మీరు చేపట్టే కార్యక్రమాల్లో పాలుపంచుకునేందుకు మా కార్యకర్తలు రెడీ

కరోనా వ్యాప్తిని కంట్రోల్ చేసేందుకు సీఎం కేసీఆర్ గట్టి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంబయ్. బీజేపీ రాష్ట్రశాఖ తరుపున ప్రత్యేకంగా తెలంగాణ ప్రభుత్వం తరపున, ముఖ్యమంత్రి కేసీఆర్ కు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం సీఎం కేసీఆర్ కు లెటర్ రాశారు బండి సంజయ్.

లెటర్ లో ఇలా .. “ప్రధాన మంత్రి  నరేంద్ర మోడీ పిలుపు మేరకు, గత ఆదివారం భారతీయులందరూ సమిష్టిగా జనతా కర్ఫ్యూ పాటించి, ఎటువంటి విపత్తు నైన ఎదుర్కొనే సత్తా ఉందని నిరూపించారు. తెలంగాణ ప్రభుత్వం తరపున, ముఖ్యమంత్రిగా మీరు, కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి తీసుకుంటున్న చర్యలను, భారతీయ జనతా పార్టీ, రాష్ట్ర శాఖ తరపున ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అలాగే తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా కరోనా రూపంలో విపత్కర పరిస్థితులు తలెత్తుతున్న సందర్భంలో, ఈ ప్రమాదకర వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకునే చర్యలకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా మా సంపూర్ణ మద్దతు ఉంటుందని స్పష్టం చేస్తున్నాను.

సోమవారం నుండి, రాష్ట్రం లో లాక్ డౌన్ పరిస్థితుల దృష్ట్యా, కొంత మంది ఈ విపత్తును అవకాశంగా తీసుకొని స్వలాభం కోసం స్వార్ధంతో నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలను ఒక్కసారిగా పెంచేశారు. ఫలితంగా సామాన్య, పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ విషయంలో మీరు ప్రత్యేక శ్రద్ద తీసుకొని, ధరల నియంత్రణ చేపట్టగలరు. కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా, దేశం లోని వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న, తెలంగాణ ప్రజల సౌలభ్యం కోసం, ఆయుష్మాన్ భారత్ పథకంలో తెలంగాణ రాష్ట్రం భాగస్వామ్యం అయ్యేట్లు ఆలోచన చేయగలరు.

మా పార్టీకి తెలంగాణ లో క్రమశిక్షణ కలిగిన క్షేత్రస్థాయి కార్యకర్తలు లక్షల సంఖ్యలో ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా వేలసంఖ్యలో ప్రజల ప్రాణాలు హరిస్తున్న కరోనాపై పోరాటానికి మీరు చేపట్టే కార్యక్రమాల్లో స్వచ్ఛందంగా పాల్గొనేందుకు వీరంతా సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నాను. ప్రజా సంక్షేమం కోసం భారతీయ జనతా పార్టీ, ప్రభుత్వానికి పూర్తి సహాయ, సహాకారాలు అందిస్తుందని మరొక సారి స్పష్టం చేస్తున్నాను”.

Latest Updates