్ ​ఎలక్టోరల్​ ఆఫీసర్​ కేంద్ర ఎన్నికల సంఘానికి (ఈసీ)కి సూచించారు. అన్నింటి ఖర్చులు పెరిగాయని, ఓటర్ల సంఖ్య కూడా పెరిగిందని, ఇతర అంశాలను దృష్టిలో పెట్టుకొని వచ్చే లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థల ఖర్చు పెంచాలని తెలిపారు. ప్రస్తుతం పార్లమెంట్ స్థానానికి పోటీ చేసే ఎంపీ క్యాండిడేట్ రూ.77 లక్షల వరకు ఖర్చు చేసుకునే అవకాశం ఉంది. ఇది 30 శాతం పెరిగితే రూ. కోటి పది లక్షలు అవుతుంది. అలాగే ఎమ్మెల్యే క్యాండిడేట్​కు రూ.30.80 లక్షల ఖర్చు ఉండగా దీనిని రూ.40.08 లక్షలకు పెంచాలని సూచించారు. కండక్ట్​ఆఫ్​ఎలక్షన్–1961, రూల్​90 ప్రకారం ఎన్నికల్లో పోటీ చేసే ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల ఖర్చు ఏ మేరకు పెంచాలని ఈసీ రాష్ట్ర సీఈవో అభిప్రాయాన్ని కోరింది. ఈ మేరకు సీఈవో శశాంక్ గోయల్ రాష్ట్రంలోని మూడు రాజకీయ పార్టీల నుంచి క్యాండిడేట్ల ఖర్చు పై అభిప్రాయాలను తీసుకున్నారు. ఇందులో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీలో ఉండే క్యాండిడేట్ ఖర్చు 25 శాతం వరకు పెంచాలని తెలిపింది. ఇక ఎంపీగా బరిలో నిలిచే క్యాండిడేట్ల విషయమై పార్టీ హైకమాండ్​సూచనలను పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొంది. బీజేపీ కూడా నేషనల్ పార్టీ సజెస్ట్​చేస్తుందని తెలిపింది. ఇక టీఆర్ఎస్​పార్టీ ఎంపీ నియోజకవర్గానికి రూ.కోటి 50 లక్షలు, అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీలో ఉండే వారికి రూ.50 లక్షల వరకు ఖర్చును పెంచాలని తెలిపింది. ఇటీవలే బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలు, ఇతర రాష్ట్రాల్లో ఉప ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎన్నికల వ్యయాన్ని 10 శాతం పెంచిన విషయం తెలిసిందే.

Latest Updates