సంగారెడ్డిలో మినీ యూనివర్శిటీ ఏర్పాటు చేయాలి: జగ్గారెడ్డి

congress-mla-jaggareddy-comments-sangareddi-tara-degree-college

సంగారెడ్డిలో తారా డిగ్రీ కళాశాల అంటే ఒక బ్రాండ్.. ఇక్కడ అడ్మిషన్ల కోసం ఎప్పుడూ పోటీ ఉంటుందని అన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. ఈ రోజు సంగారెడ్డిలో పర్యటించిన ఆయన స్థానిక  తారా డిగ్రీ కాలేజీలో మాట్లాడుతూ.. సంగారెడ్డి 40 ఏళ్ల క్రితమే విద్యా పరంగా అభివృద్ధి చెందిందన్నారు. 2004లో తాను ఎమ్మెల్యేగా గెలిచాక ఈ కాలేజీలో పీజీ సెంటర్ కావాలని అడిగితే.. రెండు కోర్సులతో తెచ్చానని అన్నారు.

ప్రస్తుతం 11 కోర్సులున్న ఈ కళాశాలలో ఎక్కువగా అమ్మాయిలే చదువుతున్నారన్నారు. గతంలో కళాశాలను ఎత్తివేస్తామంటే ఉద్యమాలు చేశామని గుర్తు చేశారు. పీజీ సెంటర్ ఎత్తివేయకుండా మొత్తానికి కలెక్టర్ ప్రకటించడంపై జగ్గారెడ్డి అభినందనలు తెలిపారు. సీఎం కేసీఆర్, విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డిలకు కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.

అదే విధంగా సంగారెడ్డిలో మినీ యూనివర్శిటీని ఏర్పాటు చేయాలని సీఎంను కోరుతున్నానని జగ్గారెడ్డి అన్నారు. యూనివర్శిటీకి అవసరమైన స్థలం,  వసతి ఉందని తెలిపారు. సంగారెడ్డిలో యూనివర్శిటీని ఏర్పాటు చేయడానికి తారా డిగ్రీ కళాశాల అనువైనదని న్యాక్ అధికారులు కూడా ప్రకటించారన్నారు. సీఎం వెంటనే చొరవ తీసుకుని యూనివర్శిటీని ఏర్పాటు చేయాలని, అందుకు 150 కోట్ల రూపాయలు ఇవ్వాలని కోరారు.

Latest Updates