ఉద్యోగాల కోసం గొంతెత్తండి.. కాంగ్రెస్ ఆన్‌లైన్ క్యాంపెయినింగ్

న్యూఢిల్లీ: కరో్నా మహమ్మారితో ఏర్పడిన విషమ పరిస్థితులను ఎదుర్కోవడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. కేంద్రంపై దాడిని తీవ్రం చేయడంలో భాగంగా గురువారం ఆన్ లైన్ క్యాంపెయిన్ ను కాంగ్రెస్ ప్రారంభించింది. నిరుద్యోగికత ముఖ్య అంశంగా ఈ ఆన్ లైన్ క్యాంపెయినింగ్ ను ముందుకు తీసుకెళ్తోంది. మహమ్మారిని సర్కార్ సరిగ్గా హ్యాండిల్ చేయకపోవడంతో నిరుద్యోగం తీవ్రంగా పెరిగిపోయిందని హస్తం పార్టీ దుయ్యబట్టింది. ఈ క్యాంపెనింగ్ గురించి పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ, జనరల్ సెక్రెటరీ ప్రియాంక గాంధీ వాద్రా తమ ట్విట్టర్ హ్యాండిల్స్ లో షేర్ చేశారు. దేశ భవిష్యత్, ఉద్యోగాల కోసం ఎలుగెత్తండి అంటూ స్పీక్ అప్ ఫర్ జాబ్స్ అనే హ్యాష్ ట్యాగ్ తో ట్వీట్ చేశారు. ‘ప్రధాని మోడీ విధానాలతో కోట్లాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. అలాగే జీడీపీ చారిత్రాత్మక స్థాయిలో ఎన్నడూ లేనంతగా దిగువకు పడిపోయింది. దేశ భవిత అయిన యువతను ఇది చిదిమేసింది. ప్రభుత్వం యువత మాట వినేలా చేద్దాం’ అని ఈ ట్వీట్ కు రాహుల్ క్యాప్షన్ జత చేశారు.

‘లాక్ డౌన్, అన్ లాక్ తో సంబంధం లేకుండా ప్రతిరోజు లక్షలాది మంది భారతీయులు జాబ్స్ కోల్పోతున్నారు. దీన్నంతటినీ బీజేపీ నిశ్శబ్దంగా చూస్తోందంతే. దేశం మాత్రం సైలెంట్ గా ఉండబోదు. ఉద్యోగాల కోసం దేశం గొంతెత్తబోతోంది’ అని కాంగ్రెస్ పార్టీ తన అధికార ట్విట్టర్ హ్యాండిల్ లో ట్వీట్ చేసింది. ఒక్క ఆగస్టు నెలలోనే కార్మికుల్లో దాదాపు 40 లక్షల మంది నిరుద్యోగులయ్యారని కాంగ్రెస్ పేర్కొంది.

Latest Updates