
జగిత్యాల: తెలంగాణ రాష్ట్రం వస్తే గల్ఫ్ కార్మికుల సమస్యలు తీరుతాయని భావించినా.. ఏ సమస్యా తీరలేదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. వచ్చే బడ్జెట్ సమావేశంలో ఎన్ ఆర్ ఐ పాలసీ కింద 100 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్ఆర్ఐ పాలసీ అమలు చేయాలని గ ల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక ఆధ్వర్యంలో దొనికెన కృష్ణ చేపట్టిన గల్ఫ్ కార్మికుల మహాపాదయాత్ర శనివారం జగిత్యాలకు చేరుకుంది. ఈ సందర్భంగా జగిత్యాలలో జరిగిన జనభేరి సభకు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి హాజరై మాట్లాడారు. ప్రతి సంవత్సరం సుమారు 200 శవపేటికలు గల్ఫ్ నుండి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు వస్తున్నాయని.. గల్ఫ్ లో మృతిచెందిన కార్మికుడి మృతదేహాన్ని శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి స్వగ్రామానికి తీసుకెళ్లేందుకు అంబులెన్స్ ఇవ్వడం మినహా తెలంగాణ ప్రభుత్వం నయా పైసా ఇవ్వడం లేదని జీవన్ రెడ్డి విమర్శించారు. ఈ విషయంలో ప్రభుత్వం సిగ్గు పడాలని మండిపడ్డారు. గల్ఫ్ లో మృతిచెందిన కార్మికుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, గల్ఫ్ లో చనిపోయిన కార్మికుల కుటుంబాలకు ఉపాధి హామీ కల్పించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ గురుకుల పాఠశాలలో గల్ఫ్ కార్మికుల పిల్లలను 5% శాతం రిజర్వేషన్ కల్పించాలని అన్నారు.