కాంగ్రెస్​ చీఫ్  పదవిలో గాంధీ ఫ్యామిలీనే ఉండాలని రూలేమీ లేదు

కాంగ్రెస్​ అధ్యక్ష పదవిలో తాను ఉండలేనని రాహుల్​గాంధీ స్పష్టం చేశారు. లోక్​సభ ఎన్నికల్లో పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చేశారు. రాజీనామా పత్రాన్ని కాంగ్రెస్​ వర్కింగ్​ కమిటీ(సీడబ్ల్యూసీ)కి సమర్పించారు. దీన్ని కమిటీ ఏకగ్రీవంగా తిరస్కరించింది. రాహుల్​ నాయకత్వం పార్టీకి అవసరమని, ఆయనే పార్టీ చీఫ్​గా కొనసాగుతారని తేల్చిచెప్పింది. లోక్​సభ ఎన్నికల్లో కాంగ్రెస్​ ఓటమిపై సీడబ్ల్యూసీ శనివారం ఢిల్లీలోని పార్టీ హెడ్​క్వార్టర్స్​లో సమావేశమైంది. సుమారు 4 గంటల పాటు సాగిన ఈ సమావేశానికి రాహుల్​గాంధీతో పాటు యూపీఏ చైర్​పర్సన్​ సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్​సింగ్, పార్టీ జనరల్​ సెక్రటరీ ప్రియాంకా గాంధీ, సీనియర్​ నేతలు గులాం నబీ ఆజాద్​, మల్లికార్జున ఖర్గే, ఏకే ఆంటోనీ, పంజాబ్​ సీఎం అమరీందర్​సింగ్​ తదితరులు హాజరయ్యారు. ఓటమికి గల కారణాలను విశ్లేషించుకున్నారు. భవిష్యత్తు కార్యాచరణపై చర్చించుకున్నారు. కాంగ్రెస్​ ఓటమిని అంగీకరిస్తూ సమావేశంలో తీర్మానాన్ని ఆమోదించారు. కమిటీ సమావేశంలోనే రాహుల్​గాంధీ తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. పార్టీని విజయతీరాలకు చేర్చాలనుకున్నానని, ఇలాంటి పరిస్థితి వస్తుందనుకోలేదని ఆయన ఒకింత ఆవేదనకు గురైనట్లు తెలుస్తోంది. కాంగ్రెస్​ చీఫ్​గా ఏడాదిన్నర క్రితం బాధ్యతలు చేపట్టిన రాహుల్​ ఎదుర్కొన్న తొలి లోక్​సభ ఎన్నికలు ఇవే. ఈ ఏడాదిన్నరలో పార్టీలో నూతనోత్తేజం నింపారని, మున్ముందు కూడా తామందరినీ నడిపించాల్సిన బాధ్యత తమపైనే ఉందంటూ సీడబ్ల్యూసీ సమావేశంలో నేతలు విజ్ఞప్తి చేశారు. రాహుల్​ రాజీనామాను కమిటీ సభ్యులు ఏకగ్రీవంగా తిరస్కరించారు. అంతకు ముందు రాహుల్​గాంధీ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్​ అధ్యక్ష పదవిలో గాంధీ ఫ్యామిలీనే ఉండాలన్న నిబంధన ఏమీ లేదని అన్నారు. ప్రజల తరఫున తన పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉంటానని చెప్పారు. ‘‘కాంగ్రెస్​ పార్టీకి నిబద్ధత గల సోల్జర్​గా నా సేవలు అందిస్తా. ప్రజల తరఫున పోరాటం కొనసాగిస్తాను. కానీ.. పార్టీ చీఫ్​గా కొనసాగాలనుకోవడం లేదు. కాంగ్రెస్​ చీఫ్​ పదవిలో గాంధీ ఫ్యామిలీనే ఉండాలని ఏమీ లేదు. ఎవరైనా ఉండొచ్చు”అని అన్నారు. రాహుల్​ రాజీనామాను సీడబ్ల్యూసీ తిరస్కరించినప్పటికీ రాహుల్ వెనక్కి తగ్గనట్లు తెలుస్తోంది.

వారించిన తల్లి, చెల్లి..

