కేటీఆర్ ఫాంహౌస్​కు వెళ్లడానికి కాంగ్రెస్​ ఎమ్మెల్యేల యత్నం

మధ్యలోనే అరెస్టు చేసిన పోలీసులు

అక్రమంగా ఫాంహౌస్​ కట్టారని ఎమ్మెల్యేల ఆరోపణ

హైదరాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లా గండిపేట రిజర్వాయర్​సమీపంలోని మంత్రి కేటీఆర్​ ఫాంహౌస్​​ను పరిశీలించేందుకు బయలుదేరిన కాంగ్రెస్​ ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్టు చేశారు.  శనివారం అసెంబ్లీలో గవర్నర్​ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సమయంలో కాంగ్రెస్​ ఎమ్మెల్యేలు ఆరుగురిని సస్పెండ్ ​చేశారు. దీంతో అక్కడి నుంచి నేరుగా ఎమ్మెల్యేలు మల్లు భట్టి విక్రమార్క, శ్రీధర్​బాబు, జగ్గారెడ్డి, సీతక్క, వీరయ్య కలిసి కేటీఆర్ ఫాంహౌస్​​ను, అందులోని నిర్మాణాలను పరిశీలించేందుకు బయలుదేరారు. వారిని సబితానగర్ లోని సీబీఐటీ వద్ద నార్సింగి పోలీసులు అడ్డుకున్నారు. అయినా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ముందుకు వెళ్తుండగా .. గండిపేట సమీపంలో పోలీసులు అరెస్ట్‌ చేశారు. 111 జీవోను ఉల్లంఘించి కేటీఆర్‌ ఫాంహౌస్‌ కట్టారని భట్టి విక్రమార్క, సీతక్క ఆరోపించారు. అరెస్టు సమయంలో ఎమ్మెల్యే వీరయ్య ను పోలీసులు నెట్టివేశారు. పోలీసుల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఎమ్మెల్యేలను గచ్చిబౌలి పోలీసు స్టేషన్​కు పోలీసులు తరలించారు.

2 వేల ఎకరాలు ఆక్రమించారు: భట్టి

టీఆర్ఎస్​ నేతలు హైదరాబాద్​ చుట్టపక్కల రెండు వేల ఎకరాల భూమిని ఆక్రమించారని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. అక్రమాలకు పాల్పడిన మున్సిపల్​మంత్రి కేటీఆర్, వ్యవసాయ మంత్రి నిరంజన్​రెడ్డి వారి పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్​ చేశారు. 111 జీవో అమలులో ఉన్న ప్రాంతానికి వెళ్లకుండా తమను ఎందుకు అడ్డకున్నారని ప్రశ్నించారు. ఎవరూ అటు పోకుండా కాపాడుకోవాల్సినంత అవసరం ఏముందని నిలదీశారు. కేటీఆర్​ ఫౌంహౌస్​ విషయంలో ప్రశ్నించినందుకే ఎంపీ రేవంత్​రెడ్డిని అరెస్టు చేశారని ఆయన మండిపడ్డారు. హైదరాబాద్​లో అక్రమ కట్టడాలు ఉంటే కూల్చివేస్తామని చెప్పిన మంత్రి కేటీఆర్..  అక్రమంగా నిర్మించుకున్న ఫాంహౌస్​ విషయంలో​ఇప్పడు ఏమంటారని భట్టి ప్రశ్నించారు.

Latest Updates