ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అరెస్ట్.. పలువురిపై కేసు నమోదు

  • కేసీఆర్‌కు కాపలా ఉంటూ… మ‌మ్మ‌ల్ని రోడ్డు మీద‌కు ఈడుస్తారా?
  • ప్ర‌భుత్వాలు మార‌తాయి.. కానీ డిపార్ట్‌మెంట్ మార‌దు
  • ఒక వ్య‌వ‌స్థ‌కి లోబ‌డి ప‌నిచేయ‌డం స‌మంజ‌సం కాదు
  • పోలీసుల పై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫైర్

జగిత్యాల, వెలుగు : అధికార పార్టీకి ఒక నీతి ప్రతి పక్ష నాయకులకు ఒక నీతా? అంటూ పోలీసులపై మండిపడ్డారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి . కేసీఆర్ వేల మందితో యాగాలు చేస్తే ఆయనకు పోలీసులు కాపలా ఉంటూ కార్యక్రమం నిర్వహించారని.. తాము సామ‌ర‌స్యంగా పోరాటం చేస్తే రోడ్డు మీద‌కు ఈడుస్తున్నార‌ని అన్నారు. విద్యుత్ బిల్లుల సమస్య పై మంగళవారం విద్యుత్ కార్యాలయంలో వినతి పత్రం ఇచ్చేందుకు కాంగ్రెస్ నాయకులతో వెళుతున్న‌ జీవన్ రెడ్డిని జగిత్యాల టౌన్ పోలీసులు మార్గ‌మ‌ధ్యంలోనే అడ్డుకున్నారు. దీంతో అక్క‌డ కొద్దిసేపు ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెలకొంది. ఈ క్ర‌మంలో పోలీసులకు, కాంగ్రెస్ నాయకులకు మ‌ధ్య తోపులాట జ‌రగడంతో కాంగ్రెస్ నాయ‌కులు స్థానిక మెయిన్ రోడ్డు పై ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు ఆందోళన చేస్తున్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో స‌హా నాయకులంద‌ర్నీ బ‌లవంతంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ… కరోన వైరస్, లాక్ డౌన్ కార‌ణంగా నిరుపేద వర్గాలు, కులవృత్తులు వలస కార్మికులు, రవాణా రంగంపై ఆధారపడిన కార్మికులు, వ్యాపారస్తులు.. ఇలా ఎంతో మంది ఆర్థిక ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నార‌ని అన్నారు. అలాంటి పరిస్థితుల్లో మూడు నెలల విద్యుత్ బిల్లులు ఓకే స్లాబ్ పై అధిక మొత్తంలో రావడంతో వాటిని చెల్లించ‌డం సామాన్య ప్రజలకు భారంగా మారిందన్నారు. విద్యుత్ బిల్లులను ఒకేసారి కాకుండా మూడు దశలుగా చెల్లించే విధంగా చర్యలు చూపాలని ప్రభుత్వాన్ని కోరారు. ఉమ్మడి రాష్ట్రంలో అమలు చేయబడిన టెలిస్కోపిక్ విద్యుత్ బిల్లుల చెల్లింపు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తదుపరి నాన్ టెలిస్కోపిక్ విధానం గా మార్చడంతో గత నాలుగు సంవత్సరాల నుండి గృహ వినియోగదారులపై విద్యుత్ భారం అధికంగా పడుతుందని తెలియజేశారు.

లాక్ డౌన్ సమయంలో ఆర్థికంగా వెనుక బడి ఉన్నందున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టెలిస్కోపిక్ విధానాన్ని తిరిగి అమలు చేసినట్లయితే ప్రస్తుతం వినియోగదారుల్లో ఆందోళన తొలగించిన అవుతారన్నారు. ఈ విధానంపై విద్యుత్ శాఖ అధికారికి వినతి పత్రం ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు సామరస్యంగా వెళ్తుంటే పోలీసులు అడ్డుకోవడం సమంజసం కాదన్నారు.

రాష్ట్ర ప్రభుత్వాలు మారతాయని, రాజకీయ నాయకులు మారతారని , ఒకసారి పదవిలో ఒకరుంటే.. మరోసారి మరొకరు ఉంటారని కానీ పోలీస్ డిపార్ట్‌మెంట్ మాత్రం అలాగే కొనసాగుతుందన్నారు. పోలీస్ డిపార్ట్‌మెంట్ ఒక రాజకీయ వ్యవస్థకు లోబడి పని చేయవద్దని హెచ్చరించారు. సామాన్యులకు అండగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న‌ పోరాటాన్ని జీర్ణించుకోలేక అడ్డుకోవడం కరెక్ట్ కాదని, పోలీస్ శాఖ క్షమాపణ చెప్పాలన్నారు.

ఎమ్మెల్సీ పై కేసు నమోదు

మ‌రోవైపు నిబంధనలకు విరుద్ధంగా ర్యాలీ నిర్వహించేందుకు ప్రయత్నించి, రోడ్డుపై ఆందోళన చేసిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకుల పై జగిత్యాల టౌన్ సిఐ జయేష్ రెడ్డి కేసు నమోదు చేశారు.

congress mla jeevan reddy arrested by jagtial town police

Latest Updates