కాంగ్రెస్​ చీఫ్​గా తప్పుకుంటున్నట్లు రాహుల్​ ప్రకటించడంపై సీడబ్ల్యూసీ సమావేశంలో చాలా సేపు నేతలు చర్చించినట్లు తెలుస్తోంది. ఎట్టిపరిస్థితుల్లోనూ పదవి నుంచి తప్పుకోవద్దని వారు కోరారు. అక్కడే ఉన్న రాహుల్​గాంధీ తల్లి సోనియాగాంధీ, చెల్లెలు ప్రియాంకాగాంధీ కూడా ఆయనను వారించినట్లు తెలుస్తోంది. నిర్ణయాన్ని మార్చుకొని, పార్టీ అధ్యక్షుడిగానే కొనసాగాలని కోరినట్లు సమాచారం.

రాహుల్​ తప్పుకుంటే?

రాహుల్​గాంధీ తన నిర్ణయాన్ని మార్చుకుంటారని కాంగ్రెస్​ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే.. ఆయన నిర్ణయాన్ని మార్చుకోకుంటే ఏమిటన్నది చర్చకు దారితీసింది. ఏడాదిన్నర క్రితం సోనియాగాంధీ నుంచి పార్టీ చీఫ్​ బాధ్యతలు చేపట్టిన రాహుల్​గాంధీ.. పార్టీలో నూతనోత్తేజం నింపారని, ఆయన నాయకత్వంలోనే ఆరునెలల క్రితం బీజేపీ పాలిత రాష్ట్రాలైన మధ్యప్రదేశ్​, రాజస్థాన్​, చత్తీస్​గఢ్​లో కాంగ్రెస్​ ప్రభుత్వాలను ఏర్పాటు చేయగలిగిందని ఓ నాయకుడు అన్నారు. లోక్​సభ ఎన్నికల్లో ఓటమికి పార్టీలోని అందరిదీ బాధ్యతేనని, దీనికి రాహుల్​ని ఒక్కరిని ఎవరూ వేలెత్తి చూపడం లేదని, ఆయన చాలా చక్కగా పనిచేశారని తెలిపారు. రాజీనామా నుంచి రాహుల్​ వెనక్కి తగ్గకపోతే ఆ బాధ్యతలు చేపట్టే నాయకుడు ఎవరూ పార్టీలో లేరని పేర్కొన్నారు. రాహుల్​ నాయకత్వంలోనే పార్టీకి పూర్వవైభవం దక్కుతుందని కాంగ్రెస్​ నేతలు అంటున్నారు. కాగా, సమావేశంలో పార్టీ చీఫ్ పోస్టుకు ప్రియాంకా గాంధీ పేరు ప్రతిపాదించగా, ఆమె నిరాకరించినట్లు తెలుస్తోంది.

ఔను రాజీనామా ఇచ్చారు.. తిరస్కరించాం..

కాంగ్రెస్​ అధ్యక్ష పదవికి రాహుల్​గాంధీ రాజీనామా సమర్పించింది నిజమేనని కాంగ్రెస్​ నేతలు అన్నారు. సీడబ్ల్యూసీ సమావేశం అనంతరం ఆ పార్టీ అధికార ప్రతినిధి రణ్​దీప్​ సుర్జేవాలా, సీనియర్​ నేతలు గులాం నబీ ఆజాద్​, ఏకే ఆంటోనీ మీడియాతో మాట్లాడారు. ‘‘ఓటమికి బాధ్యత వహిస్తూ రాహుల్‌‌ తన రాజీనామాను సీడబ్ల్యూసీకి అందజేశారు. దాన్ని కమిటీ సభ్యులు ఏకగ్రీవంగా తిరస్కరించారు. ఇక ముందు కూడా పార్టీ అధ్యక్షుడిగా ఆయనే కొనసాగుతారు” అని సుర్జేవాలా స్పష్టం చేశారు. పార్టీలో మార్పులు చేర్పులు చేసే పూర్తి అధికారం రాహుల్​కే అప్పగిస్తూ సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకుందని, ఆయన నాయకత్వంలోనే ముందుకు సాగాలని తీర్మానించిందని చెప్పారు. త్వరలో ఓ ప్రణాళికను రూపొందించుకొని పార్టీని బలోపేతం చేస్తామన్నారు. ఎన్నికల్లో అంచనాలను తాము రీచ్​ కాలేకపోయామని, మరింత పకడ్బందీగా ప్రణాళికను సిద్ధం చేసుకుంటామని ఏకే ఆంటోనీ చెప్పారు. ఎన్నో సవాళ్లు ఎదురైనా కాంగ్రెస్​ చీఫ్​గా రాహుల్​గాంధీ  పార్టీని ముందుకు నడిపించారని, ఆయన పనితీరు చాలా బాగుందని గులాం నబీ ఆజాద్​ అన్నారు.

Latest Updates