మత్స్యకారులు, నిర్వాసితుల మధ్య చేపల కొట్లాట

  • కొత్త రిజర్వాయర్లలో చేపలు పట్టుకునేందుకు నిర్వాసితులకు పర్మిషన్
  • జీవో తమ రూల్స్  వ్యతిరేకంగా ఉదంటున్న ఫిషరీస్ డిపార్ట్మెంట్
  • కాళేశ్వరం పరిధిలో లబ్ధి దారుల గుర్తింపునకు రెవెన్యూకు లేఖలు
  • మిడ్ మానేరు పరిధిలో ఇతర కులాలకూ ఫిషింగ్ లైసెన్సులు
  •  వ్యతిరేకిస్తున్న మత్స్యకారులు

కొత్త రిజర్వాయర్ల పరిధిలో మత్స్యకారులు, నిర్వాసితుల నడుమ చేపల పంచాయితీ మొదలైంది. ప్రాజెక్టుల కోసం భూములు త్యాగం చేసిన నిర్వాసితులకు పరిహారంతో పాటు ఆయా రిజర్వాయర్లలో చేపలు పట్టుకునేందుకు ప్రభుత్వం పర్మిషన్​ ఇవ్వడంతో వివాదం మొదలైంది. ఇందుకు సంబంధించిన జీవో వచ్చి ఏడాది దాటినా ఇంతకాలం ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇటీవల నిర్వాసితుల పేరిట ఇతర కులాలవారికీ ఫిషింగ్​ లైసెన్సులు ఇస్తుండడంతో ఇన్నాళ్లూ చేపల వేటపైనే బతుకుతున్న తెనుగు, బెస్త కులస్తులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ప్రాజెక్టుల కోసం భూములు త్యాగం చేసిన తాము చేపలు పట్టుకుంటే తప్పేమిటని నిర్వాసితులు అంటున్నారు. ఈ క్రమంలోనే పలు జిల్లాల్లో నిర్వాసితులకు, మత్స్యకారులకు  నడుమ గొడవలు జరుగుతున్నారు.

 నడిగడ్డలో మొదలైన లడాయి..

ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లాలోని కల్వకుర్తి, నెట్టెంపాడు తదితర లిఫ్టు స్కీంల కింద కొత్తగా పదుల సంఖ్యలో రిజర్వాయర్లు నిర్మిస్తున్నారు. గద్వాల జిల్లాలో నెట్టెంపాడు కింద ఇప్పటికే ఏడు రిజర్వాయర్లు పూర్తయ్యాయి. ఆయాచోట్ల  తాము కూడా చేపలు పట్టుకుంటామని  నిర్వాసితులు వస్తుంటే ముదిరాజ్​ కులస్థులు అడ్డుకుంటున్నారు. ర్యాలంపాడు రిజర్వాయర్ పరిధిలో నిర్వాసిత రైతులు, మత్స్యకార సొసైటీల నడుమ కొన్నాళ్లుగా గొడవలు జరుగుతున్నాయి.  ఈక్రమంలో ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఆయా గ్రామాల్లో ఏకంగా పోలీస్ పికెటింగ్ ఏర్పాటుచేయాల్సి వచ్చింది. దీనిపై ర్యాలంపాడు నిర్వాసితులు కోర్టుకు కూడా వెళ్లారు. తాజాగా ఇదే జిల్లాలోని సంగాల రిజర్వాయర్​ పరిధిలోనూ ఈ వివాదం రాజుకుంది.

రూల్స్​కు వ్యతిరేకమంటున్న​ ఆఫీసర్లు

సర్కారు జారీచేసిన జీవోలు తమ రూల్స్​కు వ్యతిరేకంగా ఉన్నాయని ఫిషరీస్​ ఆఫీసర్లు అంటున్నారు. తమ ​నిబంధనల ప్రకారం కేవలం 20 కులాలకే ​లైసెన్సులు ఇవ్వాలని, ఆ లిస్టు ప్రకారం చూస్తే తెలంగాణలో ఉన్నది కేవలం ముదిరాజ్​(తెనుగు), బెస్త కులస్తులేనని చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 4,400 సొసైటీల్లో 3లక్షల17వేల మత్స్యకారులు సభ్యులుగా ఉన్నారని, వారికి తప్ప ఇతరులకు లైసెన్సులు ఇచ్చే అధికారం తమకు లేదంటున్నారు. పాత రూల్స్ మార్చకుండా కొత్తగా ఎన్ని జీవోలు ఇచ్చినా తామేమీ చేయలేమని పలు జిల్లాల ఆఫీసర్లు స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం తమకు కూడా లైసెన్సులు ఇవ్వాలని పట్టుపడుతున్నారు. పెద్దసంఖ్యలో చేపలు పెంచుతున్న ఎల్లంపల్లి, అన్నారం, సుందిళ్ల,మేడిగడ్డ, మిడ్​మానేరు రిజర్వాయర్ల పరిధిలో నిర్వాసితుల నుంచి ఫోర్స్​ ఎక్కువగా ఉంది. దీంతో మంచిర్యాల లాంటి జిల్లాల్లో ఫిషరీస్​ ఆఫీసర్లు నిర్వాసితుల రైతుల వివరాల కోసం రెవెన్యూ శాఖకు లెటర్​ రాశారు. మిడ్​మానేరు నిర్వాసితుల్లో వివిధకులాలవారికి అక్కడి ఆఫీసర్లు లైసెన్సులు జారీ చేస్తుండడంతో మత్స్యకారులు రోడ్డెక్కుతున్నారు. కాలేశ్వరం రూపంలో రిజర్వాయర్లు నిండి బతుకులు బాగుపడుతాయనుకునే టైంలో సర్కారు ఇలాంటి జీవోలు ఇచ్చి తమ పొట్టకొట్టడమేంటని ప్రశ్నిస్తున్నారు.

