సిటిజన్‌షిప్ చట్టాన్నిఅమలుచేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా

సిటిజన్‌షిప్ చట్టాన్ని మధ్యప్రదేశ్‌లో అమలు చేస్తే తన శాసనసభ సభ్యత్వాన్ని వదులుకుంటానని భోపాల్ నుంచి ఎన్నికైన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆరిఫ్ మసూద్ అన్నారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్ మరియు ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చే శరణార్థులకు భారత పౌరసత్వం ఇవ్వడానికి ఈ బిల్లుతో మార్గం సుగమం అవుతుందని ఆయన అన్నారు.

‘సిటిజన్‌షిప్ బిల్లు గురించి ప్రజలు భయపడవద్దని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. మేము మీతో ఉన్నామని, మేము ఇక్కడ ఉన్నంతవరకు మీపై ఎవరూ ఏ చట్టాన్ని బలవంతంగా రుద్దలేరని ఖరగ్‌పూర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రసంగిస్తూ మమతా బెనర్జీ అన్నారు. బిల్లుకు వ్యతిరేకంగా మమతా బెనర్జీ చూపిన ధైర్యం మన ప్రభుత్వం కూడా చూపించాలి. CAB మరియు NRC లను తిరస్కరించాలని నేను మా ముఖ్యమంత్రి కమల్ నాథ్‌ను అడుగుతాను. ఒకవేళ మధ్యప్రదేశ్‌లో ఈ చట్టాన్ని అమలుచేస్తే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను. ప్రజలందరూ మూకుమ్మడిగా వీధుల్లోకి రావాలి. ఎన్‌ఆర్‌సి, క్యాబ్‌లకు వ్యతిరేకంగా అహింసా ఉద్యమం ప్రారంభించాలి. ఈ ఉద్యమం భోపాల్ నుంచి ప్రారంభం కావాలి’ అని ఎమ్మెల్యే మసూద్ అన్నారు.

సిటిజన్‌షిప్ బిల్లును ఉభయ సభలు ఆమోదించిన తర్వాత, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఈ బిల్లుకు అంగీకారం తెలపడంతో సిటిజన్‌షిప్ చట్టం అమలులోకి వచ్చింది. ఈ చట్టం ప్రకారం, 2014 డిసెంబర్ 31లోపు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మరియు బంగ్లాదేశ్ నుండి భారత్‌కు వచ్చిన హిందూ, క్రిస్టియన్, సిక్కు, బౌద్ధ మరియు జొరాస్ట్రియన్ మతాల వారిని అక్రమ వలసదారులుగా పరిగణించకుండా.. వారికి కూడా భారత పౌరసత్వం ఇవ్వబడుతుంది.

Latest Updates