సీఎం కొడుకు.. సీఎం హోదాలో కేబినెట్ మీటింగ్ ఎట్లా పెడ‌తాడు?

బుధ‌వారం ముఖ్యమంత్రి అధికార నివాసమైన ప్రగతి భవన్‌లో.. కేటీఆర్ ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన‌ తెలంగాణ కేబినెట్ సమావేశంపై కాంగ్రెస్ శాసన సభా పక్ష నేత భట్టి విక్రమార్క విమ‌ర్శించారు. సీఎం అధికార నివాసంలో.. కేటీఆర్ ఏ హోదాలో, ఏ నిబంధల ప్రకారం కేబినెట్ భేటీ నిర్వాహించార‌ని ప్ర‌శ్నించారు. కేబినెట్ భేటీకి కూడా హాజరు కాలేని పరిస్థితుల్లో సీఎం కేసీఆర్ ఉన్నారా అంటూ.. గురువారం పత్రికా ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

ప‌త్రికా ప్ర‌క‌ట‌నలో..
ప్రగతి భవన్‌లో కేటీఆర్ ఆధ్వ‌ర్యంలో తెలంగాణ కేబినెట్ సమావేశం జరిగిందనే వార్తలు పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియాలో రావటం చూసి ప్రజలతో పాటు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ శాసన సభాపక్షం కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తోంది. కరోనా మహమ్మారితో తెలంగాణ రాష్ట్రం మొత్తం అల్లాడుతోండగా ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేసి.. ఫుడ్ ప్రాసెసింగ్, లాజస్టిక్ పాలసీ వంటి అంశాల మీద ముఖ్యమంత్రి కాని వ్యక్తి ముఖ్యమంత్రి హోదాలో సమీక్ష జరపటం దేశ చరిత్రలో ఇదే తొలిసారి అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది

అత్యవసర సమయాలు, ప్రక్రుతి వైపరీత్యాలు, యుద్ధాలు, శాంతి భద్రతల సమస్యలు వంటివి తలెత్తినప్పుడు, ముఖ్యమంత్రి అందుబాటులో లేక పోతే.. ఆయన డిజిగ్నేట్ చేసిన సీనియర్ మంత్రి గానీ, ఉప ముఖ్యమంత్రి కానీ రాజ్యాంగ బద్ధంగా కేబినెట్ సమావేశం నిర్వహిస్తుంటారు. కానీ.. ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేనప్పుడు..సీఎం తనయుడు కేటీఆర్ ఏ హోదాలో, ఏ నిబంధల ప్రకారం కేబినెట్ భేటీ నిర్వాహించారో తెలుసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. కనీసం కేబినెట్ భేటీకి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు కాలేని పరిస్థితుల్లో ఉన్నారా..? లేక ఆయన విదేశీ పర్యటనల్లో ఉన్నారా..? అనే విషయం మీద ప్రజల్లో చర్చ జరుగుతోంది. సీఎం అధికార నివాసమైన ప్రగతి భవన్‌లో.. రెగ్యులర్‌గా కేబినెట్ మీటింగ్స్ జరిగే హాలులో మున్సిపల్ మంత్రి కేటీఆర్.. సహచర మంత్రులు, చీఫ్ సెక్రటరీ, ప్రభుత్వ అడ్వైజర్ రాజీవ్ శర్మ, ప్లానింగ్ బోర్డ్ వైస్ ఛైర్మన్ తో సహా ఉన్నతాధికారులను పిలిపించి కేబినెట్ భేటీ పెట్టారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ లేకుండా కేబినెట్ మీటింగ్ పెట్టిన మున్సిపల్ మంత్రి కేటీఆర్ పాలనా పరమైన అనేక అనుమానాలకు తెర లేపారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేబినెట్ మీటింగ్ పెట్టలేని పరిస్థితుల్లో ఉన్నారా..? లేక ఆయన విదేశీ యాత్రల్లో ఉన్నారా..? అసలు ఆయన ఎక్కడ ఉన్నారు అనే ప్రశ్నలకు ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలని కోరుతున్నాం. అలాగే, కేబినెట్ మీటింగ్స్, ప్రభుత్వ పాలన అంటే కేసీఆర్ & కేటీఆర్ కుటుంబ వ్యవహారం కాదని.. ఇది కోట్లాది మంది ప్రజలకు సంబంధమైన విషయమని గుర్తు చేస్తున్నాం. ఒకవేళ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మీటింగ్ అయితే.. కేటీఆర్ తన ఛాంబర్‌లోనో లేక మరో ప్రాంతంలోనో పెట్టుకోవాలి. కానీ, ప్రగతి భవన్‌లో కేబినెట్ సమావేశం కోసం నిర్ధేశించిన హాలులో ఎలా పెడతారు..? దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్, మున్సిపల్ మంత్రి కేటీఆర్ సమాధానం చెప్పాలి. అలాగే ముఖ్యమంత్రి కేసీఆర్ కేబినెట్ భేటీకి రాకుండా ఎక్కడ ఉన్నారు..? ఎలా ఉన్నారు..? ఈ అంశాలపైన ముఖ్యమంత్రి స్పందించాల్సిన అవసరం ఉంది అని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

Latest Updates