సాగర్‌లో పోటీ చేసేది నేనే.. నా కొడుకు కాదు

సాగర్ ​బైపోల్​ బరిలో తానే ఉంటానని జానా సంకేతాలు

తనకే విజయావకాశాలు ఉన్నాయని ధీమా

2018లో ఓడిపోయినప్పటి నుంచి సెగ్మెంట్​లోనే మకాం

నల్గొండ, వెలుగు: త్వరలో జరగనున్న నాగార్జునసాగర్​ ఉప ఎన్నికల్లో తానే పోటీలో ఉంటానని కాంగ్రెస్​ సీనియర్​నేత, మాజీ మంత్రి జానారెడ్డి ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. ఆయన తప్పుకొని కొడుకు రఘువీరారెడ్డికి చాన్స్​ఇస్తారని భావించినప్పటికీ ఈసారికి ఎలాగైనా తానే  నిలబడి గెలవాలనే ఉత్సాహంతో ముందుకుపోతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మృతితో ఇక్కడ బైపోల్స్​జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఇటీవల టీఆర్ఎస్​చేసిన సర్వేలో జానారెడ్డికే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తేలిందంటూ ఇచ్చిన లీకులు స్టేట్​పాలిటిక్స్​లో హాట్​టాపిక్​అయ్యాయి. నాగార్జున సాగర్ నుంచి ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది, పలు శాఖలకు మంత్రిగా చేసిన జానారెడ్డి 2018 ఎన్నికల్లో అనూహ్యంగా ఓడిపోయారు. కానీ అప్పటి నుంచి నియోజకవర్గాన్నే అంటిపెట్టుకుని ఉన్నారు.

రికార్డులతో పాటే ఓటమి

అధికారం ఉన్నా లేకపోయినా ఎప్పుడూ మందీమార్బలంతో నియోజకవర్గాన్ని చుట్టిరావడం జానారెడ్డి స్టైల్. రాష్ట్రంలో ఏడుసార్లు ఎమ్మెల్యే గా గెలిచిన రికార్డు ఉన్నప్పటికీ పలు సందర్భాల్లో ఆయనకు ఓటమి తప్పలేదు. 1999లో జరిగిన ఎన్నికల్లో తాను చేసిన అభివృద్ధి పనులే తనను గెలిపిస్తాయని, ఇంటి నుంచి కాలు బయటపెట్టకుండా గెలుస్తానని చెప్పిన జానారెడ్డి ఎన్నికల ప్రచారమే చేయలేదు. దీనిని పబ్లిక్ నెగెటివ్​గా తీసుకోవడంతో ఆయన ఓడిపోయారు. అంతకుముందు 1978లో జనతా పార్టీ నుంచి  పోటీ చేసి  ఓటమిపాలయ్యారు. మూడోసారి 2018 ఎలక్షన్స్​లో జానారెడ్డి విజయయాత్రకు బ్రేక్​పడింది.  ఎన్టీఆర్, వైఎస్సార్, కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్లలో జానారెడ్డి సుదీర్ఘకాలం మంత్రిగా రికార్డు సాధించారు.

జానా స్టైల్​ ప్రచారం

ఒకప్పుడు నియోజకవర్గంలో జానా కోటరీలో పనిచేసిన సీనియర్ లీడర్లంతా ఇప్పుడు టీఆర్ఎస్​లో ఉన్నారు. ఇప్పుడున్న అంచనా మేరకు ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు జరిగితే జానారెడ్డికే గెలుపు అవకాశాలు మెండుగా ఉన్నాయని సర్వే రిపోర్టులు చెప్తున్నాయి. అధికార పార్టీలో నెలకొన్న గ్రూపు తగాదాలే జానారెడ్డికి ప్లస్​పాయింట్​గా మారుతున్నాయని పొలిటికల్ అనలిస్టులు చెబుతున్నప్పటికీ జానా మాత్రం తనదైన శైలిలో ప్రచారానికి గ్రౌండ్​ ప్రిపేర్​ చేసుకుంటున్నారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో, తండాలో సింగిల్​గా తిరుగుతున్నారు. పెళ్లిళ్లు, చావులు వంటి రకరకాల కార్యక్రమాలకు అటెండ్ అవుతున్నారు. పాతతరం లీడర్లను టచ్​లోకి  తీసుకుంటున్నారు. ఎలక్షన్​ నోటిఫికేషన్ వచ్చేనాటికి ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నా తనకు తిరుగులేకుండా ఉండేలా జాగ్రత్త పడుతున్నారు.

‘జానా’కు బైపోల్ పరీక్షే

బైపోల్స్​నేపథ్యంలో జానారెడ్డి పార్టీ మారుతారని, తాను తప్పుకొని కొడుకును బరిలో దింపుతారనే వార్తలు వచ్చాయి. కానీ ఊహాగానాలకు తెరిదించిన జానా రెడ్డి ‘సీఎం కావాల్సిన నేను పార్టీ ఎలా మారుతాను?’ అని ఎదురు ప్రశ్న వేశారు. దీంతో బైపోల్​లో నిలబడేది తానేనని జానా క్లారిటీ ఇచ్చారు. కాగా, చివరిసారి మరో అవకాశాన్ని వినియోగించుకుంటున్న జానారెడ్డికి ఈ బైపోల్ నిజంగానే ఒక పరీక్ష లాంటిదని ఆయన వర్గీయులు చెబుతున్నారు. సాగర్​లో జానారెడ్డి ప్రాభవం మళ్లీ  కొనసాగాలన్నా, భవిష్యత్​లో తన కుమారుడి పొలిటికల్​లైఫ్​కు మార్గం వేయాలన్నా ఆయన ఎన్నికల్లో నెగ్గక తప్పదని అంటున్నారు.

For More News..

యూరియా అడ్డగోలుగా చల్లుతున్నరు.. దేశంలో 51 కిలోలు వాడితే.. రాష్ట్రంలో మాత్రం 185 కిలోలు

పీసీసీ చీఫ్​ ప్రకటనపై సాగర్‌‌ బై ఎలక్షన్​ దాకా ఆగుదం

నిలోఫర్‌‌‌‌లో మందుల్లేవ్.. చిన్నారులకు ట్రీట్​మెంట్ లేదు

Latest Updates