కరోనాతో ఆగమైతున్న ఫ్యామిలి రిలేషన్స్

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫ్యామిలీ రిలేషన్స్​ ఆగమాగం అయితన్నయ్ . కరోనాతో పాటే కొంపలోకొచ్చిన కయ్యాలు వింటే సుత మీరే ఒప్పుకుంటరని అంటున్నరు సైకాలజిస్ట్ సి. వీరేందర్. అట్లయిన ఇండ్లలో ఒకింటి ముచ్చట చదువుండ్రి.

హైదరాబాద్​ సిటీల ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్​ ఉన్నడు. తల్లికి కరోనా వస్తే బతికించుకోవాలని దవాఖానల చేర్పించిండు. పైసలు ఖర్చవుతా ఉన్నయ్​. అమ్మ దవాఖాన్ల ఎట్లుందోనని రోజూ ఫోన్​ చేస్తన్నడు. డాక్టర్లతో మాట్లాడతన్నడు. రోజూ ఫీజులు కట్టమంటున్నరు. ఆయన కడుతున్నడు. ఆ ముచ్చట ఇన్నప్పుడుల్లా పెండ్లాం రంది పడుతున్నది. ‘ఉన్న డబ్బులన్నీ అయిపోతన్నయ్​. రేపు ఎట్లుంటదో తెలియదీ? అప్పులే మిగులతయా?’ అని రంది పడుతున్నది. యాంగ్జయిటీ ఎక్కువై నిద్ర పోవట్లే. ఇంట్ల పంచాయితీ తేలట్లే, ఆమెకు నిద్ర పట్టట్లే. ఆఖరికి సైకాలజిస్ట్ దగ్గరకు పట్టుకొచ్చినరు. ముచ్చటంతా విని.. ఆయనకు వచ్చే జీతం, సర్వీస్​ లెక్కలు చెప్పినరు. దవాఖానాకు కట్టే ఫీజుల 70 శాతం రీఎంబర్స్​మెంట్ అయితదని చెప్పినరు. ఫ్యామిలీ ఫైనాన్స్​ లెక్కలన్నీ చెప్పినరు. కరోనా ఖర్చు చెప్పినరు. అప్పుడు ఇంతేనా అనుకున్నది. ‘మీ అత్తని బాధ్యతగా చూసుకుంటేనే కదా, రేపు మీ పిల్లలకు మిమ్మల్ని బాధ్యతగా చూసుకోవాలనే ఆలోచన వచ్చేది’ అని చెప్పి కౌన్సెలింగ్​ చేసి పంపించినరు. ఈ లొల్లి ఆ ఒక్కింటిది కాదు. పేర్లు, చేసే ఉద్యోగాలు వేరు కానీ యాభై శాతం ఇట్లనే రంది పడుతుండ్రు.

కరోనా వస్తే ముందు హోమ్ ఐసోలేషన్​ పాటించాలె. మరీ ఇబ్బందిగుంటే దవాఖానల చేర్చాలే. అయితే పెద్దోళ్లకు వచ్చి ఇంట్ల ఉంటే తమ పిల్లలు ఆగమైతరని, తమకూ వస్తదని రందిపెట్టుకుంటున్నరు కోడళ్లు. మోరల్​ సపోర్ట్​ ఇవ్వాల్సింది పోయి ఇదేం లొల్లని అంటే ఇగ పంచాయితీలే వస్తన్నయ్​. ఈ పంచాయితీలల్ల  భార్యాభర్తలిద్దరి తప్పు ఉన్నది. ఆదాయం, ఖర్చు, సేవింగ్స్​ లెక్కలేయీ ఆడోళ్లకు చెప్పకుండా ఉంటే గిట్లాంటి పంచాయితీలే వస్తున్నయట. అన్నిట్ల నేను చెప్పిందే నడవాలని మొగుడు, ఒక్కరి కోసం అందరం బాధ పడాల్నా అని పెండ్లాం అనుకోకుంటే ఇంట్ల ఏ తండ్లాట ఉండదు. అందుకనే కరోనా వచ్చినంక వస్తున్న సమస్యలేందో యాది చేసుకుంటే అన్ని ప్రాబ్లమ్స్​కు పరిష్కారం తెలుస్తది.

