ఐదెకరాల భూమి వద్దనడానికి మీరెవరు?: ఒవైసీపై కాంగ్రెస్ ఫైర్

ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీపై కాంగ్రెస్ ఫైర్ అయింది. అయోధ్య తీర్పుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఐదెకరాల భూమి దానధర్మంగా అక్కర్లేదంటూ వ్యాఖ్యానించడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. దేశంలోని 20 కోట్ల మంది ముస్లింలకు ఆయనేమైనా గుత్తేదార్ అనుకుంటున్నారా? అంటూ మండిపడింది.

అయోధ్య వివాదాస్పద భూమిని రామ మందిరానికి కేటాయించి, మసీదు నిర్మాణానికి మరో చోట ఐదెకరాల స్థలం ఇవ్వాలని సుప్రీం తీర్పునిచ్చింది.

ఈ తీర్పుపై ఒవైసీ మాట్లాడుతూ సుప్రీం కోర్టు అత్యున్నతమైనదే కానీ అమోఘమైనది కాదన్నారు. తమకు రావాల్సిన చట్టబద్ధమైన హక్కు కోసం తాము పోరాడుతున్నామని, తమపై దయతో ఐదెకరాల భూమి దానంగా ఇవ్వక్కర్లేదని అన్నారు. కాంగ్రెస్‌పై తీవ్రంగా విమర్శలు చేశారు. ఆ పార్టీ అసలు రంగు బయటపడిందంటూ.. అది పూర్తిగా నాశనమైపోవాలని అన్నారు.

ఒవైసీ మాట్లాడిన తీరుపై కాంగ్రెస్ నేత సల్మాన్ నిజామీ స్పందించారు. సుప్రీం తీర్పుపై ఎవరూ బాధపడాల్సిన అవసరం లేదని అన్నారు. అయోధ్యలో మసీదు నిర్మాణం జరుగుతుందని, ఇక్కడే హిందూ, ముస్లింలు అన్నదమ్ముల్లా కలిసుంటారని చెప్పారు. పాజిటివ్ ఎనర్జీ, మంచి ఆలోచనలతోనే విద్వేషం, దుష్టశక్తులపై విజయం సాధించవచ్చని అన్నారు నిజామీ. అయోధ్యలో మసీదు నిర్మాణానికి సుప్రీం ఇస్తామన్న ఐదెకరాల భూమిని వద్దని చెప్పడానికి ఒవైసీ ఎవరంటూ ప్రశ్నించారు. దేశంలో 20 కోట్లకు పైగా ఉన్న ముస్లింలకు ఆయనేమైనా థాకేదార్ అనుకుంటున్నారా? అని ప్రశ్నించారు.

Latest Updates