 ఆ జీవోల్లో ఏముందంటే..

2018 ఆగస్టు14న ఇరిగేషన్ అండ్ క్యాడ్​ డిపార్ట్మెంట్ ఆఫీసర్లు జీవో ఎంఎస్ నెంబర్ 74 జారీచేశారు. దీని ప్రకారం ప్రాజెక్టుల్లో భూములు కోల్పోయిన నిర్వాసితులకు ఆయారిజర్వాయర్లలో చేపలు పట్టుకునేందుకు పర్మిషన్​ ఇచ్చారు. ఈ ఉత్తర్వులపై అప్పట్లో విమర్శలు చెలరేగడంతో 2019 అక్టోబర్​ 28న దీనిని సవరిస్తూ జీవో ఎంఎస్ నెంబర్ 43 జారీచేశారు. 2013 సెప్టెంబర్​ 27, ఆ తర్వాత నిర్మాణం పూర్తిచేసుకున్న ప్రాజెక్టుల్లో మాత్రమే నిర్వాసితులు చేపలు పట్టుకోవచ్చని స్పష్టంచేశారు. పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల పరిధిలోని అన్నారం, సుందిళ్లబ్యారేజీలు, నందిమేడారం రిజర్వాయర్​, భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ, సిరిసిల్ల జిల్లాలోని మిడ్​మానేరు, గద్వాల,నాగర్​కర్నూల్,వనపర్తి ​జిల్లాల్లో వివిధ లిఫ్టుస్కీముల కింద నిర్మించిన రిజర్వాయర్లతో పాటు సిద్దిపేట జిల్లాలోని అనంతగిరి, రంగనాయక సాగర్, కొండ పోచమ్మ సాగర్​తో పాటు రాష్ట్రవ్యాప్తంగా పలు చిన్నచితక రిజర్వాయర్లు  కూడా ఈజీవో  పరిధిలోకి రానున్నాయి.

మాకు న్యాయం చేయాలి..

తాము తాత ముత్తాతల కాలం నుంచి చేపలుపట్టుకొని బతుకుతున్నామనీ, ఇప్పుడు వేరే కులస్తులకు ఫిషింగ్​ లైసెన్సులు ఇచ్చి తమ పొట్టకొట్టవద్దని మత్స్యకారులు కోరారు.  సిరిసిల్ల జిల్లాకు చెందిన మత్స్యకారులు శుక్రవారం కలెక్టరేట్​​కు  ర్యాలీగా తరలి వచ్చి కార్యాలయం ముందు నిరసన తెలిపారు. మిడ్​మానేరులో ఇప్పటికే తెనుగు, బెస్త కులాలకు చెందిన1500 మంది చేపలు పట్టుకుంటున్నామని, ఇప్పుడు కొత్తగా వేరే కులస్తులకు లైనెన్సులు ఇవ్వడం సరికాదన్నారు. ఆఫీసర్లు ఒక్కొక్కరి నుంచి రూ.5వేలు తీసుకొని అడ్డగోలుగా లైసెన్సులు జారీ చేస్తున్నారని ఆరోపించారు.  ఎద్దు, ఎవుసం లేక కులవృతినే నమ్ముకొని బతుకుతున్న  తమకు అన్యాయం చేయవద్దన్నారు. జీవో నెం 74ను వెంటనే రద్దు చేసి రాష్ట్రంలోనిమత్స్యకారులందరికీ న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం కలెక్టర్​కు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో ముదిరాజ్​ సంఘం జిల్లా అధ్యక్షుడు కోడి అంతయ్య, బొజ్జి దేవరాజు,అంజన్న, సత్తయ్య , పిట్టల భూమేశ్​, తదితరులు పాల్గొన్నారు.

చేపలుపట్టుకుంటే తప్పేంది?

రిజర్వాయర్​లో భూములు కోల్పోయిన మాలాంటి రైతులకు  ఏ ఆధారం లేకుండా పోయింది. మా భూముల్లో ఏర్పాటు చేసిన రిజర్వాయర్​లోనే చేపలు పట్టు కుంటామని అడుగుతున్నాం. ఇందులో తప్పేంది? దీనిపై కోర్టుకు కూడా వెళ్లాం.  అప్పటి కలెక్టర్​ని కలిసి మాకు ఫిషింగ్​ లైసెన్సులు జారీ చేయాలని కోరాం.

–నర్సిహులు, నిర్వాసిత రైతు, ర్యాలంపాడు

మా పొట్టకొట్టద్దు..

ఇతర కులాలకు చేపలు పట్టే అవకాశం కల్పిస్తున్న జీవో 74ను రద్దు చేయాలి. తెనుగు, ముదిరాజ్​, బెస్త కులస్తులకు తప్ప వేరే వాళ్లకు లైసెన్సులు ఇవ్వద్దు. మేము దీన్నే నమ్ముకొని బతుకుతున్నం. ఇప్పుడు పొట్టలు కొట్టద్దు. ఇప్పటికే చేపలుపట్టేకాడ వాళ్లకు, మాకు గొడవలుజరుగుతున్నాయి.

– అంతయ్య, ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు, సిరిసిల్ల జిల్లా

Latest Updates