ఏపీలో కాంగ్రెస్ బస్సుయాత్ర: హాజరుకానున్న రాహుల్, ప్రియాంక

తెలంగాణలో ప్రజాకూటమిగా టీడీపీతో జట్టుకట్టి దెబ్బతిన్న కాంగ్రెస్… ఆంధ్రప్రదేశ్‌లో ఒంటరిగా ఎన్నికల బరిలో దిగుతోంది. కాంగ్రెస్‌తో పొత్తు ఉండదని ఇటీవల టీడీపీ ప్రకటించడంతో ఢిల్లీ కాంగ్రెస్ హై కమాండ్ కూడా… ఏపీలో టీడీపీతో పొత్తు ఉండదని తేల్చేసింది. దీంతో ఏ.పీలో ఒంటరి పోరుకు దిగుతోంది కాంగ్రెస్… ప్రత్యేకహోదా భరోసా ప్రజా యాత్ర పేరుతో రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్రను మంగళవారం ప్రారంభించబోతోంది. మొత్తం 13 రోజులపాటు 13 జిల్లాల్లో జరిపే ఈ యాత్ర అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గం నుంచి మొదలు కానుంది. ఈ సందర్భంగా మొత్తం 54 సభలు నిర్వహించాలని ఏపీ పీసీసీ నిర్ణయించింది.

ఏ.పి కాంగ్రెస్‌.. రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుండి ‘ప్రత్యేకహోదా భరోసా ప్రజా యాత్ర’ పేరుతో బస్సు యాత్ర నిర్వహించనుంది. మొత్తం 13 రోజులపాటు 13 జిల్లాల్లో నిర్వహించనున్న ఈ యాత్ర అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గం నుంచి మొదలు కానుంది. మార్చి 3న ఇచ్ఛాపురంలో ముగుస్తుంది.

ఈ యాత్రలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీతో పాటు వివిధ రాష్ట్రాల కాంగ్రెస్‌ ముఖ్యమంత్రులు, పార్టీ సీనియర్‌ నేతలు రోజుకొకరు చొప్పున యాత్రలో పాల్గొంటారు. రాహుల్‌ పర్యటన ఇంకా ఖరారు కాలేదు. ఈ నెల 26న లేదా 27న వచ్చే అవకాశముందని ఏపీ పీసీసీ వర్గాలు తెలిపాయి. ప్రియాంక పర్యటనపై స్పష్టత రావాల్సి ఉంది. ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ యాత్రలో పాల్గొంటారు.

అంతా బాగానే ఉన్నా… రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు ఓ తలనొప్పి అలాగే ఉంది. ఏంటంటే… జాతీయ రాజకీయాల్లో టీడీపీ, కాంగ్రెస్ జట్టుకట్టి ముందుకెళ్తున్నాయి. రాష్ట్రంలో మాత్రం అదే టీడీపీని కాంగ్రెస్ టార్గెట్ చెయ్యాల్సి ఉంది. ఇక్కడే రాష్ట్ర నేతలు తలలు పట్టుకుంటున్నారు. టీడీపీని విమర్శించటం ఎలా అన్న ప్రశ్న తలెత్తుతోంది. రాష్ట్ర ప్రభుత్వం సరిగా పరిపాలించట్లేదనీ, అవినీతిలో కూరుకుపోయిందనీ ఇలా ఏ విమర్శ చెయ్యాలన్నా… ప్రజల నుంచీ వచ్చే ప్రశ్న ఒకటి కాంగ్రెస్‌ను కలవరపెడుతోంది. టీడీపీ పాలన బాలేనప్పుడు… అదే పార్టీతో రాహుల్ ఎందుకు జట్టు కడుతున్నారని ప్రజలు అడిగితే… కాంగ్రెస్ నేతలు ఏం సమాధానం చెప్పాలన్నది తేలాల్సిన అంశం. జాతీయ రాజకీయాలు వేరు, రాష్ట్ర రాజకీయాలు వేరు అని అంటే కుదరదు కదా. రెండు నాల్కల ధోరణి ఎప్పుడూ ప్రమాదమే. ఇలాంటి విషయాల్లో ఓటర్లు చాలా స్పష్టతతో ఉంటారు. అడ్డగోలుగా మాట్లాడే పార్టీలను తిప్పికొడతారు. అందుకే కాంగ్రెస్ నేతల్లో ఈ సంశయం వీడట్లేదు.

అసలే ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి బాలేదు. రాష్ట్ర విభజనతో ఆ పార్టీ భూస్థాపితం అయ్యింది. ఇప్పుడు రాహుల్ రాకతో… ఏదో కిందా మీదా పడుతోంది. ఎన్నికల్లో సీట్లు ఓట్లు సాధించాలంటే… ఆ పార్టీ టీడీపీని బలంగా టార్గెట్ చెయ్యాల్సిందే. అదే సమయంలో… తాము ఏం చేస్తామో చెప్పాల్సిందే. టీడీపీని టార్గెట్ చెయ్యడం ఎలా ఉన్నా… తాము అధికారంలోకి వస్తే… ఏపీకి ప్రత్యేక హోదా కల్పిస్తామని రాహుల్ మాట ఇచ్చారు. అదొక్కటే రాష్ట్ర కాంగ్రెస్‌కి ఊపిరి పోస్తున్న అంశం. దాన్ని అండగా చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు హస్తం నేతలు. మరి ప్రజలేం నిర్ణయిస్తారన్నది పోలింగ్ రోజున తేలుతుంది.

Latest Updates