‘టీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఓటు వెయ్యాలో చెప్పండి’

సహకార ఎన్నికల్లో ఏ విధంగా నెగ్గాలన్న ఆలోచన తప్ప టీఆర్ఎస్ నేతలకు రైతుల అభివృద్దిపై చిత్తశుద్ధి లేదన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. సహకార వ్యవస్థనే తెలంగాణ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఆయన అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో జీవన్ రెడ్డి మాట్లాడుతూ..  అసలు అధికార టీఆరెఎస్ పార్టీకి ఎందుకు ఓటు వెయ్యాలో చెప్పాలని డిమాండ్ చేశారు. రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ మూడో స్థానంలో ఉందని అన్నారు. అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా రుణమాఫీ పై స్పష్టత లేదని, దశల వారీ విడుదల ఎలాంటి సమాచారం లేదని మండిపడ్డారు. బ్యాంకులకు పూచీకత్తుగా ప్రభుత్వం రైతుల తరుపున గ్యారంటీ ఇవ్వాలన్నారు .

రాష్ట్రం ఏర్పాటయ్యాక TRS పాలనలో రైతులు అనేక ప్రయోజనాలు కోల్పోతున్నారని జీవన్ రెడ్డి అన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా కల్లం దగ్గర వడ్లు జోకె పరిస్థితి ఎందుకొచ్చిందని ప్రశ్నించారు. రైతు బంధు నీరుగారుస్తున్నరన్నారు. ఖరీఫ్ లో మూడో వంతు రైతులకు రైతు బంధు అందలేదని, రబీలో అసలు ఎవరికి వచ్చిందో కూడా తెలియదని చెప్పారు. రాష్ట్రంలో ఇంతవరకు కందుల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలేదని, మార్కెట్ లో కందులకు రూ. 5800/- మద్దతు ధర అందేలా చూడాల్సిన బాధ్యత  రాష్ట్రానిదేనని ఆయన అన్నారు.

ఓట్ల ధ్యాస వదిలేసి రైతుల సమస్యల గురించి మాట్లాడాలని, ఎవరు గెలిచినా రైతు సంక్షేమం , సహకార వ్యవస్థను బలోపేతం చేసే విషయాల గురించి ఆలోచించాలన్నారు.

Latest Updates