లోక్​సభలో గరం గరం : అధికార, ప్రతిపక్ష సభ్యుల గొడవ

రాహుల్ సారీ చెప్పాలన్న కేంద్ర మంత్రి హర్షవర్ధన్
వెల్ లోకి దూసుకొచ్చిన కాంగ్రెస్ ఎంపీలు
హర్షవర్ధన్ మీదికి కోపంగా వెళ్లిన మాణిక్కం ఠాగూర్
అడ్డుకున్న ఎంపీలు.. తోపులాట

న్యూఢిల్లీఅధికార, ప్రతిపక్ష సభ్యుల గొడవతో లోక్​సభ శుక్రవారం దద్దరిల్లింది. ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశించి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై తోపులాట చోటు చేసుకుంది. క్వశ్చన్ అవర్ సందర్భంగా తలెత్తిన గందరగోళం గొడవకు దారితీసింది. రాహుల్ కామెంట్స్​పై కేంద్ర మంత్రి హర్షవర్ధన్ అభ్యంతరం చెప్పడం.. కాంగ్రెస్ సభ్యులు వెల్​లోకి దూసుకురావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో కేంద్ర మంత్రులు, ఎంపీలు కలగజేసుకోవాల్సి వచ్చింది. నినాదాలు, నిరసనల నడుమ సభ వాయిదా పడింది.

రాహుల్‌ ఏమన్నారంటే

ఆరునెలల్లో నిరుద్యోగ సమస్యను పరిష్కరించకపోతే ప్రధాని మోడీని యువత కర్రలతో కొడతారని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రాహుల్‌ గాంధీ   కామెంట్​ చేశారు. దీనిపై ప్రధాని  గురువారం పార్లమెంట్‌లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా కూడా సమాధానం చెప్పారు.   కర్రల దాడిని తట్టుకునేలా తాను రోజూ చేసే సూర్య నమస్కారాల సంఖ్యను పెంచాలని నిర్ణయించుకున్నానని అన్నారు.

రాహుల్ క్షమాపణ చెప్పాలి..

మెడికల్ కాలేజీల ఏర్పాటుకు సంబంధించి లోక్‌‌‌‌సభలో రాహుల్ అడిగిన ఓ ప్రశ్నకు సమాధానమిచ్చేందుకు కేంద్రమంత్రి హర్షవర్ధన్ రెడీ అయ్యారు. ‘‘సర్.. ప్లీజ్ ఎక్స్​క్యూజ్ మి. రాహుల్ ప్రశ్నకు బదులివ్వడానికి ముందు.. ఆయన మోడీని ఉద్దేశించి చేసిన కామెంట్స్​పై ఓ ప్రకటన చేయాలని అనుకుంటున్నా. దేశ ప్రధానిపై రాహుల్ చేసిన అనుచిత వ్యాఖ్యలను నేను ఖండిస్తున్నా” అని చెప్పారు. రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. స్పీకర్ ఓం బిర్లా కలగజేసుకుని.. అడిగిన ప్రశ్నకు మాత్రమే సమాధానమివ్వాలని సూచించారు. దీంతో మంత్రి తన స్టేట్​మెంట్ చదవడం కొనసాగించారు. ఇంతలో కాంగ్రెస్ ఎంపీలు వెల్​లోకి దూసుకొచ్చారు. హర్షవర్ధన్ వ్యాఖ్యలపై నిరసనలు తెలిపారు.

కోపంతో మంత్రికిపైకి దూసుకెళ్లిన కాంగ్రెస్ ఎంపీ

మంత్రి హర్షవర్ధన్ మాట్లాడుతుండగానే తమిళనాడుకు చెందిన కాంగ్రెస్ ఎంపీ మాణిక్కం ఠాగూర్ ట్రెజరీ బెంచ్​ల దగ్గరికి దూసుకెళ్లారు. కోపంతో మంత్రి దగ్గరికి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో వెంటనే స్పందించిన యూపీకి చెందిన బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్.. మాణిక్కంను అడ్డుకున్నారు. ఈ సమయంలో కేరళకు చెందిన కాంగ్రెస్ ఎంపీ హిబి ఈడెన్ కలుగజేసుకున్నారు. తర్వాత స్మృతి ఇరానీ సహా పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు,  వారి దగ్గరికి వచ్చారు. గొడవ జరగకుండా అడ్డుకున్నారు. ‘‘గయ్స్.. ఏం చేస్తున్నారు. అసలేం జరుగుతోంది ఇక్కడ” అని స్మృతి అరవడం కనిపించింది. సభ ప్రారంభం కాగానే గొడవ మళ్లీ మొదలైంది. మాణిక్కం ఠాగూర్​ను సభ నుంచి బహిష్కరించాలని బీజేపీ ఎంపీలు నినాదాలు చేశారు. రాహుల్ క్షమాపణ చెప్పాలని ఓ సభ్యుడు అరిచారు. గందరగోళం కొనసాగుతుండటంతో సభను 2 గంటలకు వాయిదా వేశారు. తర్వాత మంత్రి ప్రహ్లాద్ జోషీ మాట్లాడిన తర్వాత సభ వాయిదా పడింది.

Latest Updates