ఏడేళ్ల పాల‌న‌లో విశ్వనగరం కాస్త విషాద నగరంగా తయారైంది

గాంధీ భవన్:  ఏడేళ్ల టీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ప్రజలు వరదల్లో కొట్టుకుపోయి.. ప్రాణాలు వదులుతున్నార‌ని కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్ అన్నారు. కేసీఆర్ పాల‌న‌లో విశ్వనగరం కాస్త విషాద నగరంగా తయారైందని అన్నారు. గురువారం గాంధీభ‌వ‌న్ లో నిర్వ‌హించిన స‌మావేశంలో మాట్లాడుతూ.. వాతావరణ శాఖ ప్రభుత్వానికి హెచ్చరికలు చేసినా పట్టించుకోకుండా ప్ర‌భుత్వం ప్రజలను ఇబ్బందులు పెడుతోంద‌న్నారు. భారీ వర్షాల వల్ల చనిపోయిన వారి సంఖ్య విష‌యంలో ప్ర‌భుత్వం తప్పుడు లెక్కలు చూపిస్తుంద‌ని, కేవ‌లం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే వంద మంది వర్షానికి మరణించినట్లు త‌మ‌కు నిర్దిష్టమైన సమాచారం ఉంద‌న్నారు.

రోమ్ నగరం తగలబడుతుంటే చక్రవర్తి ఫిడేల్ వాయిస్తున్నట్లు సీఎం కేసీఆర్ వ్యవహరిస్తున్నారన్నారు శ్ర‌వ‌ణ్. పక్క రాష్ట్ర సీఎం జగన్మోహన్ రెడ్డి వర్షాలపై రివ్యూ చేస్తుంటే.. సీఎం కేసీఆర్ చెట్ల మీద రివ్యూ చేస్తున్నారన్నారు. భారీ వ‌ర్షాల‌కు ప్ర‌జ‌లంతా ఇబ్బందులు ప‌డుతుంటే.. కేటీఆర్- అండ్ కౌరవ టీమ్ ప్రజలకు ఎందుకు అందుబాటులో లేరని శ్ర‌వ‌ణ్   ప్ర‌శ్నించారు. ‘కార్పొరేటర్ల‌కి వరదల్లో చిక్కుకున్న ప్ర‌జ‌లు కనిపించడం లేదా? వారికి కనీసం తినేందుకు ఆహారం ఇచ్చే పరిస్థితిలో కూడా లేరా?’ అని అడిగారు. టీఆరెస్ నేతలు, కార్పొరేటర్లు కేవ‌లం ప్రచారం, ఆర్భాటాలకు, కబ్జాలకు మాత్రమే పరిమితమ‌య్యారని విమ‌ర్శించారు.

Latest Updates