పౌరసత్వబిల్లు పై విపక్షాలు గందరగోళం సృష్టిస్తున్నాయి

నిరసనల మధ్యే ప్రధాని నరేంద్ర మోడీ అస్సాం పర్యటన జరిగింది. విపక్షపార్టీలపై ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. పార్లమెంటులో గత కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉన్నవివాదాస్పద అస్సాం సిటిజెన్‌షిప్ బిల్లుపై విపక్షాలు ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఈ బిల్లు తీసుకురావడం వెనక ఉన్న ఉద్దేశం ఏమిటో ముందుగా తెలుసుకోవాలని ఆయన సూచించారు. ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న పార్టీలన్నీ ఎంత గొప్ప పార్టీలో తెలుసన్నారు. భారత్‌లోకి చొరబడి దేశ వనరులను దోచుకునేవారికి, ఇతర దేశాల్లో మతపరమైన హింసలు ఎదుర్కొంటూ దేశంలో తలదాచుకునేందుకు వస్తున్నవారు ఎవరో ముందుగా తెలుసుకోవాలన్నారు ప్రధాని. వారిని అక్కున చేర్చుకోవాల్సిన బాధ్యత భారత్‌పై ఉందన్నారు. అన్ని విచారణలు పూర్తైన తర్వాతే పౌరునిగా గుర్తింపుపొందుతారని అదే బిల్లులో పొందుపర్చినట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం సూచనలు తీసుకోకుండా కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోబోదని ఆయన స్పష్టం చేశారు. ఇది ఒక్క అస్సాం రాష్ట్ర సమస్య కాదని యావత్ దేశం సమస్య అని చెప్పారు.

అస్సాం కు చెందిన బహుముఖ ప్రజ్ఞాశాలి భూపేన్ హజారికాకు రావాల్సిన భారతరత్నను విపక్షాలు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు విస్మరించాయో చెప్పాలన్నారు మోడీ. ఈ అంశాన్ని ప్రజలకే వదిలేస్తున్నామని చెప్పిన ఆయన… అస్సాం రత్నాన్ని భారతరత్నతో ఏ ప్రభుత్వం గౌరవించిందో ఒక్కసారి ఆలోచించాల్సిందిగా కోరారు. అంతేకాదు తాను అవినీతిపై పోరాడుతున్నందున విపక్షాలు ఏకమై తనను టార్గెట్ చేశాయాని తెలిపారు. దేశాన్ని దోచుకుని భారత్ విడిచి పారిపోయినవారిని తిరిగి రప్పిస్తున్నామని మోడీ సభలో చెప్పారు. ఇక మధ్యంతర బడ్జెట్‌లో దాదాపు 21శాతం అధిక నిధులు ఈశాన్య రాష్ట్రాలకు కేటాయించామని చెప్పారు.

Latest Updates