కాంగ్రెస్ దేశం పరువు తీస్తోంది: నఖ్వీ

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ దేశానికి అపకీర్తి తెస్తోందని కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ విమర్శించారు. ఇండియా డీఎన్‌ఏలో సహనం కనుమరుగైందని శుక్రవారం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై నఖ్వీ మండిపడ్డారు. మన దేశ డీఎన్‌ఏలో సహనం, సామరస్యం ఉందన్న విషయాన్ని కాంగ్రెస్ గ్రహించట్లేదన్నారు. ప్రతిపక్ష పార్టీ ‘ఫ్యూడల్ ఫ్యామిలీ ఫొటో ఫ్రేమ్‌’లో స్థిరంగా ఉందని దుయ్యబట్టారు. అన్ని జీవులు హ్యాపీగా ఉండాలనేదే ఇండియా వారసత్వం, సాంస్కృతిక నిబద్ధత అని కాంగ్రెస్ నేతలు తెలుసుకోవాలని సూచించారు.

సహనం, సాంస్కృతిక వైరుధ్యంలో ఐక్యతే ఇంత పెద్ద దేశాన్ని ఏకం చేసిందని నఖ్వీ పేర్కొన్నారు. మహమ్మారి విరుచుకుపడుతున్న ఈ టైమ్‌లో ప్రతిపక్ష లీడర్స్ సమస్యల పరిష్కారంలో భాగం కావడానికి బదులు రాజకీయ కాలుష్యాన్ని సృష్టిస్తున్నారని దెప్పి పొడిచారు. ‘టెర్రరిస్టులను ఏరి వేసినప్పుడు కాంగ్రెస్ ప్రశ్నించింది. ఇది సర్జికల్ స్ట్రైక్స్‌పై విరుచుకు పడటమే. కరోనా మహమ్మారిపై గందరగోళాన్ని సృష్టించిన కాంగ్రెస్.. ఇప్పుడు దేశ అసహనంగా దీన్ని చిత్రీకరించడానికి కుట్ర పన్నుతోంద’ని నఖ్వీ ఆరోపించారు.

Latest Updates