ఏపీ విద్యాశాఖ ఉత్తర్వులతో టీచర్లలో గందరగోళం

కొందరికే మినహాయింపులు అనడంపై ఉపాధ్యాయుల ఆగ్రహం

నాడు-నేడు పనులు చూస్తూ గడిపేయడమే డ్యూటీనా అంటూ ఆవేదన

ఉత్తర్వులు సవరించి అందరికీ సమన్యాయం చేయాలని డిమాండ్

విజయవాడ: ఏపీ విద్యాశాఖ జారీ చేసిన జీవో నెంబర్ 145 ఉపాధ్యాయుల్లో గందరగోళం సృష్టిస్తోంది. అందరూ హాజరు కావాల్సిన అవసరం లేదంటూ.. కొందరికి మినహాయింపులు వర్తింప చేయడం ఉపాధ్యాయ వర్గాల్లో తీవ్ర అసంతృప్తికి గురిచేస్తోంది. కొన్ని చోట్ల విభేదాలకు దారితీస్తోంది. వీటిని సహించలేక కొందరు ఇదేమీ న్యాయమని ప్రశ్నిస్తూ..  అందరికీ సమన్యాయం కల్పించాలనే డిమాండ్ తో నిరసనలకు దిగుతున్నారు.

                    ఏపీలో గత నెల 22న సర్కారీ స్కూళ్లు రీ ఓపెన్ అయిన విషయం తెలిసిందే. కరోనా వ్యాప్తి రోజు రోజుకూ పెరుగుతుండడంతో విద్యార్థులు లేకుండా కేవలం టీచర్లు మాత్రమే హాజరు కావాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆన్ లైన్ తరగతులు.. శిక్షణ కార్యక్రమాల కోసం టీచర్లందరూ విధిగా హాజరు కావాల్సిందేనని నిర్దేశించినా.. ఎక్కడా శిక్షణ కార్యక్రమాలు గాని.. ఆన్ లైన్ క్లాసులు గాని ప్రారంభించలేదు. అయినా చేసేదేమీ లేక టీచర్లు ప్రతి రోజు ఉదయం స్కూళ్లకు వచ్చి సాయంత్రం వరకు ఖాళీగా ఉండి వెళ్లిపోతున్నారు. స్కూళ్లకు వెళ్లింది లేనిది చెక్ చేయడం కోసం విద్యాశాఖ అధికారులు తనిఖీలు చేపట్టడంతో దాదాపు అందరూ హాజరవుతున్నారు. పనేమీ లేకున్నా ఖాళీగా కూర్చోబెట్టడం కోసం స్కూళ్లకు హాజరు కావాలని నిర్దేశించడంపై ఉపాధ్యాయుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయింది. ఓ వైపు లాక్ డౌన్.. ఇంకో వైపు చాలా స్కూళ్లలో కరెంటు కనెక్షన్లు లేవు.. బాత్ రూమ్ లు ఉన్నా.. చుక్క నీళ్లు లేక వాడలేని పరిస్థితి. దీంతో మహిళా ఉపాధ్యాయుల ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. వీటన్నింటిపై అధికారులను ప్రశ్నిస్తూ ఆందోళన చేయడంతో.. ప్రభుత్వం దిగి వచ్చింది. ప్రతి ప్రభుత్వ పాఠశాలకు తప్పనిసరిగా ప్రహారిగోడ, బాత్ రూమ్.. తరగతి గదులకు మరమ్మత్తులు చేసి కొత్త రంగులు వేసే నాడు-నేడు కార్యక్రమం ప్రారంభించింది.  ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాలల్లో కొద్దిపాటి మరమ్మత్తులు అవసరమైన చోట వెంటనే మరమ్మత్తులు చేసి రంగులు వేశారు.  మిగతా చోట్ల అంటే బాత్ రూమ్ లు.. టాయిలెట్లు.. ప్రహారి గోడలు నిర్మించే చోట్ల  గ్రామ సచివాలయ ఇంజనీర్లు పనులు చేయిస్తుంటే.. ఉపాధ్యాయులు చేసేదేమీ లేక స్టాఫ్ రూమ్ లో.. చెట్ల కింద కబుర్లు చెప్పుకుని సాయంత్రం వరకు గడిపి తిరిగి ఇళ్లకు వెళుతున్నారు. ఇదే విషయంపై పలువురు అసంతృప్తితో ప్రభుత్వంలోని నేతలను  ప్రశ్నించగా.. జీవో నెంబర్ 145 విడుదల చేసింది.

