సీఎం కేసీఆర్ మాటమీద నిలబడతారా? ఓవైసీని అరెస్ట్ చేస్తారా?

ప్రధాని గురించి తప్పుగా మాట్లాడితే కఠినచర్యలుంటాయన్న సీఎం కేసీఆర్.. ఇప్పుడు ప్రధాని గురించి అవహేళనగా మాట్లాడిన ఓవైసీని ఏం చేస్తారని కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, సినీనటి విజయశాంతి ప్రశ్నించారు. కరోనా వ్యాపిస్తున్న నేపథ్యంలో దానిని అరికట్టేందుకు భారత ప్రధాని మార్చి 22న జనతా కర్ఫ్యూ విధించారు. ఆ తర్వాత ప్రజల ఆరోగ్య భద్రత దృష్ట్యా ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ విధించారు. ఆ తర్వాత ప్రధాని మోడీ ఏప్రిల్ 5వ తేదీ రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు ఇంట్లోని లైట్లన్నీ ఆఫ్ చేసి కరోనాను జయించడానికి మద్ధతు పలకాలని ప్రజలను కోరారు. ఆ పిలుపుపై ఎమ్ఐఎమ్ అధినేత అసదుద్దీన్ వ్యంగంగా మాట్లాడారు. అయితే గతంలో ప్రధానిని ఎవరైనా అవహేళన చేసి మాట్లాడితే కఠిన శిక్షలుంటాయని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. మరి ఇప్పుడు ప్రధానిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఓవైసీపై సీఎం కేసీఆర్ చర్యలు తీసుకుంటారా లేదా అని కాంగ్రెస్ పార్టీ నాయకురాలు విజయశాంతి ప్రశ్నించారు. జమాతేకు వెళ్లి వచ్చిన వ్యక్తులు ప్రభుత్వానికి సహకరించాలని ఆమె కోరారు. విజయశాంతి తన ట్విట్టర్ లో పెట్టిన పోస్ట్ మీకోసం యధావిధిగా..

‘కరోనా మహమ్మారిపై కులమతాలకు అతీతంగా ప్రజారోగ్య దృష్టిలోనే తొలి నుండి నా స్పందనను తెలియజేస్తున్నాను. కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా ప్రాణాలొడ్డి పనిచేస్తున్న వైద్య సిబ్బందిపై దాడులను ఖండించడంతో పాటు..ఇంకా అందుబాటులోకి రాని జమాతే వ్యక్తులను తక్షణమే ప్రభుత్వానికి సహకరించాలని సూచించాను.

దీనిపై ఎంఐఎం పార్టీ తరపున పిలుపు ఇస్తారని తెలుగు రాష్ట్రాల ప్రజలు ఊహించారు. అయితే ఈ విషయం గురించి ఆ పార్టీ ఆలోచించలేదు. కానీ దీపాన్ని ఆరాధించే దేశంలోని అత్యధిక ప్రజల మనోభావాలకు సంబంధించిన దీప ప్రజ్వలన కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా సమర్థించిన నేపథ్యంలో… ఇందుకు సంబంధించి ప్రధాని ఇచ్చిన పిలుపును ఎంఐఎం అధినేత ఓవైసీ గారు అవహేళన చేస్తూ ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టారు. గతంలో సీఎంగారు ప్రెస్ మీట్‌లో మాట్లాడుతూ ప్రధాని పిలుపును సోషల్ మీడియాలో అవహేళన చేసిన వారిపై చర్య తీసుకోమని డీజీపీ గారిని ఆదేశించారు.

నాడు చెప్పిన విధంగా ఇప్పుడు ఓవైసీ గారిపై ప్రధానిని అవహేళన చేసినందుకు చర్యలు ఉంటాయా? లేక సామాన్యుడికి ఒక న్యాయం అసదుద్దీన్ గారికి ఒక న్యాయం అన్న చందంగా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తుందా? అనే విషయంపై తెలంగాణ సీఎం గారు స్పష్టత ఇవ్వాలి అని ఇక్కడి ప్రజలు కోరుకుంటున్నారు’ అని పోస్టు పెట్టారు.

For More News..

జూలోని పులికి కూడా కరోనా వైరస్

పారిశుధ్య కార్మికుల కాళ్లు కడిగిన ఏపీ ఎమ్మెల్యే

రాష్ట్రంలో 334కు చేరిన కరోనా కేసులు

Latest Updates