గంగూలీకి ఊరట..ఆరోపణల్ని కొట్టిపారేసిన బీసీసీఐ

న్యూఢిల్లీ: బీసీసీఐ ప్రెసిడెంట్‌ సౌరవ్‌ గంగూలీపై వచ్చిన కాన్‌ప్లిక్ట్‌ ఆరోపణలను బోర్డు ఎథిక్స్‌ ఆఫీసర్‌ డీకే జైన్‌ కొట్టిపారేశారు. దాదా నిర్వహిస్తున్న బాధ్యతల్లో ఎలాంటి కాన్‌ప్లిక్ట్‌ లేదని స్పష్టం చేశారు. క్యాబ్‌ అధ్యక్షుడిగా ఉంటూ బీసీసీఐ ఏజీఎమ్‌లో ఎలా పాల్గొంటారని గతంలో మధ్యప్రదేశ్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (ఎంపీసీఏ)కు చెందిన సంజీవ్‌ గుప్తా.. గంగూలీపై ఫిర్యాదు చేశాడు. దీనిపై విచారణ జరిపిన జైన్‌.. అక్టోబర్‌ 23న బీసీసీఐ పగ్గాలు చేపట్టేనాటికే గంగూలీ క్యాబ్‌ పదవికి రాజీనామా చేశాడని తేల్చారు. ‘నా దృష్టిలో గంగూలీ అంశంలో కాన్‌ప్లిక్ట్‌ ఉందని అనుకోవడం లేదు. ఒక వ్యక్తికి ఒకే పదవి అన్న కొత్త రాజ్యాంగం రూల్‌ను గంగూలీ పాటిస్తున్నాడు. కాబట్టి అతనిపై వచ్చిన ఫిర్యాదును కొట్టేస్తున్నాం’ అని జైన్‌ ఆర్డర్‌ జారీ చేశారు. ప్రస్తుతం ఇండియా క్రికెట్‌ను కుదిపేస్తున్న కాన్‌ప్లిక్ట్‌ అంశానికి డిసెంబర్‌ 1న జరిగే సాధారణ సర్వసభ్య సమావేశంలో సవరణలు తీసుకురావాలని బీసీసీఐ భావిస్తోంది. దీనికి సుప్రీంకోర్టు కూడా ఆమోదం తెలిపితే మరింత మంది మాజీలు బోర్డు పదవుల్లోకి వచ్చే చాన్స్​ ఉంది.

Latest Updates