మేడారం పనులపై విజిలెన్స్​కు ఫిర్యాదు చేస్తా : సీతక్క

జాతర నిధులను ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేస్తున్నారు
మంత్రి సత్యవతి రాథోడ్ పై ఎమ్మెల్యే సీతక్క ఆగ్రహం

జయశంకర్ భూపాలపల్లి, ఏటూరునాగారం, వెలుగు: ‘నేను మీ ఇంట్లో పనిచేసే అటెండర్ని కాదు.. మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు రావడానికి.. నేను రెండుసార్లు గెలిచిన ఎమ్మెల్యేని. మేడారం జాతర పనుల విషయంలో కాంట్రాక్టర్లకు లాభం చేకూరేలా చేశారు.. నా నియోజకవర్గంలో నాకు తెలియకుండానే తనిఖీలు జరుపుతున్నారు.. సమీక్షలు నిర్వహిస్తున్నారు. . మేడారంలో జరుగుతున్న పనులపై టెక్నికల్ విజిలెన్స్ కమిటీతో తనిఖీలు చేపట్టాలి’ అని రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్ పై ములుగు ఎమ్మెల్యే సీతక్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఏటూరునాగారంలో 60వ పాలకమండలి సమావేశం మంత్రి అధ్యక్షతన జరిగింది.

సమావేశం ప్రారంభంలోనే ఎమ్మెల్యే సీతక్క మాట్లాడారు. మేడారం జాతర పనులు కాంట్రాక్టర్లకు ఉపయోగపడేలా మార్చారని, కనీసం బట్టలు మార్చుకునే గదుల నిర్మాణం, ఇసుక లెవెలింగ్ వంటి పనులు కూడా స్థానికులకు ఇవ్వకుండా బడా కాంట్రాక్టర్లు ఇచ్చి వాళ్లకు లాభం చేకూరేలా చేశారని మండిపడ్డారు. దీనిపై తాను విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేస్తానని అన్నారు. మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ గురువారం మేడారం సమీక్ష సందర్భంగా స్వయంగా తానే ఎమ్మెల్యే సీతక్కను ఆహ్వానించానని, అయినా రాకుండా తనపై లేనిపోని ఆరోపణలు చేయడం తగదన్నారు. ఇకనైనా సమన్వయంతో పని చేస్తూ మేడారం జాతరను దిగ్విజయం చేద్దామని పిలుపునిచ్చారు.

సత్యవతిని తొలగించాలంటూ ధర్నా

ఎస్టీ జాబితాలో అక్రమంగా చేరి గిరిజన శాఖ మంత్రిగా కొనసాగుతున్న సత్యవతి రాథోడ్​ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్​ చేస్తూ ఐటీడీఏ ఎదుట ఆదివాసీ తుడుందెబ్బ నాయకులు ధర్నా నిర్వహించారు. ములుగు జిల్లా ఏటూరునాగారం ఐటీడీఏ 60వ పాలక మండలి సమావేశానికి మంత్రి సత్యవతి రా థోడ్​ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ నేపథ్యంలో తుడుందెబ్బ నాయకులు ఆందోళనకు దిగారు. తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు మైపతి అరుణ్​కుమార్​ను ఎంపీ, మంత్రులతో కలిపిస్తానంటూ సీఐ నాగబాబు వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ కవిత ఇద్దరు దొంగలేనని, వారికి త మ సమస్యలు ఎలా చెప్పుకోవాలంటూ నినాదాలు చే శారు. దీంతో తుడుందెబ్బ నాయకులను పోలీసులు బలవంతంగా అరెస్టు  చేసి పోలీస్​స్టేషన్​కు తరలించారు.

Latest Updates