మేము ఓడిపోవడం మంచిదైంది: జగ్గారెడ్డి

మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ గెలవడం పెద్ద గొప్పేం కాదని  అన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సంగారెడ్డిలో మేము ఓడిపోవడం మంచిదైందని, ఒక వేళ గెలిచి ఉంటే మేము మున్సిపల్‌ చైర్మన్‌గా ఏ పనీ చేయలేకపోయేవాళ్లమని ఆ‍యన అన్నారు. అధికారంలో ఉన్న పార్టీకి అంగబలం, అర్థబలం అన్నీ ఉంటాయని, అయినప్పటికీ కాంగ్రెస్ వారికి గట్టి పోటీని ఇచ్చిందని తెలిపారు

తమ పార్టీ వర్గాల వద్ద డబ్బులేదని, అందుకే తాము ఓటర్లను లోబరచుకోలేదని, కాబట్టే తాము ఓడిపోయామని తెలిపారు.అధికార పార్టీపై పోరాడామని, గెలిచినా, ఓడినా ఎప్పుడూ కాంగ్రెస్ ఎప్పుడూ హీరోనే అన్నారు. ఓడినంత మాత్రాన తమ పార్టీ పట్ల ప్రజాదరణ లేదనుకోవడం పొరపాటే అని అన్నారు. ఎన్నికల బరిలో కాంగ్రెస్‌ కౌన్సిలర్‌ అభ్యర్థులు 5, 10 ఓట్ల తేడాతో మాత్రమే ఓడిపోయారని, ఇతర పార్టీలకు గట్టి పోటీ ఇచ్చామన్నారు జగ్గారెడ్డి.

ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలు కేసీఆర్‌ వైపే ఎందుకు నిలబడుతున్నారనేది కాంగ్రెస్‌ అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నికల్లో ప్రజల్ని కేసీఆర్ ఏ విధంగా మభ్యపెట్టాడో ఆ విషయాలను చూసి నేర్చుకుంటున్నానని అన్నారు. కాంగ్రెస్ కు కంచుకోటగా ఉన్న సంగారెడ్డిలో కూడా టీఆర్ఎస్ జెండా ఎగరేసారని, దానికి మంత్రి హరీష్ రావు ఎంతో కృషి చేసాడని అన్నారు. ఇక ఇదే నేపథ‌్యంలో కాంగ్రెస్‌ పార్టీకి ఓట్లేసిన ప్రజలందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

congress-mla-jaggara-reddy-media-conference-on-municipal-election-results

Latest Updates