             జీవో 145 ప్రకారం ప్రాథమిక పాఠశాలల్లోని టీచర్లు వారానికోరోజు అంటే ప్రతి మంగళవారం స్కూలుకు హాజరై సాయంత్రం వరకు ఏవైనా పనులుంటే చూసుకుని వెళ్లాలి. అలాగే యూపీ, హైస్కూళ్లలో టీచర్లు నాడు-నేడు పనులు జరుగుతుంటే అందరూ హాజరు కావాలి.. పనులు లేని చోట్ల వారానికి రెండు రోజులు అంటే  ప్రతి సోమ మరియు గురువారాల్లో హాజరు కావాలని నిర్దేశించారు. కరోనా కంటైన్మెంట్ జోన్లలో ఇళ్లున్న వారు… 50 ఏళ్లకు పైబడి.. దీర్ఘ కాలిక వ్యాధులున్న వారు తగిన ఆధారాలు చూపించి మండల విద్యాధికారుల వద్ద మినహాయింపు తీసుకోవాలని ఆదేశించారు.

        అయితే ఈ జీవో నిబంధనలపై ఉపాధ్యాయులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నాడు-నేడు పనులు జరుగుతుంటే తాము చూస్తూ గడపం తప్ప ఏమీ చేయలేకపోతున్నామని.. చిన్నపాటి మార్పులు చెప్పినా.. పనులు చేయిస్తున్న సచివాలయ ఇంజనీర్లు.. తాపీ పని వాల్లు ఎవరూ పట్టించుకునే పరిస్థితి లేదంటున్నారు. అసలే లాక్ డౌన్.. ఆపై అనారోగ్య కారణాలు.. గ్రామాల్లో తాగునీటికీ ఇబ్బందే. మహిళా టీచర్లు కాలకృత్యాలు తీర్చుకోవాలంటే ఎక్కడికెళ్లాలి.. ఎవరింటికెళ్లలేని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

                జీవో ను సవరించాలని.. అందరికీ సమన్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ.. బహుజన టీచర్స్ ఫెడరేషన్ (BTF) వ్యవస్థాపక అధ్యక్షులు కె. సతీష్ కుమార్, డి. రవికుమార్ ల ఆధ్వర్యంలో టీచర్లు ఆందోళన ప్రారంభించారు. భోజన విరామ సమయంలో స్కూల్ ఆవరణలో ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన నినాదాలు చేశారు. తమ నిరసన ఫోటోలు.. వీడియోలను వాట్సప్.. ఈమెయిల్ ల ద్వారా విద్యాశాఖ ఉన్నతాధికారులకు పంపారు. బీటీఎఫ్ నిరసనల గురించి తెలుసుకున్న అనేక మంది తమ వంతు అసంతృప్తిని వ్యక్తం చేస్తూ.. జీవోను సవరించాలని కోరుతూ ఉన్నతాధికారులను కోరుతూ లేఖలు పంపడంలో తలమునకలయ్యారు.

            కొందరికి విధుల హాజరు మినహాయింపు ఇవ్వడం.. మరికొందరిని పాఠశాలకు వెళ్లాలని ఆదేశించడం వివక్షత క్రిందకు వస్తుంది.. ఇస్తే అందరికి మినహాయింపు ఇవ్వాలి లేని పక్షంలో అందరూ పాఠశాల విధులకు హాజరయ్యేలా ఉత్తర్వులు సవరించాలని ఉపాధ్యాయ సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. నాడు- నేడు పనులు జరుగుచున్న పాఠశాలల్లో హెచ్.ఎం లు సమర్ధవంతంగా పనిచేస్తున్నారని..  వారి శ్రమను గుర్తించి ఆర్జిత సెలవులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని మరికొందరు డిమాండ్ చేస్తున్నారు. అందరికీ మార్గదర్శకంగా ఉండాల్సిన ఉపాధ్యాయుల్లో విభేదాలు సృష్టించేలా ఉన్న జీవోను వెంటనే సవరించాల్సిన అవసరం ఉంది..  ప్రభుత్వం ఇప్పటికైనా పరిస్థితి గుర్తించి జీవోను సవరించాలని వారు కోరుతున్నారు.

 

 

Latest Updates