స‌మయం ఆస‌న్న‌మైంది.. హామీలు నెర‌వేర్చుకోడానికి యుద్ధానికి సిద్ధం కావాలి

పోరాడితే పోయేది బానిస సంకెళ్లేన‌ని అన్నారు మాజీ ఎమ్మెల్యే, AICC కార్యదర్శి సంపత్ కుమార్. రాష్ట్రంలో ఖరీఫ్ లో మొక్కజొన్న సాగు చేయకండి, డిమాండ్ లేద‌ని చెప్పిన సీఎం కేసీఆర్ కు వ్య‌తిరేకంగా.. రైతులు, ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పోరాటాలు చేస్తేనే తెలంగాణ ప్ర‌భుత్వం కొనడానికి సిద్ధమైంద‌ని అన్నారు. రాష్ట్రంలో పంటలు పండించే విషయంలో రైతులకు పూర్తిగా అవ‌గాహ‌న ఉందని.. ఏ పొలాల్లో ఏ పంటలు పండుతాయో వ్యవసాయ అధికారుల కన్నా.. రైతులకు అనుభవం ఉన్నదని అన్నారు.

నియంత్రణ సాగు మంచిది కాద‌ని రైతులు నిరూపించార‌ని, అలాగే నిరుద్యోగ యువత పోరాడితే తప్ప ఉద్యోగాలు రావ‌ని యువ‌త‌కు పిలుపునిచ్చారు. తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగం వస్తది అని చెప్పిన కేసీఆర్ .. ఉద్యమ సెగ తగలక పోతే ఉద్యోగాలు ఇచ్చే స్థితిలో లేరని, కనుక రైతుల లాగా పోరాటాలు చెయ్యాలని అన్నారు.

దళితులకు 3 ఎకరాల పొలం రావాలన్నా.. రెండు పడకల గదులు రావాలన్నా.. TRS ప్రభుత్వం పై పోరాడాల్సిన సమయం అసన్న మైందని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ లు ఏకమై మనకు కావలసిన హక్కుల కోసం అందరమూ కలసి పోరాటం చేయక పోతే మనకు ఇచ్చిన‌ హామీలను తుంగలో తొక్కి అణిచివేత ధోరణిలో కేసీఆర్ ముఖ్యమంత్రి వున్నార‌న్నారు. అన్ని వర్గాలు మేల్కొని ఉద్యమాలతో తెలంగాణా ఏవిధంగా సాధించుకున్నామో, అలాగే ఇచ్చిన‌ హామీలను నెరవేర్చు కోవడానికి TRS ప్రభుత్వంపై యుద్దానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

Latest Updates