ఇంటింటి రందికి ఒక్కటే మందు

కరోనా నుంచి బయటపడ్డా రేపెట్ల బతకాలనే రంది పడేవాళ్లు చెప్పే సమస్యలేందంటే.. ‘కరోనా పాజిటివ్ వచ్చిన పెద్దోళ్లను కేర్​ఫుల్​గా చూస్తం సరే, మరి అప్పుడు మాకే ప్రాబ్లమ్ వస్తే ఎట్ల? ఇంట్ల అందరికీ వస్తే పరిస్థితి ఏంది? మా దగ్గర అంత డబ్బే లేదు. ఎవరు సహకరిస్తరు? ఉన్న డబ్బంతా ముసలోళ్ల ట్రీట్మెంట్​కే పెడితే, రేపు  పిల్లల చదువు ఎట్ల, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే ఎట్ల బయటపడుతం?’ అని అంటున్నరు.

అప్పుడేం జేయాల్నంటే? 

ఇంట్ల ఎవరికైనా కరోనా వస్తే ఏ దవాఖానలో చేర్పించాలో అందరూ కూర్చుని మాట్లాడుకోవాలె. ముందు 104కి ఫోన్​ చేసి, లేకుంటే తెలిసిన డాక్టర్​కి కాల్ ​చేసి.. ఏ హాస్పిటల్​లో చేరితే ఎంత ఖర్చయితది? గవర్నమెంట్ దవాఖాన సేఫ్టీయేనా? హోం ఐసోలేషన్​లో ఉంటే మిగతావాళ్లు సేఫేనా? వంటివి అడిగి తెలుసుకోవాలె.  హోమ్​ ఐసోలేషన్​లో ఉంటే పదిహేను రోజులకు కావాల్సినంత డబ్బుని సమకూర్చుకోవాలె. ఇట్ల ప్రీప్లాన్డ్​గా ఉంటే ఫైనాన్షియల్​ ప్రాబ్లమ్స్​ని ఫేజ్​ చేయొచ్చు. అట్లనే ఈ కష్టకాలంలో మనిషికి తోడుగా ఉండి, బలాన్ని ఇవ్వాలె. కానీ కుంగిపోయేలా చేస్తే చాలా ప్రమాదం ఉంటది. తనవాళ్లను కాపాడుకోవడం తన బాధ్యత అనుకునే మనిషి మీద మరికాస్త ఎక్కువ ప్రేమ చూపాలె. కానీ నిందలు, అవమానాలు, అనుమానాలు పెంచుతూపోతే మనసు విరిగిపోతది.

పెద్దోళ్లను చూసుకునుడు అందరి బాధ్యత

భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగులే. భార్య తండ్రికి కరోనా పాజిటివ్​ వచ్చింది. ఆమె తండ్రిని దవాఖానలో చేర్చింది. ఫీజు కట్టింది.  ‘మీ నాయనకి నువ్వు చేసుడేంది.. మీ అన్న చేయాలె’ అని భర్త లొల్లి. ఆమె అన్న వేరే దేశంల ఉంటడు. ఆమె తప్పదని తెగేసి చెప్పింది. ‘మన పిల్లల గురించి పట్టించుకుంటలేవు. నా మాట లెక్కలేదు. నా మీద గౌరవం లేదు’ అని మొగుడు లొల్లిలొల్లి జేస్తండు. ఆ అన్న ‘ఇక్కడ బ్యాంకులు సరిగ పనిచేయట్లే, అన్ని మంచిగయినంక పైసలు పంపిస్త’ అని మెసేజ్​ చేసి, హామీ ఇస్తే ఆయన సల్లబడ్డడు.

అయితే దవాఖానలో ఉన్న అమ్మానాన్నలతో కొడుకు ప్రేమగా మాట్లాడటం, బాధ్యతగా ట్రీట్​మెంట్ ఇవ్వడాన్ని సగం మంది కోడళ్లు ఓర్వట్లే. ముసలోళ్ల మీద ఎందుకంత ప్రేమ అని పంచాయితీకి దిగుతున్నరు. ఈ గొడవలతో పిలగాండ్లు ఆన్​లైన్​ క్లాసులు ఇనలేక పోతున్నరు. వాళ్లు హోమ్​వర్క్​ సరిగా చేస్తలేరని టీచర్​ రిపోర్ట్ చేస్తే.. ‘పొద్దుగాల లేచినప్పటి నుంచి  అమ్మానాన్న అంటూ తిరుగుతున్నవు కానీ, పిల్లల మీద అందులో సగమన్నా ప్రేమ లేదు’ అని ఇంకో రూపంలో కసి తీర్చుకుంటున్నరు. ఎవరైతే ఏంది? అందరూ తెలుసుకోవాల్సింది ఒక్కటే. అయినోళ్ల మీద ప్రేమ ఉండాలె, దంపతులు ఒకరి మీద ఒకరికి విశ్వాసం ఉండాలె.–సి.వీరేందర్, సైకాలజిస్ట్​​

Latest Updates